చిరంజీవి
ఢిల్లీ: తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన విధానాలపై తనకు అవగాహనలేదని కేంద్ర మంత్రి చిరంజీవి చెప్పారు. చిరంజీవి నివాసంలో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. సీమాంధ్రలో లోక్సభ, శాసనసభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా మ్యానిఫెస్టో తయారు చేసినట్లు తెలిపారు. సీమాంధ్రలో ప్రతి ఆడబిడ్డకు వంద గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. అభద్రతా భావంతో కొంతమంది నేతలు పార్టీని వీడారని, అయితే కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్తోనే ఉన్నారన్నారు. లోక్సభ, శాసనసభ అభ్యర్థుల ఎంపిక పూర్తి అయిందని చెప్పారు. టిక్కెట్ల కేటాయింపులో ఈ సారి యూత్ కాంగ్రెస్ వారికి, కొత్తవారికి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. పార్టీకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన నష్టం అంతాఇంతాకాదన్నారు. ఇప్పటికే 150 మంది పేర్లు ఖరారయినట్లు రఘువీరా చెప్పారు.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ సాయంత్రం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశం తరువాత సీమాంధ్ర అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని భావిస్తున్నారు.