కింజరాపు కోటలో వసూల్ రాజా!. | TDP MP Candidate Ram Mohan Funds bicycle tour | Sakshi
Sakshi News home page

కింజరాపు కోటలో వసూల్ రాజా!.

Published Sun, Apr 27 2014 2:18 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

కింజరాపు కోటలో వసూల్ రాజా!. - Sakshi

కింజరాపు కోటలో వసూల్ రాజా!.

ఇంటి పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం.. పాత నానుడి. ఇంటి పేరు వాడుకుని కోట్లు దండుకోవడం టీడీపీవారి తాజా ఒరవడి. ఆ మంత్రాంగంతోనే అతగాడు కోట్లు వసూలు చేశాడు. ‘మావాడు ఎంపీగా గెలుస్తాడు. కేంద్రంలో చక్రం తిప్పుతాడు. ఇప్పటికే మా వాడికి ఢిల్లీలో పెద్ద లాబీ ఉంది. ఇప్పుడే కొందరికి రైల్వే, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వేయిస్తాను. మావాడు ఎంపీ అయిన తర్వాత ఉద్యోగాలే.. ఉద్యోగాలు. ఇప్పుడు మాత్రం సైకిల్ యాత్రకు నిధులు కావాలి. ఇప్పుడు మీరు పెట్టుబడి పెడితే ఆనక మీకే ఉద్యోగాలు’ అని ఆశ చూపాడు. టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ ఇంటి పేరు అతగాడి ఇంటి పేరు ఒక్కటే. పైగా అత్యంత సన్నిహితులు కూడా. ఇంకేముంది!.. అందరూ నమ్మేశారు. జిల్లాలో చాలామంది యువకులు భారీగా ముట్టజెప్పారు. అలా వసూలు చేసిన దాంతో అతగాడు కొంతవరకు రామ్మోహన్‌నాయుడి సైకిల్ యాత్రలో హల్‌చల్ చేశాడు. తీరా ఇప్పుడు పత్తా లేకుండా పోయాడు. దాంతో ఉద్యోగాల ఆశతో భారీగా సమర్పించుకన్నవారంతా లబోదిబోమంటూ కింజరాపు కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇంటి పేరు కలసివచ్చింది. కింజరాపు కుటుంబంతో సాన్నిహిత్యం అదనపు అర్హతగా మారింది. రామ్మోహన్‌నాయుడు సైకిల్ యాత్ర అయాచిత వరంగా పరిణమించింది. బురిడీ కొట్టించే తెలివితేటలున్న వారికి ఇంతకంటే ఇంకేం కావాలి?.. సరిగ్గా అదే చేశాడు ఆ ప్రబుద్ధుడు. కింజరాపు కుటుంబానికి సన్నిహితుడైన అతగాడు శ్రీకాకుళంలోని తన అత్తగారి ఇంట్లో ఉంటాడు. గతంలో దివంగత ఎర్రన్నాయుడి సహకారంతో రియల్ ఎస్టేట్ దందా సాగించాడు. టెక్కలి టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడికి బాగా సన్నిహితుడిగా గుర్తింపు పొందాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రామ్మోహన్‌నాయుడు సైకిల్ యాత్ర నిర్వహించారు. సందట్లో సడేమియా అన్నట్లు ఆ యాత్ర పేరుతో ఇతగాడు గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం చక్కబెట్టాడు. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పలువురు యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపించాడు.
 
 సైకిల్ యాత్రకు సహకరిస్తే ప్రతిఫలంగా రైల్వే, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎర వేశాడు. ‘మా వాడు ఎంపీగా గెలుస్తాడు.  ఇప్పటికే ఢిల్లీలో లాబీ ఉంది. ఎంపీ అయిన తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పుతాడు. కాబట్టి అందరికీ ఉద్యోగాలు వేయిస్తాను. ఇప్పుడే కొందరికి ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఆ తర్వాత ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు. కానీ ఇప్పుడు మీరు మాత్రం ఒకటి చేయాలి. సైకిల్‌యాత్రకు ఆర్థికంగా సహకరించాలి. బాగా హడావుడి చేయాలి. పేపర్లలో పెద్ద పెద్ద యాడ్స్ ఇవ్వాలి. సైకిల్ యాత్ర వెళ్లిన ప్రతి చోటా పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చి హడావుడి చేయాలి. రామ్మోహన్‌కు మంచి ఇమేజ్ సృష్టించాలి’ అని నూరిపోశాడు. వీటి కోసం ఇప్పుడు పెట్టుబడి పెడితే మిగతా కథంతా తాను నడిపిస్తానని చెప్పుకొచ్చాడు. రామ్మోహన్ ఎంపీ అయిన తరువాత అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు.
 
 రూ.కోట్లు వసూలు!
 అతగాడి మాయ మాటలు బాగానే ప్రభావం చూపించాయి. ఇంటి పేరు ఒక్కటే కావడం.. ఆ కుటంబానికి సన్నిహితుడు కావడంతో ఆతని మాటలకు చాలామంది బోల్తా పడ్డారు. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు సమర్పించుకున్నారని సమాచారం. ప్రధానంగా టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో యువకులు, వారి తల్లిదండ్రులు అతగాడికి భారీగా ముట్టజెప్పారు. అలా అతడు వసూలు చేసిన మొత్తం కొన్ని కోట్లు ఉంటుందని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.
 
 ఇంతకీ ఏం చేశాడంటే...
 ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వసూలు చేసిన మొత్తంలో కొంతవరకు రామ్మోహన్ సైకిల్ యాత్ర సందర్భంగా ఖర్చు పెట్టాడు. పత్రికల్లో పెద్దపెద్ద యాడ్స్ వేయించాడు. తెలివిగా ఎక్కడా తన పేరు రాకుండా నియోజకవర్గ ప్రజలు అని యాడ్స్ వేయించి హడావుడి చేశాడు. ఇక సైకిల్‌యాత్ర సాగుతున్న మార్గమంతా కొంతమందిని వెంటబెట్టుకుని హడావుడి చేశాడు. సైకిల్ యాత్ర కంటే ముందే గ్రామాలకు చేరుకుని ముందస్తు ప్రచారం నిర్వహించాడు. యాత్ర చేరుకోగానే పెద్ద ఎత్తున బాణ సంచా పేల్చి హడావుడి చేశాడు.
 
 ఇలా కొంత మొత్తాన్ని ఖర్చు చేశాడు. ఆ తరువాత...పత్తా లేకుండా పోయాడు
 సైకిల్ యాత్రలో ఇంత హడావుడి చేసిన అతగాడు కొన్ని రోజులుగా కని పించడం లేదు. ఉద్యోగాల కోసం డబ్బులిచ్చిన వారు అతడి కోసం వాక బు చేస్తే ఎక్కడున్నాడో తెలీడం లేదనే సమాధానం వస్తోంది. తమకు ఎప్పు డు ఉద్యోగాలు వస్తాయి అని అడుగుదామంటే అతడు కనిపించడం లేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేశాడు. ‘ఇంటికి వెళి తే ఎక్కడికో వెళ్లాడు.. ఎప్పుడు వస్తాడో తెలీదు’ అనే సమాధానం వస్తోంది. కొందరు ధైర్యం చేసి కింజరాపు కుటుంబ సభ్యులను అడిగితే తమకేం తెలుసని గుర్రుమంటున్నారు. దాంతో డబ్బులు  సమర్పించుకున్న వారంతా ప్రస్తుతం లబోదిబోమంటున్నారు. ‘కింజరాపు కుటుంబానికి సన్నిహితుడు. రామ్మోహన్ పేరు చెప్పాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటే ఆశ పడ్డాం.
 
 సైకిల్ యాత్రకు ఖర్చు చేస్తానంటే డబ్బులు ముందుగానే ఇచ్చేశాం. ఇప్పుడు పత్తా లేకుండాపోయాడు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కింజరాపు కుటుంబం మాత్రం స్పందించడం లేదు. తమ వద్దకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నవారితో కూడా చాలా దురుసుగా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. కోట్లు వసూలు చేసి పరారైన అతగాడు మాత్రం కొన్ని రోజులు కేరళలో గడిపి ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నట్లు సమాచారం. కింజరాపు కుటుంబంలోని ఓ కీలక వ్యక్తితో ఇప్పటికీ టచ్‌లో ఉన్నాడని కూడా తెలుస్తోంది. తన కొత్త సెల్ నంబర్‌ను ఆ కీలక నేతకు మాత్రమే ఇచ్చారని సమాచారం. కాగా అతగాడు అక్కడి నుంచి టీడీపీ తరపున వ్యవహారాలు చక్కబెడుతున్నాడని తెలుగు తమ్ముళ్లే చెబుతున్నారు. కింజరాపు కోట అండగా ఉంటే ఇంకెవరూ ఏం చేయలేరన్నదే అతగాడి ధీమా.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement