నోటికి చుక్క.. చేతికి రొక్కం
సాక్షి, రాజమండ్రి : ప్రజల నమ్మకాన్ని చూరగొని, తద్వారా ఎన్నికల పోరులో గెలవడమంటే.. అరికాళ్లు పుండైన వేళ పరుగు పందెంలో గెలవడమంత అసాధ్యమని గ్రహించిన తెలుగుదేశం.. ఇక అడ్డదారులను ఆశ్రయిస్తోంది. ఓటుకు రేటు కట్టి, తదనుగుణంగా నోట్లను వెదజల్లుతోంది. ఇక.. నిషాప్రియులకు తాగినంత పోయించి, ఆ మత్తులోనే వారి మద్దతు పొందాలని ఆరాటపడుతోంది. ఆ పార్టీ వారు బృందాలుగా ఏర్పడి మరీ వాడల్లో ఆ రెండింటినీ పంపిణీ చేస్తున్నారు. ఆదివారం నుంచే అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నోట్ల వాన కురిపిస్తున్నారు. సోమవారం దాన్ని మరింత ముమ్మరం చేశారు. ‘ఇతరులు ఎంత ఇస్తున్నారో ఆరా తీసి.. మనం అంతకు రెట్టింపు ఇవ్వాలి. ఎవరిని కొనాలో గుర్తించి చెబితే డబ్బు ఏర్పాటు చేస్తాం.
అవసరమైతే ఇంకా అదనంగా ఏం కావాలో అడగండి’ అని మండపేట, తుని, రాజమండ్రి రూరల్, రాజానగరం తదితర నియోజకవర్గాల్లో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలకు ఆదేశాలిచ్చినట్టు తె లుస్తోంది. పుచ్చుకుంటే డబ్బు, లేదంటే కానుకలు, అదీ వద్దంటే బియ్యం, వాటితో పాటు ఇంటి యజమానికి ఓ మందు బుడ్డి. ఇవీ టీడీపీ ఓటర్లకు ఇస్తున్న ఆఫర్లు. సోమవారం రాత్రి అన్ని నియోజకవర్గాల్లో ఈ ఆఫర్లతో ఇంటింటికీ వెళ్లి ఎవరు కోరుకున్నవి వారికి పంచేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఏ సందు చూసినా మందు కంపే..
సోమవారం రాజానగరంలో రూ.3 లక్షల విలువైన 4,176 మద్యం బాటిళ్లను టీడీపీ కార్యకర్తల నుంచి పోలీసులు పట్టుకున్నారు. పెద్దాపురంలో టీడీపీ వారు 500 మద్యం కేసులు తరలిస్తూ దొరికి పోయారు. సామర్లకోటలో 30 కేసుల మద్యం తెలుగు తమ్ముళ్ల నుంచి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆదివారం రాత్రి జగ్గంపేటలో 650 మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీన పరచుకున్నారు. అయినాపురంలో 19 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పలుచోట్ల టీడీపీ వారు మద్యం నిల్వ చేసినట్టు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందినా.. పోలీసులు ఒత్తిళ్లకు లొంగి వదిలేసినట్టు తెలుస్తోంది. రామచంద్రపురంలో నాలుగు రోజుల క్రితం నుంచే టీడీపీ ప్రలోభాలకు తెరలేపింది. అక్కడ ఓటర్లకు టీడీపీ వర్గాలు ఓటర్లకు మద్యం పంచుతూ 33 కేసులతో పట్టుబడ్డారు.
నేటి రాత్రి.. ‘కో’ అంటే కోట్లు..
ఇక టీడీపీ దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఓటుకు రూ.1000 రేటు నిర్ణయించింది. శంఖవరం మండలంలో ఇంటికో పట్టుచీర, లేదంటే ఓటుకు రూ.1000, ఇదీ కాదంటే 25 కిలోల బియ్యం పంచడానికి ఆ పార్టీ సిద్ధమైంది. ‘ఏది కావాలో ఎంచుకోవడమే మీ పని. కావాలన్నది పంచడమే మా పని’ అని ఓటర్లను ఊరిస్తున్నారు అక్కడి నేతలు. మండపేట, రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం, ప్రత్తిపాడు, తుని, పిఠాపురం, అన పర్తి తదితర నియోజకవర్గాల్లోనూ సోమవారం రాత్రి డబ్బు, మద్యం పంపిణీకి రంగం సిద్ధం చేసుకున్నారు టీడీపీ నేతలు. ముమ్మిడివరం మండలం మర్లపాలెంలో ఆదివారం రాత్రి టీడీపీ శ్రేణులు సొమ్ము పంచుతూ పట్టుబడ్డాయి.
రాజమండ్రి అన్నపూర్ణమ్మపేటలో టీడీపీకి చెందిన కొందరు డబ్బు పంచుతుం డగా పట్టుకున్న పోలీసులు వారి వద్ద సుమా రు రూ.15 లక్షలు కనుగొన్నట్టు సమాచారం. అయితే వారి వద్ద కేవలం రూ.12 వేలు మాత్రమే ఉన్నాయని, అవి కూడా లెక్కలో ఉన్న సొమ్ములే అని పోలీసులు కప్పి పుచ్చుతున్నారు. ఇదే తరహాలో పలుచోట్ల టీడీపీ వర్గాలు డబ్బు పంచుతూ పట్టుబడ్డా పోలీ సులు వారికి కొమ్ము కాస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కాగా కాకినాడ రూరల్‌లో మా త్రం టీడీపీ, ఓ ఇండిపెండెంట్ డబ్బుల పంపిణీలో నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నా రు. ఖర్చుకు వెనుకాడని ఆ ఇండిపెండెంట్ ఇప్పటికే రూ.3 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది.
కాగా మంగళవారం అర్ధరాత్రి దాకా ప్రతి నియోజకవర్గంలో ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా డబ్బు పంచేందుకు తెలుగుదేశం రంగం సిద్ధం చేసుకుందనీ, దీని నిమిత్తం ఇప్పటికే కోట్ల రూపాయలు చేరాల్సిన చోటికి చేరాయని సమాచారం.