హైదరాబాద్, న్యూస్‌లైన్: నగదు తరలింపు కేసులో మాజీ మంత్రి పార్థసారథి సతీమణి కమలను గురువారం వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. సీఐ గోపాలకృష్ణమూర్తి కథనం ప్రకారం.. ఈ నెల 18న కేపీహెచ్‌బీ నుంచి గుంటూరు వెళ్లే ఆర్టీసీ బస్సులో మాజీ మంత్రి పార్థసారథి సతీమణి కమల రూ. 45.10 లక్షల నగదుతో వెళ్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌వోటీ, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా ఆటోనగర్ ప్రాంతంలో బస్సు తనిఖీ చేయగా, ఆమె వద్ద రూ. 45.10 లక్షల నగదు ఉండడంతో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కమల గురువారం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. దీంతో ఆమెను అరెస్టు చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. కాగా, తన వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించి అన్ని ఆధారాలున్నాయని మాజీమంత్రి సతీమణి కమల ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులకు రాతపూర్వకంగా సమర్పించినట్లు చెప్పారు.
ప్రతి రూపాయికీ లెక్కుంది: మాజీ మంత్రి పార్థసారథి
తన భార్య కమల వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదులో ప్రతి రూపాయికి తమ వద్ద లెక్క ఉందని, డబ్బు తరలింపులో ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని వైఎస్సార్‌సీపీ మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఆయన సతీమణి కమలను గురువారం అరెస్టు చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన గురువారం రాత్రి ‘సాక్షి’తో మాట్లాడారు. నిర్మాణ కంపెనీకి సంబంధించిన మెటీరియల్ సప్లయర్స్‌కు కొద్దినెలలుగా బిల్లులు ఇవ్వడం లేదని, వారి బకాయిలు చెల్లించేందుకు ఆమె నగదు తెస్తున్నారని చెప్పారు. దీంతోపాటు ఎంపీగా పోటీ చేస్తున్న తనకు ఎన్నికల ఖర్చుల కోసం కూడా కొంత నగదు తీసుకువస్తున్నారని తెలిపారు. ఎన్నికల ఖర్చుకోసం విజయవాడలోని కార్పొరేషన్ బ్యాంక్‌లో ఖాతా కూడా తెరిచినట్టు సారథి తెలిపారు.