ఆశల్లేవ్.. అలసిపోయాం
* ఎవరొచ్చినా మాకు ఒరగపెట్టిందేమీ లేదు
* బతకు మారడం లేదు.. భవిష్యత్తుపై నమ్మకమూ లేదు
* రాజకీయ నాయకులు, పార్టీల పట్ల నిరాసక్తత
* నేత, బీడీ కార్మికుల మనోగతం..
* గల్ఫ్ బాధితులదీ అదే పరిస్థితి
సిరిసిల్ల, ఆంధ్రానగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి బి. నారాయణరెడ్డి : ‘మా జీవితాలు మారవు.. మారుతాయన్న ఆశా లేదు. ఎవరొచ్చినా ఉద్దరించిందే మీ లేదు. ప్రతిసారి మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పటికే ఆలసిపోయాం. భవిష్యత్తు పట్ల ఆశ కూడా లేదు. ఎవరు గెలిస్తే....మాకెంటి? ఎవరు ఓడిపోతే మాకెంటి ? అందుకే ఎన్నికలంటే ఆసక్తి లేదు...ఓట్లంటే ఆనందం లేదు’ ఇదీ.. నేత, బీడీ కార్మికుల అభిప్రాయం. ఎన్నో సంవత్సరాల నుంచి బతకలేక, చావలేక.. చాలీచాలని జీతభత్యాలతో నిత్యం చస్తూ బతుకుతున్న వారి మనోగతం ఇది. రాష్ట్రంలోని బీడీ, నేత కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. పైగా ఈ రెండు వర్గాలకు ఒక అనుబంధం ఉంది. మగవారు నేత కార్మికులుగా పనిచేస్తుండగా, ఆడ వారు బీడీ కార్మికులుగా జీవితాలను గడుపుతున్నారు. ఇద్దరూ రోజుకు 12 గంటల పాటు శ్రమిస్తున్నా ఇద్దరి పిల్లలకు తృప్తిగా అన్నం పెట్టి బడికి పంపించలేని పరిస్థితి.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల హడావుడి ఈ వర్గాల ప్రజలపై ఏ మాత్రం కనిపించడంలేదు. ఈ ఎన్నికల ద్వారా తమ జీవితాల్లో జరిగే మార్పులపై వారేమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల పట్ల వీరి మనోగతాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ‘సాక్షి’ పలు ప్రాంతాల్లో పర్యటించి వారి కష్టనష్టాలను పరిశీలించింది. అయితే ఈ ఎన్నికల వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదనే నిరాశనిసృహల్లో ఈ కార్మికులు ఉన్నారు.
ఏళ్లతరబడి తమ జీవితాలను మార్చాలని కోరుతున్నా...ఏ నాయకుడూ ఆదుకోలేదనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి కొంత వరకు తమ కష్టాలను గట్టెక్కించాలని ప్రయత్నించినా మిగిలిన వారు పట్టించుకోలేదన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పనిగట్టుకుని వచ్చి పలకరించిన వారు ఆ తర్వాత మరిచిపోతుండడంతో ఎన్నికలంటే ఏ మాత్రం ఆసక్తి ఉండడం లేదని చెబుతున్నారు. రాష్ర్టవ్యాప్తంగా 8 లక్షల మంది బీడీ కార్మికులున్నారు. ఇందులో ఎక్కువగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. అలాగే 70 వేల మరమగ్గాల కార్మికులు ఉన్నారు. ఇందులో ఒక్క కరీంనగర్ సిరిసిల్లలోనే 35వేల కుటుంబాలు ఉన్నాయి.
కరెంట్ షాక్
విద్యుత్ చార్జీలు పెరగడంతో చేనేతరంగం మరింత సంక్షోభంలోకి వెళ్లింది. యూనిట్‌కు ఒక్క రూపాయి ఉండే చార్జీ కాస్త ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ పోను ప్రస్తుతం రెండు రూపాయలకు పెరిగింది. ఫలితంగా ఎనిమిది మరమగ్గాలు నడపాలంటే సుమారు నాలుగు వేల రూపాయలు విద్యుత్ చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. నెలంతా కష్టపడ్డా నాలుగు వేల రూపాయలు జీతం కూడా యజమానికి గిట్టుబాటు కావడం లేదు.
నేత కార్మికుల పరిస్థితి మరీ దారుణం
నేత కార్మికులు రోజులకు 12 గంటలు పనిచేయాలి. ఆలా చేస్తే రోజుకు రూ.150 నుంచి రూ.200 వరకు గిట్టుబాటు అవుతుంది. అది కూడా ఒక వారం పగలు పనిచేస్తే మరో వారం రాత్రి పూట పనిచేయాల్సి ఉంటుంది. పనిచేసే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అనుకున్న మేర వస్త్రం తయారుకాదు. దీంతో కూలి కూడా తగ్గిపోతుంది. రోజుకు 8 గంటల పనితో పాటు, మీటరకు ఇప్పుడిచ్చే రూ. 1.40లను 2 రూపాయలకు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
రోజంతా కష్టపడ్డా రూ.వంద గగనమే
రోజుకు 12 గంటలు కష్టపడ్డా వంద రూపాయలు కూడా రావడం లేదని బీడీ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఉపాధిహామీ పథకంలో కనీస వేతనం 130 రూపాయలు ఇస్తుండగా రోజంతా పనిచేసినా తమకు రూ.వంద కూడా రావడం లేదని చెబుతున్నారు. బీడీ కార్మికులు వెయ్యి బీడీలు చుడితే 115 రూపాయలు నుంచి 124 రూపాయలు చెల్లిస్తున్నారు. ఒక్కొక్కరు రోజుకు 600-800 బీడీలు మాత్రమే చుడుతున్నారు.
రూ. ఆరు వేలతో బతికేదెలా
మగ్గం 30 ఏళ్ల నుంచి నేస్తున్నా. ఇప్పటికీ నా జీతం రూ.ఆరువేలే. ఈ జీతంతో భార్యా, పిల్లల్ని ఎలా బతికిం చాలి ? ఇప్పటికే జీవితంలో చాలా అలసటకు గురయ్యా. ఓపిక నశిం చింది. ఇంకా ఎన్ని రోజులు పనిచేస్తానో తెలియదు. వరుసగా12 గంట లు పనిచేయాలంటే అలసిపోతున్నా. రాత్రిళ్లు పనిచేయలేకపోతున్నా.
- విశ్వనాథం, సిరిసిల్ల
ఏ అవకాశం లేక మగ్గం నేస్తున్నా
ఏపనీ దొరకడంలేదు. అందుకే మగ్గం పని చేస్తున్నా. మా నాన్న ఇదే పనిచేశాడు. ఇప్పుడు నా వంతు. దీనికంటే పార పనికి వెళ్లినా ఎక్కువ జీతం వస్తుంది. డిగ్రీ చేశాను. అయినా ఉద్యోగం లేదు. దాంతో పదేళ్ల నుంచి చాలీచాలని జీతాలకే మగ్గం పనిచేస్తున్నా.
- భూమేష్
ఎనిమిది మగ్గాలు ఉన్నా...
అప్పులు చేసి ఎనిమిది మగ్గాలను నడిపిస్తున్నా. అయినా జీతం కూడా మిగలడంలేదు. కరెంట్ చార్జీలు పెరగడం, ఆర్డర్లు సరిగ్గా లేకపోవడంతో కష్టాలు తప్పడంలేదు.
- వెంకటేశం, మరమగ్గాల యజమాని
బీడీలు చుడితేనే కాలేజీ ఫీజు
నాన్న లేడు. అమ్మ నేత కార్మికురాలు. మూడువేల జీతం వస్తోంది. దాంతో నేను బీడీలు చుడుతున్నాను. బీడీల ద్వారా వచ్చే డబ్బులతోనే కాలేజీ ఫీజులు కడుతున్నా. మాకీ కష్టాలు ఇంకెన్నాళ్లో అర్థం కావడం లే దు.
- స్వప్న, ఇంటర్‌విద్యార్థిని
బీడీలు చుట్టి ఆస్తమా తెచ్చుకున్నా
చిన్నప్పటి నుంచి బీడీలు చుట్టిచుట్టీ ఆస్తమా రోగానికి గురయ్యా. వేలుఖర్చు పెట్టి చికిత్స చేయించున్నా. అయినా పూర్తిగాతగ్గలేదు. పొగాకు వల్ల ఇలాంటి రోగాలు వస్తాయి. అయినా బీడీలు చుట్టే పనితప్పడం లేదు.
- విజయలక్ష్మి
బీడీలే ఆధారం
నేత కార్మికుడిగా ఉన్న నా భర్త ప్రమాదానికి గురయ్యాడు. దాంతో ఏం పనీచేయలేని పరిస్థితి. నేను బీడీ చుడితేనే ఇంటికి ఆధారం. రోజు 12గంటలకు కష్టపడ్డా తిండికి సరిపోవడం లేదు. బతుకంటే భయం వేస్తోంది.
- వి.లత