- గెలుపుకోసం టీడీపీ అడ్డదారులు
- ఓటర్లకు ప్రలోభాలు
- విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ
సాక్షి, విజయవాడ : ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలిపోవడంతో తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. డబ్బు పంపిణీ, మద్యం మత్తులో ముంచడం ద్వారా ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే డబ్బును దొడ్డిదారిన గ్రామాలకు చేర్చేశారు. ఆయా మండలాల నాయకులు తనిఖీల భయంతో ముందుగానే స్టాక్ తెప్పించి రహస్య గోడౌన్లలో దాచిపెట్టారు. డబ్బును నంబర్-2 అకౌంట్ల ద్వారా ఇప్పటికే గ్రామాలకు చేర్చేశారు. కొన్ని ప్రాంతాల్లో డబ్బు పంపిణీ ప్రారంభించగా మరికొన్నిచోట్ల ఐదు, ఆరు తేదీల్లో పంచడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
తెలుగుదేశం నేతల అక్రమాలపై జనం మండిపడుతున్నారు. నందిగామలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు భారీగా మద్యాన్ని పంపిణీ చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్‌కు ముందు రూ.10 కోట్లు పంపిణీ చేయాలని పథకాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రామాల్లో డబ్బు పంపిణీ చేసి ఓట్లు కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ఎక్కువగా ఇతర ప్రాంతాల్లోని టీడీపీ పారిశ్రామికవేత్తలు డబ్బు సమకూరుస్తున్నారు.
ఎస్సీ నియోజకవర్గం కావడంతో టీడీపీ అభ్యర్థి దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి గెలుస్తారనే ప్రచారం జరుగుతుండడంతో ఎదుర్కొనేందుకు మద్యం, డబ్బును ఎరగా వేస్తున్నారు. వత్సవాయి చెక్‌పోస్టు వద్ద పట్టుబడిన రూ.10 లక్షల విలువైన మద్యం నందిగామ టీడీపీ అభ్యర్థిదేనని అధికారులు భావిస్తున్నారు.
గుడివాడలో టీడీపీ నేతలు డబ్బు, మద్యం పారించి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. ఈ మేరకు ఎన్‌ఆర్‌ఐలు, ఒక సామాజికవర్గం వారు తమ తమ స్థాయిల్లో చందాలు పోగేయడంతో పెద్దఎత్తున డబ్బు పంపిణీకి రంగం సిద్ధంచేసినట్లు బహిరంగంగానే చెప్పుకొంటున్నారు.
మైలవరంలో రెండోసారి పోటీ చేస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు కూడా డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. భారీఎత్తున కొనుగోలు చేసిన మద్యాన్ని టీడీపీ ముఖ్యనాయకులు రహస్య గోడౌన్లలో నిల్వచేస్తున్నారు. ఇటీవల జి.కొండూరు మండలం చెవుటూరు గ్రామంలోని ఓ క్రషర్‌లో కార్మికులు విశ్రాంతి తీసుకునే గదిలో 1308 బీరు సీసాలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. కొండపల్లిలో ద్విచక్రవాహనంపై ఒక వ్యక్తి 48 మద్యం సీసాలు రవాణా చేస్తుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
తిరువూరులో మద్యం పంపిణీపైనే ఆశలు పెట్టుకున్నారు. తిరువూరు మండలంలోని ముష్టికుంట్ల, వావిలాల, కోకిలంపాడు, విస్సన్నపేట మండలం తాతకుంట్ల, నరసాపురం, గంపలగూడెం మండలంలోని ఊటుకూరు, గోసవీడు, ఎ.కొండూరు మండలంలోని కంభంపాడు, కోడూరు, చీమలపాడు గ్రామాల్లో టీడీపీ భారీగా మద్యం నిల్వ చేసి పంపిణీ ప్రారంభించింది. ఓటర్లకు పంపిణీ చేసే నిమిత్తం తిరువూరు మునుకుళ్ల రోడ్డులోని ఒక ఇంట్లో ఖమ్మం నేత నామా నాగేశ్వరరావు పంపిన సొమ్మును ఉంచినట్లు తెలిసింది. తిరువూరు మండలంలోని ఆంజనేయపురం వద్ద మినీ ట్రాన్స్‌పోర్టు వాహనంలో రూ.2.80 లక్షల విలువైన 78 మద్యం కేసులను పట్టుకున్నారు. గంపలగూడెం మండలం, గోసవీడులో మరో 140 మద్యం సీసాలను అన్నం సాంబయ్య ఇంటిలో నిల్వ చేసినట్లు సమాచారం అందుకుని దాడి నిర్వహించారు. ఆదివారం పట్టుబడిన అక్రమ మద్యం విలువ రూ.3లక్షలు ఉంటుందని తెలిపారు.
గన్నవరంలో టీడీపీ అభ్యర్థి వంశీ గుళ్లు, మసీదులు, చర్చీలకు అడిగిందే తడవుగా ఎంతో కొంత విదిల్చి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఓటుకు రెండు వేలు చొప్పున ఇవ్వడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రతి గ్రామంలో మద్యం పరవళ్లు తొక్కుతోంది.
బందరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్ధి కొల్లు రవీంద్రకు టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి రూ. 5 కోట్లు నగదు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. తుమ్మలచెరువు, కానూరు, పెదకరగ్రహారం, చినకరగ్రహారం, చిన్నాపురం ప్రాంతాల్లో ద్వితీయశ్రేణి నాయకులు పంపిణీ చేస్తున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ కుమారుడు అమెరికా నుంచి ప్రవాస భారతీయులను మచిలీపట్నం తీసుకువచ్చారు. వీరు ఎరుపు రంగు హోండా కారులో తిరుగుతూ మత్స్యకారులు అధికంగా ఉన్న గ్రామాల్లో నగదు పంపిణీకి తెరతీశారు. ఇదంతా బందరు ఎంపీ అభ్యర్థి కొనకళ్ల సోదరుడు బుల్లయ్య పర్యవేక్షణలో జరుగుతోంది. ఓటుకు రూ. 500 చొప్పున టీడీపీ నాయకులు నగదు పంపిణీ చేస్తున్నారు. బందరుకు తీసుకువెళ్లాల్సిన మద్యం లారీ దారిమళ్లి పోలీసులకు చిక్కింది. ఇందులో 840 కేసుల మద్యం పోలీసులకు దొరికింది. ఇది కూడా బందరు తెలుగుదేశం అభ్యర్థిదేనని పోలీసులు భావిస్తున్నారు.
జగ్గయ్యపేట పట్టణంలో టీడీపి అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ కు లారీల ట్రాన్స్‌పోర్టు కార్యాలయం ఉండడంతో పెద్దఎత్తున మద్యం, డబ్బులు లారీల ద్వారా రవాణా చేస్తున్నారు. ఇప్పటికే మధ్యం గ్రామాల వారీగా పంపిణీ కాగా, నగదును పంచేందుకు సిద్ధపడుతున్నారు. మహిళలకు చీరలను కూడా కానుకగా అందజేస్తున్నారు. పెనుగంచిప్రోలులో మద్యం సిండికేట్లు తెలుగుదేశానికి చెందిన వారు కావడంతో పెద్దఎత్తున పంపిణీకి రూపకల్పన చేశారు. కొన్నిచోట్ల గుత్తాగా ఓట్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారు.
అవనిగడ్డ నియోజకవర్గం టీడీపీ నేతలు సుమారు 750 కేసుల మద్యం చేరవేసినట్లు సమాచారం. నాగాయలంకలో కూడా పెద్ద ఎత్తున మద్యం పంపిణీకి సిద్ధం చేశారు. ఘంటశాల, నాగాయలంక రెండు మండలాల్లో నాలుగుకోట్లు పంపిణీకి రంగం సిద్దం కాగా , కోడూరు మండలానికి వంద కేసుల మద్యం చేరినట్లు సమాచారం.