ఫేస్‌బుక్ పంచ్: అందుకు ‘సేన’ అక్కర్లేదు!
మోడీకి మద్దతిస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందన
‘డిసప్పాయింటెడ్.. కన్ఫ్యూజ్‌డ్. ఆ ఆవేశం ఎటు పోయింది. ఒక అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మరో అరాచకాన్ని అరువు తెచ్చుకోవడం పోరాటం అనిపించుకోదు. దీనికి సేనతో పనిలేదు. ఒక వ్యక్తిని గెలిపించండి అని చెప్పడానికి ఇంత ఆవేశం అక్కర్లేదు. ఈ ఆవేశం పోరాటాలకు దాచుకుందాం. కులం, మతం, ప్రాంతం పేరున విద్వేషాలు రేపి ఎలక్షన్లలో గెలవాలనుకునే ఏ వ్యక్తికి గానీ, పార్టీకి గానీ మనల్ని పరిపాలించే అర్హత లేదు’
తెలుగు సినీ పరిశ్రమలో సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ డెరైక్టర్‌గా పేరున్న శేఖర్ కమ్ముల సినీ హీరో పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టిన తరువాత వైజాగ్‌లో చేసిన ప్రసంగంపై ఫేస్‌బుక్‌లో చేసిన కామెంట్ ఇది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి మద్దతిస్తున్నానంటూ పవన్ చేసిన వ్యాఖ్య తననెంత కుదిపేసిందో శేఖర్ కమ్ముల ఇందులో క్లుప్తంగా వివరించారు. పవన్ కళ్యాణ్ నుంచి ఇంకెంతో ఆశించి, భంగపడ్డ అభిమానుల నిరుత్సాహాన్ని, నిరాశను శేఖర్ తన కామెంట్‌లో ప్రతిబింబించారు. ముఖ్యంగా ఒక వ్యక్తిని గెలిపించండి అని చెప్పడం కోసం జనసేన అక్కర్లేదని ఆయన నిర్మొహమాటంగా స్పష్టం చేశారు.
ఎన్నికల్లో గెలిచేందుకు విద్వేషాల్ని రెచ్చగొట్టే వారికి మనల్ని పరిపాలించే అర్హత లేదంటూ పవనిజాన్ని తిరస్కరించారు. జనసేన ఏర్పాటును ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో చేసిన మొదటి ప్రసంగాన్ని ప్రశంసించిన శేఖర్ కమ్ముల.. వైజాగ్ ప్రసంగంలో పవన్ తీసుకున్న నిర్ణయంపై తన వ్యతిరేకతను స్పష్టంగా చెప్పారు. సాధారణంగా తెలుగు సినీ పరిశ్రమలో మొహమాటాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటిది అదే పరిశ్రమకు చెందిన శేఖర్ కమ్ముల పవన్‌కళ్యాణ్ ఉద్దేశాలపై స్పష్టంగా, నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం సంచలనం రేకెత్తించింది. ఆ కామెంట్స్‌పై ఫేస్‌బుక్‌లో మంచి స్పందన లభించింది.