అమలాపురం, న్యూస్‌లైన్ :ప్రాదేశిక పోరులో మండల పరిషత్ పీఠాల కోసం రెండు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. జిల్లాలో 57 మండల పరిషత్‌లకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు నువ్వా.. నేనా అన్నట్టుగా తలపడ్డాయి. ఈ కారణంగా పలు మండల పరిషత్‌లలో కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. జిల్లాలో కొంత టీడీపీకి మొగ్గు ఉన్నా పలు స్థానాల్లో చాలా స్వల్ప మెజార్టీతో ఆ పార్టీ గట్టెక్కింది. ఏజెన్సీలో అయితే మొత్తం ఫ్యానుగాలి వీచింది. ఏజెన్సీలో ఇంచుమించు అన్ని మండల పరిషత్‌ల్లోను వైఎస్సార్‌సీపీ సత్తా చాటింది. మారేడుమిల్లి, వై.రామవరం, రంపచోడవరం, దేవీపట్నం మండల పరిషత్‌లను కైవసం చేసుకున్న ఆ పార్టీ అడ్డతీగల, గంగవరం, రాజవొమ్మంగి మండల పరిషత్‌లలో గట్టిపోటీ నిచ్చింది. మెట్టలోని తుని, కోటనందూరు, తొండంగి మండలాల్లో పోరు ఉత్కంఠ భరితంగా సాగింది.
జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట, కిర్లంపూడి ఎంపీపీ స్థానాలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోగా, గండేపల్లి, గోకవరం జెడ్పీటీసీ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ, రాజానగరం మండల పరిషత్‌లు టీడీపీ ైకైవసం చేసుకోగా, సీతానగరంలో టీడీపీ ఆధిక్యత చూపింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని ఏకైక మండల పరిషత్ కడియం మండలాన్ని, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కరప మండల పరిషత్‌ను టీడీపీ గెలుచుకుంది. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో గొల్లప్రోలు, పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో పెద్దాపురం, సామర్లకోట మండలాలను టీడీపీ గెలుచుకుంది. అనపర్తి నియోజకవర్గ పరిధిలో అనపర్తి, రంగంపేట, బిక్కవోలు, పెదపూడిలో సైతం టీడీపీ ఆధిక్యత ప్రదర్శించింది.
కోనసీమలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన విజయం సాధించింది. రాజోలు నియోజకవర్గంలో రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, పి.గన్నవరం నియోజకవర్గంలో పి.గన్నవరం, మామిడికుదురు, అంబాజీపేట, అయినవిల్లి, అమలాపురం నియోజకవర్గంలో అమలాపురం రూరల్, అల్లవరం, ముమ్మిడివరం నియోజకవర్గంలో ఐ.పోలవరం, ముమ్మిడివరం టీడీపీలు గెలుచుకోగా, కాట్రేనికోన వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది. యూ.కొత్తపల్లి, కాజులూరు మండల పరిషత్‌లు టై అయ్యాయి. రెండుచోట్ల వైఎస్సార్ సీపీ, టీడీపీలు చెరిసగం స్థానాలు సాధించాయి. కాజులూరులో 20 స్థానాలుండగా వైఎస్సార్‌సీపీ, టీడీపీలు చెరో పది స్థానాలు గెలుచుకున్నాయి. యు.కొత్తపల్లిలో 24 స్థానాలకుగాను చెరో 12 చొప్పున స్థానాలు గెలుచుకున్నాయి.
పోటాపోటీ
జిల్లాలో 1063 ఎంపీటీసీ స్థానాలకు 23 ఏకగ్రీవం కాగా, 1040 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అర్ధరాత్రి 12 గంటల వరకూ అందిన సమాచారం మేరకు... 922 ఎంపీటీసీ స్థానాల ఫలితాలను ప్రకటించగా, టీడీపీకి 536 స్థానాలు కైవసం చేసుకొంది. 334 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది. స్వతంత్రులు 50 స్థానాలను చేజిక్కించుకోగా కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. ఇక 57 జెడ్పీటీసీ స్థానాలకు టీడీపీ 20 చేజిక్కించుకోగా, తొమ్మిది చోట్ల వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. మిగిలిన స్థానాల లెక్కింపు కొనసాగుతోంది.
కోటనందూరులో రీ కౌంటింగ్
కోటనందూరు జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ 12 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా వైఎస్సార్ సీపీ రీ కౌంటింగ్‌కు డిమాండ్ చేయడంతో అర్ధరాత్రి అక్కడ మళ్లీ లెక్కింపు ప్రారంభించారు.
నువ్వా.. నేనా
Published Wed, May 14 2014 1:23 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM
Advertisement
Advertisement