‘సార్వత్రికం’పై ప్రత్యేక నిఘా
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు
సమస్యాత్మక వ్యక్తులను వెంటాడేందుకు ప్రత్యేక బృందాలు
కర్నూలు, న్యూస్‌లైన్: మే 7న నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికలపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకోవడంతో ఈ సారి పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. శనివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో అప్రమత్తమయ్యారు.
ముఖ్యంగా మావోయిస్టు, ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలలో నిఘాను కట్టుదిట్టం చేస్తున్నారు. పల్లెల్లో పార్టీల వారీగా మద్దతుదారుల జాబితాను ఎస్పీ రఘురామిరెడ్డి సేకరిస్తున్నారు. అలాగే 53 మండలాల పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలు సేకరిస్తున్నారు.
షాడో పార్టీలే కీలకం..
రానున్న ఎన్నికల్లో షాడో పార్టీలే కీలకం కానున్నాయి. ఈ బృందాలు రౌడీ షీటర్లు, ప్యాక్షనిస్టులు, వివాదాస్పద వ్యక్తుల కదలికలపై పూర్తి నిఘా ఉంచడంతో పాటు ఎప్పటికప్పుడు వారిని నీడలా వెంటాడుతూ పని తీరును అంచనా వేస్తుంటాయి. పరిస్థితి చేయి దాటుతుందని అనుకుంటే వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసేలా వ్యూహం రూపొందిస్తున్నారు.
ఇప్పటికే అలాంటి వారిపై కేసులు నమోదయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు అదనపు బలగాలు రప్పించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. కౌన్సెలింగ్, బైండోవర్ల ప్రక్రియ ద్వారా ముందస్తు పూచీకత్తులతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై డేగ కన్ను..
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని బుధవారపేట, ఎర్రబురుజు, వడ్డెగేరి, సాయిబాబా సంజీవయ్యనగర్, గరీబ్‌నగర్, బండిమెట్ట, ఖడక్‌పుర, గనిగల్లీ, కల్లావీధుల్లోని మొత్తం 35 పోలింగ్ స్టేషన్లను ఇప్పటికే సమస్యాత్మక స్టేషన్లుగా గుర్తించారు. ఆళ్లగడ్డలో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎర్రగుడిదిన్నె పోలింగ్‌స్టేషన్ నం.159లో 90 శాతం పైగా ఓట్లు పోల్ కాగా ఒకే వ్యక్తికి 75 శాతం ఓట్లు పోల్ అయినట్లు గుర్తించారు.
శ్రీశైలంలోని ఎనిమిది పోలింగ్ కేంద్రాల్లో 70 శాతం పైగా ఎస్సీ, ఎస్టీ ఓటర్లున్నట్లు గుర్తించారు. 108, 109, 131, 137, 139, 140, 152, 173 నంబర్లు గల పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. అలాగే వెలుగోడు మండలం మోత్కూరు గ్రామంలో 108 పోలింగ్ స్టేషన్‌లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి రిగ్గింగ్ పాల్పడినట్లు గుర్తించారు.
ఎమ్మిగనూరులో 1, మంత్రాలయంలో 2, పత్తికొండ నియోజకవర్గంలో అటికెలగుండు, పందికోన, నలకదుద్ది, బసినేపల్లి, ఎం.అగ్రహారం, బురుజుల, రాంపల్లి, గొందిమడుగుల, జి.ఎర్రగుడి, షెభాష్‌పురం, పగిడిరాయి, పుల్లగుమ్మి, రత్నపల్లి, బుక్కాపురం, ఎరుకలిచెరువు, గోకులపాడు, చిట్యాల, అమ్మకతాడు ప్రాంతాల్లోని మొత్తం 43 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక స్టేషన్లుగా గుర్తించారు.
నంద్యాలలో 4, బనగానపల్లెలో 2, ఆలూరు నియోజకవర్గంలోని హొళగుంద, నెరిణికి తండా, అరికెరతండా, ఆలూరు టౌన్, మొలగవెల్లి, మొలగవెల్లి కొట్టాల గ్రామాల్లోని 10 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.
ఆయా కేంద్రాల్లో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా రిగ్గింగ్ పాల్పడే అవకాశం ఉండడంతో ముందస్సుత చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను అంచనా వేస్తూ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.