తెలంగాణ కోసం పోరాడొద్దని బేరాలాడారు: కిషన్‌రెడ్డి
‘మీట్ ది మీడియా’లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోసం పోరాడొద్దంటూ కొందరు తమతో బేరాలాడేందుకు ప్రయత్నించారని.. కానీ, తాము వెనక్కు తగ్గలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన క్రెడిట్ ఏ ఒక్క నేతదో కాదని.. ఉద్యమకారులు, ప్రజలు, పార్టీలు కలిసి చేసిన పోరాటం వల్లే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని పేర్కొన్నారు. గురువారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నిర్వహించిన ‘మీట్ ది మీడియా’లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘‘తెలంగాణ రాష్ట్రం తెచ్చిన క్రెడిట్ తనదే అని ఏ నేత అయినా.. ఏ పార్టీ అయినా అంటే అంగీకరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు.
ఉద్యమకారులు, ప్రజలు, పార్టీలు చేసిన కృషి వల్లే తెలంగాణ వచ్చింది. తెలంగాణ బిల్లు విషయంలో బీజేపీ ఎంతటి గొప్ప పాత్ర పోషించిందో ప్రజలు ప్రత్యక్షంగా గమనించారు. వారికి అన్నీ తెలుసు..’’ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు మంచి చేయడం కోసమే తాము ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడామని, ఓట్లు సీట్ల కోసం కాదని చెప్పారు. తెలంగాణ కోసం పోరాడొద్దని కొందరు తమ పార్టీతో బేరాలాడేందుకు ప్రయత్నించారని, కానీ తాము వెనక్కు తగ్గలేదని కిషన్‌రెడ్డి చెప్పారు. మజ్లిస్ మినహా ఏ పార్టీతోనైనా ఎన్నికల్లో అవగాహన చేసుకోవటానికి తమ పార్టీ సిద్ధమేనన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న తెలుగుదేశంతో పొత్తుకు యత్నిస్తున్న విషయాన్ని ప్రస్తావించగా.. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రయత్నించాల్సిన సమయంలో పాత విషయాలపై చర్చించటం సరికాదన్నారు. ఆయన చెప్పిన మరికొన్ని అంశాలు..
కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను క్రమంగా దూరం చేయలనేదే మా ల క్ష్యం.
- అధికారంలోకి వచ్చాక మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేలా చూస్తాం. రిజర్వేషన్‌ను 50 శాతానికి పెంచినా మంచిదనేది మా అభిప్రాయం.
- తెలంగాణ చిన్ననీటి వనరులను తీర్చిదిద్దుతాం. సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థను బలోపేతం చేస్తాం.
- పేద వృద్ధులకు మధ్యాహ్న భోజనం తరహాలో భోజన వసతి కల్పిస్తాం.
- బీజేపీలో చేరిన సైకాలజిస్ట్ అనితా మోత్వాలీ..
- మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్ -2013 విజేత, సైకాలజిస్ట్ అనితా మోత్వాలీ ఈ సందర్భంగా బీజేపీలో చేరారు. కిషన్‌రెడ్డి ఆమెకు -కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.