సాక్షి, విజయవాడ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడటంతో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రలోభాలకు తెరతీశారు. ఓటర్లకు మద్యం, డబ్బు పంపిణీ ద్వారా గెలుపొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ప్రసాదంపాడులో టీడీపీ నేతలు సోమవారం యథేచ్ఛగా మద్యం పంపిణీ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పటమట పోలీసులు దాడులు నిర్వహించి టీడీపీకి చెందిన కార్యకర్త ఈడుపుగంటి విజయ్‌కుమార్ నుంచి 327 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల వేళ విందు రాజకీయాలకు తెర లేపిన గన్నవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్‌పై హనుమాన్‌జంక్షన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఆదివారం టీడీపీ నాయకుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణకు చెందిన స్థలంలో విందు ఇస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు దాడి చేశారు. షామియానా టెంట్లు వేసి బిర్యానీ భోజనం పెడుతూ అడ్డంగా దొరికిపోయారు. 500 మందితో విందు నిర్వహించి ప్రలోభపెట్టేందుకు యత్నించారంటూ టీడీపీ అభ్యర్థి వంశీమోహన్‌పై, ఆయన అనుచరులపై ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఎస్‌ఆర్ నారాయణ ఫిర్యాదు అందజేశారు.
నూజివీడులో మూకుమ్మడి కొనుగోళ్లకు యత్నం...
నూజివీడు మండలంలోని అన్నవరం శివారులో పెంకుల పరిశ్రమ కార్మికులతో పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు కందుల సత్యనారాయణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇద్దరు కోడళ్లు సైతం హాజరయ్యారు. ఇంతలో సుమారు 100 మంది కార్మికుల ఓట్లను మూకుమ్మడిగా కొనుగోలు చేసేందుకు టీడీపీ నేతలు ప్రలోభ రాజకీయాలు చేస్తున్నారని సబ్‌కలెక్టర్ ఎన్‌వీ చక్రధరబాబుకు సమాచారం అందటంతో ఫ్లయింగ్‌స్క్వాడ్ ఇన్‌చార్జ్ కె.శాంతారామ్, ఎస్‌ఐ మోహన్‌సింగ్ తమ సిబ్బందితో సంబంధిత పెంకుల పరిశ్రమపై దాడిచేశారు. నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహిస్తున్నారంటూ సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు...
మరోవైపు ఓటమి తప్పదనే భయంతో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు, కేసులకు తెగబడుతున్నారు. భయాందోళనలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు గ్రామంలో వైఎస్సార్ సీపీ వర్గీయుల ఇళ్లకు వచ్చే విద్యుత్ తీగలను కట్ చేశారు. చిన్నమోదుగపల్లి గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులకు దిగి వారిని గాయపరచడమే కాకుండా వారిపైనే తిరిగి కేసులు పెట్టారు. కంభంపాడు గ్రామంలో టీడీపీ వారు డ్వాక్రా మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు.
అక్రమంగా దాచిన 38 కేసుల మద్యం పట్టివేత...
కోడూరు : మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నాయకుడి ఇంటి ఆవరణలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు గడ్డివామిలో అక్రమంగా దాచిన 38 కేసుల మద్యం సీసాలను ఎక్సైంజ్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఇంకొల్లు రాంబాబు ఇంటి ఆవరణలోని గడ్డివామిలో ఈ మద్యం కేసులు దొరికాయి. 38 మద్యం కేసుల్లో మొత్తం 1824 మద్యం బాటిళ్లు ఉండగా, వాటి విలువ రూ.1,36,800 ఉంటుందని పోలీసులు తెలిపారు. మైలవరం తారకరామనగర్‌లో 70 మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పచ్చ ప్రలోభాలు.. మద్యం పరవళ్లు
Published Tue, May 6 2014 1:58 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement
Advertisement