పవన్ బన్సల్ కు ఎన్నికల సంఘం షోకాజ్
మామూలు టైమ్ లో ఏదంటే అది మాట్లాడవచ్చు కానీ ఎన్నికల సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది కోడ్ ఉల్లంఘనో, ఏది ఉల్లంఘన కాదో చెప్పడం కష్టం. చండీగఢ్ నుంచి బరిలో ఉన్న కేంద్ర మంత్రి పవన్ బన్సల్ ఎప్పట్లాగే బిజెపిపై మతపరమైన ఆరోపణలు చేశారు. దీంతో ఎన్నికల కమీషన్ ఆయనకు అలా ఎందుకు మాట్లాడావంటూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది.
బన్సల్ ఓట్లడిగేందుకు ముస్లింల సభకి వెళ్లి 'ముస్లింలు బాబరీ కూల్చివేతను, గోధ్రా నరమేథాన్ని ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు' అని తనకు ఓట్లేయమని అడిగారు. ఇది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని బిజెపి ఆరోపించింది. అంతే కాదు. కాంగ్రెస్ నేతలు బిజెపి అభ్యర్థి, నటి కిరణ్ ఖేర్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని కూడా బిజెపి ఫిర్యాదు చేసింది.
దీంతో ఎన్నికల సంఘం మూడు రోజుల్లో తన వాదనను వినిపించాల్సిందిగా పవన్ బన్సల్ కి నోటీసులు జారీ చేసింది. పవన్ భాయి ఇప్పుడు అసలు తానేం మాట్లాడాడు, అందులో అభ్యంతరకరమైనదేమిటి తెలుసుకునేందుకు తన స్పీచిని తానే వింటూ కాలం గడుపుతున్నారు. 'పవన్ బన్సల్ చాలా తెలివైన వారు. ఆయన అనుభవజ్ఞుడైన కేంద్ర మంత్రి. ఆయన ఇలాంటి మాటాలు మాట్లాడరు' అంటున్నారు ఆయన అనుచరులు.