సెంటిమెంట్ జిల్లా
- అన్ని పార్టీల ప్రచారాలు ఇక్కడే షురూ
- అభ్యర్థుల కంటే అతిరథులదే హవా..
- నేటితో ముగియనున్న ప్రచారం
సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలకు కరీంనగర్ సెంటిమెంట్ జిల్లాగా మారింది. ఇక్కడి నుంచి ప్రచారం మొదలుపెడితే కలిసివస్తుందని భావించిన ఆయా పార్టీల అతిరథులు తమ ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికల ప్రచారాలను టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల అధినేతలు ఇక్కడి నుంచే ప్రారంభించి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్ : జిల్లాలో అభ్యర్థుల కంటే అతిరథులే ఎక్కువగా ప్రచారాలు నిర్వహించడం గమనార్హం. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి కరీంనగర్‌ను సెంటిమెంట్‌గా భావిస్తున్న ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు శంఖారావం పేరుతో తన ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టారు. సోమవారం చివరి రోజు కూడా ఆయన రానున్నారు. పార్టీ నేత హరీశ్‌రావు జిల్లాలో ప్రచారంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి ఎన్నికల ప్రచార సభను ఇక్కడి నుంచే ప్రారంభించారు. కేంద్ర మంత్రులు జైరాం రమేశ్, గులాంనబీ ఆజాద్ ఇక్కడ విస్తృతంగా పర్యటించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ సైతం తెలంగాణలో ప్రచారం మొదలుపెట్టిన మొదటిరోజే జిల్లా కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఆ పార్టీ తరఫున సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ హుస్నాబాద్‌లో ప్రచారం నిర్వహించారు. సోమవారం సిరిసిల్ల, కోరుట్ల సభల్లోనూ పాల్గొననున్నారు. మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, ఎల్.రమణతోపాటు ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు.
నేటితో ప్రచారానికి తెర
సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుం ది. పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారం ముగించాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది. దీంతో సోమవారం సాయంత్రం 4 గంటల్లోపు ప్రచా రం ముగించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ వెలువడిన నాటినుంచి ప్రచారంతో హోరెత్తిన మైకులు మూగబోనున్నాయి.
సమయం ముగిసిన తర్వాత ఎక్కడైనా వాహనాలకు జెండాలు, కరపత్రాలతో నినాదాలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తారు. ఆయా వాహనాలు సీజ్ చేస్తారు. ఈసారి ఎన్నికల కమిషన్ నిబంధనలు పటిష్టంగా అ మలు చేయడంతో అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలవడంతోపాటు కొత్త తరహాలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. సకుటుంబసపరివారంగా ప్రచారం నిర్వహించారు. ఎస్‌ఎంఎస్‌లు, వెబ్‌సైట్లు, వాయిస్ మెసేజ్‌లతో ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. బల్క్ మెసేజ్‌లపై కూడా ఎన్నికల సంఘం కొరడా విధించడంతో ఇక ఎలాంటి ప్రచారానికి తావు లేకుండాపోయింది.