నోటుకు ఓటు..
చీరాల, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో విజయమే పరమావధిగా భావించిన నాయకులు పోలింగ్ రోజు పక్కాగా ప్రలోభాలకు దిగారు. ఆదివారం జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అభ్యర్థుల తరఫున వారు నానా తంటాలు పడ్డారు. ఎన్నికల ముందురోజే ఓటుకు నోటు చొప్పున ఒక్కో ఓటును * 200 నుంచి * 500 కొనుగోలు చేశారు.
పోలింగ్ రోజున కూడా కేంద్రానికి కూతవేటు దూరంలో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపకాలు జరిగాయి. ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా జరిగేలా చూసిన పోలీసులు డబ్బు, మద్యం పంపిణీ వంటి వ్యవహరాల్లో మాత్రం పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వద్దే ఓటర్లకు మద్యం, డబ్బులు పంపిణీ చేస్తూ ‘న్యూస్‌లైన్’ కంటపడ్డారు.
మండలంలోని చీరాలనగర్ పంచాయతీలో పోలింగ్ కేంద్రం వెనుక వీధిలో స్వతంత్ర అభ్యర్థి తరఫున ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారు. ఉదయం ఓటుకు 300 రేటు పలకగా సాయంత్రానికి 500కు చేరింది. అలానే రామకృష్ణాపురం పంచాయతీలో మద్యం సాసీలను యథేచ్ఛగా తరలించారు. ఇంట్లో నుంచి సీసాలను తరలిస్తుండగా ‘న్యూస్‌లైన్’ కెమెరాను చూసిన వ్యక్తి మద్యం సీసాను చొక్కా వెనుక దాచేశాడు.