'నా ఆస్తి 10 కోట్లు.. అప్పు 18 లక్షలు'
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆస్తి ఎంతో తెలుసా.. అక్షరాలా పదికోట్ల రూపాయలు మాత్రమే!! అమేథీలో నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. ఈ సందర్భంగా జతచేసిన అఫిడవిట్లో తన ఆస్తిపాస్తుల వివరాలు పేర్కొన్నారు. తనకు రూ. 1,32,48,284 విలువైన స్థిరాస్తులు, రూ. 8,07,58,265 విలువైన చరాస్తులు ఉన్నాయని తెలిపారు. 2012-13 సంవత్సరంలో తన ఆదాయం రూ. 92,46,973గా పేర్కొన్నారు. తనకు చేతిలో కేవలం రూ. 35వేల నగదు మాత్రమే ఉందని, మూడు బ్యాంకుల్లో తాను రూ. 9.50 లక్షలు డిపాజిట్ చేశానని వివరించారు. షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, డిబెంచర్లలో రూ. 1.90 లక్షల పెట్టుబడులు పెట్టారు.
తనవద్ద 330 గ్రాముల నగలు ఉన్నాయని, వాటి విలువ రూ. 2.88 లక్షలని రాహుల్ గాంధీ చెప్పారు.తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి తనకు ఢిల్లీ మెహరౌలీ ప్రాంతంలోని సుల్తాన్పూర్ గ్రామంలో ఇందిరాగాంధీ ఫాంహౌస్ ఉందని, దాని విస్తీర్ణం 4.692 ఎకరాలని పేర్కొన్నారు. ఇందులో సగం తనది కావడంతో దాని విలువ రూ. 1,32,48,284 అని తెలిపారు. తల్లి సోనియా గాంధీ నుంచి రూ. 9 లక్షల రుణం తీసుకున్నానని, మరో 9 లక్షల అప్పు ఉందని చెప్పారు.