పనిచేయని వైఎస్సార్ సీపీ బటన్ | not worked of ysrcp button | Sakshi
Sakshi News home page

పనిచేయని వైఎస్సార్ సీపీ బటన్

Published Thu, May 1 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 AM

not worked of ysrcp button

 న్యూస్‌లైన్, ఇబ్రహీంపట్నం రూరల్:  ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధి ఖానాపూర్‌లోని 73వ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటుచేసిన ఈవీఎంలో వైఎస్సార్ సీపీకి కేటాయించిన బటన్ పని చేయకుండానే అధికారులు పోలింగ్ నిర్వహించారు. 226 ఓట్లు పోలైన తర్వాత ఓటర్లు గమనించి ఆ పార్టీ ఏజెంట్‌కు విషయం తెలిపారు.

 ఇతర పార్టీలకు చెందిన బటన్‌లను నొక్కగానే శ బ్ధం వస్తున్నా.. ఫ్యాన్ గుర్తుపై నాలుగైదు సార్లు నొక్కినా  శబ్ధం రావడం లేదని వారు పేర్కొన్నారు. విషయాన్ని పార్టీ అభ్యర్థి ఈసీ శేఖర్‌గౌడ్‌కు తెలపడంతో ఆయన అధికారుల సమక్షంలోనే వైఎస్సార్ సీపీకి చెందిన బటన్‌ను పరిశీలించగా.. దాని నుంచి ఎలాంటి శబ్ధం రాలేదు. దీంతో పోలింగ్‌ను నిలిపేయాలని శేఖర్‌గౌడ్ పట్టుబట్టారు. రీపోలింగ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో తేరుకున్న అధికారులు రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించి మరో ఈవీఎంను తెప్పించి.. పోలింగ్‌ను యథావిధిగా కొనసాగించేందుకు యత్నించారు. అధికారుల తీరుపై శేఖర్‌గౌడ్ నిరసన వ్యక్తం చేశారు.

తనకు సంబంధించిన బటన్ పనిచేయకుండానే 226 ఓట్లు పోలయ్యాయని.. ఇప్పుడు అదే సంఖ్య నుంచి పోలింగ్ కొనసాగించడం అన్యాయమన్నారు. రీపోలింగ్‌కు పట్టుబట్టడంతో పోలింగ్ ఆగిపోయింది. ఖానాపూర్‌లో చోటుచేసుకున్న ఘటన ఉన్నతాధికారులు, పోలీస్ అధికారుల దృష్టికి వెళ్లడంతో.. ఇబ్రహీంపట్నం ఏసీపీ సురేందర్‌రెడ్డి, సీఐ మహ్మద్‌గౌస్ పోలీస్ బలగాలతో అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి అభ్యర్థి, అధికారులు, ఏజెంట్లతో మాట్లాడారు. కొత్త ఈవీఎం ద్వారా పోలింగ్‌ను కొనసాగించాలని స్పష్టం చేశారు. సుమారు గంటన్నర తర్వాత పోలింగ్ తిరిగి కొనసాగింది. అయితే ఇది చాలా అన్యాయమని.. పోలింగ్‌ను పర్యవేక్షించే అధికారులు కనీసం గుర్తింపు కార్డులు కూడా పెట్టుకోకుండా పోలింగ్‌లో ఎలా పాల్గొంటారని.. ఏకపక్షంగా వ్యవహరిస్తూ తనకు నష్టం కలుగజేశారని శేఖర్‌గౌడ్ మండిపడ్డారు.

 ప్రిసైడింగ్ అధికారి లక్ష్మీరమణ, మైక్రో ఆఫీసర్ శ్రీనివాస్ తన అభ్యర్థన పట్ల సరిగా స్పందించలేదన్నారు. తనకు జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టర్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు శేఖర్ గౌడ్ స్పష్టంచేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement