పరిశీలన ముగిసింది
సాక్షి, రాజమండ్రి :సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సోమవారం ముగిసింది. రాజమండ్రి ఎంపీ సీటుకు టీడీపీ అభ్యర్థి మాగంటి మురళీమోహన్ సమర్పించిన అఫిడవిట్‌లో లోపాలున్నాయని, ఆయన భార్య ఆస్తుల వివరాలను తప్పుగా పేర్కొన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు వెంకట రమణచౌదరి ప్రతిపాదితుడు పెనుమర్తి సాయిప్రసాద్ చౌదరి రిటర్నింగ్ అధికారి గంధం చంద్రుడుకు ఫిర్యాదు చేశారు. సుమారు మూడున్నర గంటల విచారణ అనంతరం మురళీమోహన్ నామినేషన్‌ను ఆర్‌ఓ అంగీకరించారు. ఈ నిర్ణయం వివాదాస్పదం కాగా మిగిలిన ప్రాంతాల్లో పరిశీలన ప్రశాంతంగా ముగిసింది.
రాజమండ్రి ఎంపీ సీటుకు టీడీపీ అభ్యర్థి మురళీమోహన్‌కు డమ్మీగా నామినేషన్ వేసిన ఆయన కుమారుడు రామ్మోహన్‌రావు నామినేషన్ పత్రాల్లో లోపాలుండడంతో ఆర్వో తిరస్కరించారు. అమలాపురం ఎంపీ సీటుకు బీజేపీ అభ్యర్థిగా పెయ్యిల శ్యామ్‌ప్రసాద్ సమర్పించిన పత్రాల్లో ఏ, బీ ఫారాలు లేనందున, అదే పార్టీ మరో అభ్యర్థి గుర్రాల వీరరాఘవులు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించకపోవడంతో పాటు సరైన వివరాలు సమర్పించనందున, స్వతంత్ర అభ్యర్థి రేవు సుధాకర్ సమర్పించిన పత్రాల్లో పది మంది ప్రతిపాదితుల సంతకాలు లేనందున వారి నామినేషన్లను తోసిపుచ్చారు. కాకినాడ ఎంపీ సీటుకు టీడీపీ డమ్మీ అభ్యర్థి తోట సరస్వతి, ఇండిపెండెంట్ అభ్యర్థి వెంకటరమణల నామినేషన్‌లు కూడా తిరస్కరణకు గురయ్యాయి.
అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఇలా....
రాజమండ్రి అసెంబ్లీ స్థానానికి బీజేపీ, బీఎస్పీ డమ్మీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కర ణకు గురయ్యాయి. కాకినాడ రూరల్‌లో ఇద్దరు టీడీపీ డమ్మీ అభ్యర్థులు, ఒక కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థితో పాటు క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ అభ్యర్థి నామినేషన్‌లు చెల్లవని రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. కాకినాడ సిటీలో ఆర్జేడీ, క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ, మరో ముగ్గురు ఇండిపెండెంట్ల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అమలాపురం అసెంబ్లీకి జై సమైక్యాంధ్ర అభ్యర్థికి డమ్మీగా నామినేషన్ వేసిన నెల్లి రమేష్, బీజేపీ అభ్యర్థి పెయ్యిల శ్యామ్‌ప్రసాద్‌ల నామినేషన్లను తిరస్కరించారు. ప్రత్తిపాడులో ఇండిపెండెంట్, టీడీపీ డమ్మీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు.
పెద్దాపురంలో టీడీపీ రెబల్స్ ఐదుగురి నామినేషన్లు, సరైన సమాచారం పొందుపర చని కారణంగా మరో ఇద్దరు ఇండిపెండెంట్ల నామినేషన్లను తిరస్కరించారు. పి.గన్నవరంలో కాంగ్రెస్, టీడీపీ, బీఎస్‌పీ డమ్మీ అభ్యర్థుల ముగ్గురి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. రాజమండ్రి రూరల్‌లో టీడీపీ రెబల్స్‌గా బరిలోకి దిగిన ఆర్.సుబ్బరాజు, గంగుమళ్ల సత్యనారాయణ, అనుసూరి పద్మలత, గంగుమళ్ల నాగేశ్వరరావుల నామినేషన్లను సరైన ధృవపత్రాలు లేకపోవడంతో నిరాకరించారు. బీజేపీ తరఫున అద్దేపల్లి శ్రీధర్ లక్ష్మణ్ వేసిన నామినేషన్‌ను అవసరమైన సమాచారం లేని కారణంగా తోసిపుచ్చారు. ముమ్మిడివరం నియోజకవర్గలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి కె.కాశిబాబు నామినేషన్‌తో పాటు టీడీపీ, కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థుల నామినేషన్లు అనర్హతకు గురయ్యాయి.
రాజోలులో ఇండిపెండెంట్లు, డమ్మీలు కలిపి మొత్తం పది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మండపేటలో ముగ్గురు ఇండిపెండెంట్ల నామినేషన్లు చెల్లుబాటు కాలేదు. రాజానగరంలో టీడీపీ అభ్యర్థి పెందుర్తి వెంకటేష్‌కు డమ్మీగా ఆయన భార్య అన్నపూర్ణ వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. జగ్గంపేటలో కాంగ్రెస్, టీడీపీ డమ్మీ అభ్యర్థులు తోట వీరవెంకటాచలం, జ్యోతుల నాగసూర్యవేణిల నామినేషన్లను తిరస్కరించారు. రంపచోడవరంలో టీడీపీ, కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర డమ్మీ అభ్యర్థులు, ఒక ఇండిపెండెంట్ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వీరితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అనంత ఉదయ భాస్కర్ నామినేషన్‌ను కూడా తిరస్కరించారు. అనపర్తిలో టీడీపీ నుంచి టిక్కెట్ ఆశించి నామినేషన్ వేసిన పడాల సునీత, టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్టారెడ్డికి డమ్మీగా వేసిన మూలారెడ్డి, బీజేపీ అభ్యర్థి హరినారాయణరెడ్డిల నామినేషన్లు తిరస్కర ణకు గురయ్యాయి. కాగా తుని, పిఠాపురం, రామచంద్రపురం నియోజకవర్గాల్లో అన్ని నామినేషన్లూ సక్రమంగా ఉన్నాయి.