బీజేపీ, టీడీపీ తోడు దొంగలు | Sonia Gandhi slams TDP, BJP over poll pact; low turnout at rally | Sakshi
Sakshi News home page

బీజేపీ, టీడీపీ తోడు దొంగలు

Published Sat, May 3 2014 1:12 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

గుంటూరులో జరిగిన సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న సోనియా - Sakshi

గుంటూరులో జరిగిన సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న సోనియా

* ఆ రెండు పార్టీలకు ఓటేస్తే మతతత్వ శక్తులను ప్రోత్సహించినట్లే
* గుంటూరు ఎన్నికల ప్రచార సభలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ
 
సాక్షి, గుంటూరు: బీజేపీ, టీడీపీలు రెండూ తోడు దొంగల పార్టీలని, 2002లో గుజరాత్‌లోని గోద్రాలో మారణహోమం జరిగినప్పుడు ఎన్డీఏలోని చాలా మంది బీజేపీని వదిలి వెళ్లిన చంద్రబాబు ఇప్పటికీ వారిని హత్తుకుని అపవిత్ర కలయికతో మీ ముందుకు వస్తున్నాడని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి శుక్రవారం గుంటూరులోని ఆంధ్రా ముస్లిం కళాశాల మైదానంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు.

బీజేపీ, టీడీపీలకు ఓటు వేస్తే మతతత్వ శక్తులను ప్రొత్సహించినట్లేనని ఉద్ఘాటించారు. తెలంగాణా అంశంలో నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా వ్యధకు లోనయ్యానని, సీమాంధ్రుల సెంటిమెంట్, అభిప్రాయాలు, ఇబ్బందులు, హైదరాబాద్‌పై మీకున్న మమకారం తెలుసుకున్నానని చెప్పారు. కానీ ఇది ఇప్పటి సమస్య కాదు కాబట్టి చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ వివరించే ప్రయత్నం చేశారు. సీపీఎం మినహా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చాయని, తెలుగుదేశం పార్టీ అయితే రెండు సార్లు లేఖ ఇచ్చిందని చెప్పారు.

ఇన్ని సౌకర్యాలిచ్చింది సీమాంధ్రకే..
తెలంగాణ ఇస్తూనే సీమాంధ్రలోని 13 జిల్లాల ప్రజల యోగ క్షేమాలు దృష్టిలో ఉంచుకుని పరిష్కారం చూపామని సోనియా అన్నారు. దేశంలో విభజన జరిగేటప్పుడు చట్ట రూపంలో ఇన్ని సౌకర్యాలు మొట్టమొదటగా ఇచ్చింది సీమాంధ్రకేనంటూ వివరించారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వారి ప్రాణ, ఆస్తుల రక్షణ, వారి యోగ క్షేమాలు చూసేందుకు పదేళ్ళపాటు గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఇచ్చామని ఆమె తెలిపారు. హైదరాబాద్‌లో పదేళ్ళపాటు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలతోపాటు అడ్మిషన్లు యథాతథంగా జరిగేలా చూస్తామన్నారు.

వైఎస్సార్ జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మిస్తామని, ఆంధ్రాలో కొత్త రైల్వే జోన్, నెల్లూరులో ఒక పోర్టును ఏర్పాటు చేస్తామన్నారు. సీమాంధ్రలో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్‌ఐటీలతోపాటు సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. సీమాంధ్రకు పదేళ్ళపాటు స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తామని, అంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు 90శాతం ఉచితంగా, పది శాతం రుణంగా ఇచ్చే ఏర్పాటు చేస్తామని వివరించారు.

సీమాంధ్రలో అనేక పట్టణాలు హైదరాబాద్‌ను తలదన్నేలా తయారవుతాయని నమ్ముతున్నానన్నారు. కాపు, బలిజ కులాలను బీసీల్లో చేర్చడంతోపాటు కొన్ని బీసీ వర్గాలను ఎస్సీ, ఎస్టీల్లో చేరుస్తామని, రైతులకు రుణ మాఫీ చేయడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. 2014లో 130 కోట్ల మంది ఆరోగ్య హక్కుకు చట్టబద్ధత కల్పిస్తామని, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు నిర్మించే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రసంగం ముగించేముందు జైహింద్... జై కాంగ్రెస్... జై సీమాంధ్ర అంటూ ముగించారు.

అనంతరం గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులను ఒక్కొక్కరిని పైకి పిలిచి పరిచయం చేశారు. సభలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, కేంద్ర మంత్రులు చిరంజీవి, పనబాక లక్ష్మి, జేడీ శీలం, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.

సోనియా చూపుతో వణికిపోయిన నాయకులు
హెలికాప్టర్‌లో నేరుగా సభా ప్రాంగణానికి చేరుకున్న సోనియా గాంధీకి కేంద్ర మంత్రులు, జిల్లా నాయకులు వరుసగా నిలబడి అభివాదాలు చేశారు. వేదికపై ప్రసంగం మొదలు పెట్టిన సోనియా.. సోదర సోదరీమణులారా నమస్కారం.. అని తెలుగులో అన్నారు. అనంతరం హిందీలో ఆమె చేసిన ప్రసంగానికి కేంద్ర మంత్రి జేడీ శీలం తెలుగులో అనువాదం చేశారు.

అయితే అనేక చోట్ల ఆయన తడబడడంతో సోనియా పలు మార్లు అసహనం వ్యక్తం చేస్తూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర సహాయ మంత్రి చిరంజీవిలవైపు గుర్రుగా చూడడంతో వారు వణికిపోతూ ప్రసంగం కాపీని తీసుకొచ్చి జేడీ శీలంకు అందించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేసే వారంతా సోనియా ప్రసంగం సాగుతున్నంత సేపు క్యూలో నిల్చొని ఎప్పుడు సభావేదికపైకి పిలుస్తారా అంటూ ఎదురుచూపులు చూశారు. సభా వేదికపై అభ్యర్థుల పరిచయ కార్యక్రమ సమయంలో కొంతమంది అభ్యర్థులు సోనియాగాంధీ కాళ్లకు మొక్కి తమ భక్తిని చాటుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement