అమీతుమీ | Rebel menace haunts TDP, YSRC relieved | Sakshi
Sakshi News home page

అమీతుమీ

Published Thu, Apr 24 2014 1:17 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

అమీతుమీ - Sakshi

అమీతుమీ

సాక్షి, ఏలూరు :టీడీపీని పెంచి పోషించి.. పార్టీ అధినేతను కడదాకా మోసి.. చివరకు బోయూలుగానే మిగిలిపోయిన వారంతా చంద్రబాబుపై కత్తులు దూస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఓడించి తీరుతామని శపథాలు చేస్తున్నారు. ఫలితంగా జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. పార్టీ శ్రేణులు సహకరించకపోవడంతో అభ్యర్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. మనసులోని మాటను.. తమ ఆవేదనను ఇటీవల జిల్లాలో పర్యటించిన చంద్రబాబుకు విన్నవించుకునే ప్రయత్నం చేసినా ఆయన కనీసం పట్టించుకోకపోవడంతో పార్టీపై పలువురు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఐదు స్థానాల్లోటీడీపీ రెబెల్ అభ్యర్థులు బరిలోకి దిగారు.
 
 కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావు, పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి), తాడేపల్లిగూడెంలో మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగటంతో టీడీపీ అధినేతకు ముచ్చెమటలు పడుతున్నాయి. వీరంతా చివరి నిమిషంలో నామినేషన్లు ఉపసంహరించుకుంటారని పార్టీ నాయకులు భావించగా వారు ససేమిరా అన్నారు. దీంతో పార్టీ అభ్యర్థులకు వచ్చే కొద్దిపాటి ఓట్లు కూడా వీరివల్ల చీలిపోతాయని టీడీపీ వర్గాలు ఆందోళన చెం దుతున్నాయి.
 
 ‘నేను గెలుస్తా.. మీరు గెలవగలరా’ అం టూ రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి మురళీ మోహన్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావు ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తనకు సీటు రాకుండా చేసిన మురళీమోహన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తారని రామారావు మాటలను బట్టి స్పష్టమైంది. మురళీమోహన్‌తోపాటు కొవ్వూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కేఎస్ జవహర్‌ను చిత్తుగా ఓడించటమే లక్ష్యంగా రామారావు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. పాలకొల్లు సీటును డాక్టర్ బాబ్జికే ఇస్తున్నట్లు ఊరించి.. చివరి క్షణంలో చంద్రబాబు ఆయనను మోసగించడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నారుు. మంచి వ్యక్తిగా పేరున్న బాబ్జిని పక్కనపెట్ట డాన్ని అక్కడి నాయకులు, కార్యకర్తలు అవమానంగా భావిస్తున్నారు.
 
 రామానాయుడిని ఓడించడమే లక్ష్యం గా పనిచేస్తామని ఇప్పటికే ప్రకటించారు కూడా. బీజేపీతో పొత్తు పెట్టుకుని తాడేపల్లిగూడెం స్థానాన్ని ఆ పార్టీకి కేటాయించడంతో పైడికొండల మాణిక్యాలరావు బరిలోకి దిగారు. ఆయనపై కొట్టు సత్యనారాయణ పోటీకి దిగారు. చంద్రబాబు సూచనల మేరకే కొట్టు సత్యనారాయణ బరిలో ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ బలమైన అభ్యర్థులను నిలబెట్టలేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. అటు సొంత వారికి, ఇటు పొత్తు పెట్టుకున్న బీజేపీకి వెన్నుపోటు పొడిచే ఉద్దేశంతోనే తెరవెనుక చంద్రబాబు నాటకం ఆడిస్తున్నారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. నరసాపురం, పోలవరం స్థానాల్లో రెబల్స్ గుబులు రేపుతుండగా, భీమవరం, నరసాపురం, ఆచంట, ఉండి, దెందులూరు నియోజకవర్గాల్లోనూ అసంతృప్తి సెగలు రగులుతున్నారుు. 
 
 సమైక్యంగా ముందుకు...
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతలు సమైక్యతను చాటిచెప్పారు. పాలకొల్లులో గుణ్ణం నాగబాబు,  ఆచంటలో కండిబోయిన శ్రీనివాస్, దెందులూరులో పీవీ రావు, నిడదవోలులో జక్కంశెట్టి రాకేష్ బుధవారం నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో రెబెల్స్ లేని ఏకైక పార్టీగా వైఎస్సార్ సీపీ సమైక్యతను ప్రదర్శిస్తోంది. నామినేషన్లు ఉపసంహరించుకున్న వారితో పాటు వైఎస్సార్ సీపీ నేతలంతా తమ పార్టీలో గ్రూఫు రాజకీయాలు లేవని ఘంటాపథంగా చెబుతున్నారు. విశ్వసనీయతకు పట్టంగట్టేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement