గాంధీనగర్ లో మోడీని కలవనున్న పవన్
న్యూఢిల్లీ : 'కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో' అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన సినీనటుడు పవన్ కల్యాణ్ గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నాడు. ఈ సందర్బంగా అతడు ఎన్నికల కమిషన్ అధికారులతో పాటు, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో భేటీకి అపాయింట్ మెంట్ ఖరారు అయ్యింది. పవన్ కల్యాణ్ శుక్రవారం సాయంత్రం గాంధీనగర్ లో మోడీతో సమావేశం కానున్నాడు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అవగాహనపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.
కాగా పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన పార్టీ ‘జనసేన’కు ప్రస్తుత ఎన్నికల బరిలో చోటు లభించేలా లేదు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూలు విడుదలవడం, ఎన్నికలకు అతితక్కువ వ్యవధి ఉండడం, పార్టీ కోసం దరఖాస్తు చేసుకుని కొద్దిరోజులే కావడం చూస్తుంటే తక్షణం పార్టీ ఏర్పాటు సాధ్యం కాదని తెలుస్తోంది. అయితే స్వతంత్రులుగా వేర్వేరు గుర్తులపై పోటీచేసుకునే అవకాశం మాత్రం ఉంటుంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మను మీడియా సంప్రదించినప్పుడు దీనిపై స్పష్టత ఇచ్చారు.
‘జనసేన పేరుతో మార్చి 10న ఒక దరఖాస్తు వచ్చింది. ఆ దరఖాస్తులో పవన్‌కల్యాణ్‌ను అధ్యక్షుడిగా పేర్కొన్నారు. జనసేన పార్టీతో పోటీ చేస్తామని ఉంది. రెండు రోజులే అయింది ఆ లెటర్ వచ్చి. ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో అది కష్టం. నోటిఫై చేయాలి. పబ్లిక్ హియరింగ్ కావాలి. ఈ ప్రక్రియ పూర్తవ్వాలంటే ఆరేడు నెలలు పడుతుంది. ఈ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. దానిలోపే రిజిస్ట్రేషన్ చేయడం అనేది కష్టం..’’ అని తెలిపారు.
రిజిస్ట్రేషన్ జరగకుండా ఆ పార్టీ ఎన్నికలలోకి వెళ్లవచ్చా? అన్న ప్రశ్నకు బదులుగా ‘పార్టీ పేరు మీద వెళ్లకూడదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేకుండా పార్టీ ఎలా పెడతారు? రిజిస్ట్రేషన్ తప్పకుండా ఉండాలి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసుకోవచ్చు’ అని పేర్కొన్నారు. పార్టీ పేరును ఉపయోగించుకోవచ్చా? అన్న ప్రశ్నకు బదులుగా ‘రిజిస్ట్రేషన్ లేకుండా ప్రకటిస్తే.. వేరే పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. రిజిస్ట్రేషన్ లేకుండా అసలు ప్రకటించకూడదు. పబ్లిక్‌గా వాడుకోకూడదు..’ అని స్పష్టం చేశారు.