అండగా ఉంటామన్న వారికే మద్దతు!!
* అలాంటి వారికే మా ఓట్లు
* మా పట్ల ఆలా మాట్లాడడం బాధాకరం
* మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వారేమో చుట్టాలు..
* సొంత రాష్ట్రం వారిమేమో శత్రువులమా?
* ఇదీ ‘ఆంధ్రా నగర్’ వాసుల మనోగతం
ఈ ఊరిలో అందరూ ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన వారే. ఇక్కడే భూములు కొన్నారు. ఇక్కడే వ్యవసాయం చేస్తున్నారు. వారి పిల్లలు ఇక్కడే చదివారు. ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. మొదట వచ్చిన వారు, వారి పిల్లలు, పిల్లల పిల్లలు అంటే మూడు తరల వారు ఇక్కడే ఉంటున్నారు. అయితే వీరిని ఇప్పటికీ ఆంధ్రా వారిగానే చూస్తున్నారు. ఇతర గ్రామా లతో వీరికి పెద్దగా సంబంధాలు ఉండవు. ఆ ఊరి పేరికి పేరు కూడా వారే పెట్టుకున్నారు. ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల పట్ల ఆ ఊరి ప్రజల అభిప్రాయం ఏలా ఉంటుందనే విషయంపై కొంత ప్రాధాన్యం ఏర్పడింది.
ఆంధ్రానగర్‌కు వెళ్లి అక్కడి వారిని ‘సాక్షి’ పలకరించిన ప్పుడు అసక్తికర విషయాలు వెలుగుచూశాయి. రాష్ర్టం విడిపోయే సమయంలో, విడిపోయిన తర్వాత రాజకీయ నాయకులు ప్రదర్శిస్తున్న వైఖరి పట్ల ఈ ఊరి ప్రజలు కొంత ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ వంటి పట్టణాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వారు చాలా మం ది ఉన్నారు. వారిపట్ల లేని వివక్షను తమపై చూపుతున్నార నే అభిప్రాయం వారిలో ఉంది.
ఎన్నికలకు సంబంధించి..
తమకు అండగా నిలుస్తారనే నమ్మకం కుదుర్చిన వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. గ్రామానికి సొంత రెవెన్యూ డివిజన్ (శివారు) ఏర్పడలేదు. గతంలో వైఎస్ హామీ ఇచ్చారు. అయితే వెంటనే ఆయన మృతి చెందడంతో ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదని గుర్తు చేస్తున్నారు. మమ్మల్ని ఈ రాష్ట్రం పౌరులుగానే పరిగణించాలని కోరుతున్నారు. తమ పట్ల శత్రుభావం ప్రదర్శించే వారికి ఓట్లు వేయబోమని స్పష్టం చేశారు. ఉదాహరణకు గత పదేళ్లలో స్థానిక ఎంపీ మధుయాష్కీ ఒక్క సారి కూడా ఆ గ్రామానికి వెళ్లలేదు. ఈ గ్రామం గుండా వెళ్లాల్సిన సమయంలోనూ కారును ఆపకుండానే వెళ్లిపోయేవారు.
ఎంపీ నిధుల నుంచి పైసా కూడా గ్రామానికి ఖర్చు చేయలేదని గ్రామస్తులు గుర్తు చేశారు. ఇక్కడ స్థిరపడిన వారంతా కృష్ణా, గుంటూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన వారే. 1975 నుంచి ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారు. ఇప్పుడు వారి సంతతే పెరిగి పెద్దదైంది. 1718 ఓటర్లు ఉన్న ఈ గ్రామం నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోకి వస్తుంది. దీంతో పాడిపంటలకు కొదవ లేదు. మొదట్లో నిజాంసాగర్ నుంచి నీటిని సరఫరా చేసేవారు. తర్వాత ప్రాజెక్టులో నీటి కొరత ఏర్పడి ఈ ప్రాంతంలోని ఆయకట్టుకు సమస్యలు వచ్చాయి. వైఎస్సార్ సీఎం అయ్యాక గుత్ప ప్రాజెక్టును నిర్మించారు. మళ్లీ అప్పటి నుంచి పంటలకు కావాల్సిన నీరు అందుతోంది.
రెవిన్యూ రికార్డులను మార్చాలి
మా గ్రామాన్ని ఇప్పటికే ఆంధ్రానగర్‌గా గుర్తించారు. అందులో భాగంగా సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహిస్తున్నారు. అయితే.. రెవెన్యూ రికార్డుల్లోనూ పేరు చేర్చాలి. ఆ మేరకు మా గ్రామ శివారుల్లోని భూముల పరిధిని నిర్ణయించారు. ఆలా జరగని పక్షంలో పక్క గ్రామాల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. వైఎస్ ఉంటే...ఈ సమస్య తీరేది. ఆయన హామీ ఇచ్చారు. మ సమస్యల్ని పరిష్కరించిన వారికే మా మద్దతు ఉంటుంది.
-వై.రాము
మాది తెనాలి...అయినా ఇక్కడే ఉంటాను
మాది తెనాలి ప్రాంతం. మా నాన్న వారు ఇక్కడి వ చ్చారు. నేను ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మా పిల్లలు ఇక్కడే పుట్టి...ఇక్కడే చదివారు. మా అమ్మాయికి ఇక్కడే పెళ్లి కూడా చేశాను. ఇప్పుడు తిరిగి వెళ్లడం సాధ్యం అవుతుందా ? నా జీవితం ఇక్కడే.
- ఈదర సత్యనారాయణ
మాకెలాంటి ఇబ్బంది లేదు
రాష్ర్టం విడిపోయినా మాకు ఏలాంటి ఇబ్బంది లేదు. మేం ఇక్కడే ఉంటాం. నాకు మూడు ఎకరాల పొలం ఉంది. అయితే ఇక్కడి ప్రజలు కూడా మమ్మల్ని తమ వారిగానే చూడాలి. మేం పరాయి వారిగా పరిగణించవద్దు. కొన్ని రాజకీయ పార్టీలు మా పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవాలి.
- సాంబశివరావు