వంద కోట్లు దాటిన పోలీసు కలెక్షన్లు
కట్టలు తెగుతున్నాయి.. దేశంలో ఎక్కడా కనీ వినీ ఎరుగని రీతిలో మన రాష్ట్రంలో డబ్బు మంచినీళ్లలా ప్రవహిస్తోంది. ఎన్నికల కాలం కావడంతో పంచడానికే తీసుకెళ్తున్నారో, ఇంకేం చేస్తున్నారో గానీ వంద కోట్లకు పైగా ఇప్పటికే పట్టుబడింది. దేశం మొత్తమ్మీద 195 కోట్ల రూపాయలు పట్టుబడితే, అందులో కేవలం మన రాష్ట్రం వాటా ఒక్కటే 118 కోట్ల రూపాయలు!! ఇదంతా చూసి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నాయకుల సంపాదన చాలా ఎక్కువగా ఉన్నట్లుందని నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 118 కోట్లు స్వాధీనం చేసుకోగా, తమిళనాడులో 18.31 కోట్లు, మహారాష్ట్రలో 14.40 కోట్లు, యూపీలో 10.46 కోట్లు, పంజాబ్లో 4 కోట్ల రూపాయలను మాత్రమే పట్టుకున్నారు.
పాతబస్తీలోని చిన్న చిన్న సందుల్లో గాలించినప్పుడు కూడా కొన్ని వాహనాల్లోంచి ఏకంగా ఆరేసి కోట్ల రూపాయలు పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. కిలోల కొద్దీ బంగారం, కట్టల కొద్దీ డబ్బులు ఎక్కడ పడితే అక్కడే పట్టుబడుతున్నాయి. పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటుచేసి ఎక్కడికక్కడే డబ్బులు స్వాధీనం చేసుకుంటున్నారు. కేవలం కార్లనే కాక.. అన్ని రకాల వాహనాలనూ వదలకుండా తనిఖీ చేయడంతో వంద కోట్లకు పైగా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
అయితే, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు పోలీసులు ఎన్ని రకాలుగా డబ్బులు పట్టుకుంటున్నా, మరిన్ని మార్గాల్లో డబ్బు తరలిస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆర్టీసీ బస్సులు, చివరకు ఆటోల్లో కూడా డబ్బులు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వీటినైతే పోలీసులు పెద్దగా పట్టించుకోవట్లేదన్న ఉద్దేశంతో ఇలా తరలిస్తున్నారని సమాచారం. గతంలో ఎన్నికల సందర్భంగా ఏకే మహంతి డీజీపీగా ఉన్న సమయంలో కార్లకు ఉండే స్టెఫినీ టైర్లలో దాచి తరలిస్తున్న సొమ్మును కూడా పట్టుకున్నారు. ఈసారి కూడా అంతే పటిష్ఠంగా నిఘా పెట్టి ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా ప్రయత్నిస్తున్నా.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం డబ్బుల పంపిణీ యథేచ్ఛగా జరిగిపోయింది.