నా దారి నాదే!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పోలింగ్ ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో టీడీపీ శ్రీకాకుళం లోక్‌సభ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ అసలు సిసలు వర్గ రాజకీయానికి తెరతీశారు. ఓట్ల వేటలో తన దారి తాను చూసుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజల్లో పట్టులేదని గ్రహించారో.. వారితో వెళితే తాను మునిగిపోతానని భయపడ్డారో గానీ వారికి హ్యాండిస్తున్నారు. ఈ మేరకు రెండ్రోజులుగా ప్రచార వ్యూహాన్ని మార్చారు. ద్వితీయశ్రేణి నేతలు, వివిధ వర్గాల ప్రతినిధులతో ఆంతరంగికంగా మంతనాలు సాగిస్తూ తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ‘ఎంపీగా నాకు ఓటేయండి. ఎమ్మెల్యే ఓటు మీ ఇష్టం. ఆ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టను’ అని చెబుతున్నారు. ఈ వ్యవహారం ఆ నోటా ఈ నోటా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల చెవిన పడింది. దాంతో వారు రామ్మోహన్ తీరుపై భగ్గుమంటున్నారు.
వారిపై అపనమ్మకం
ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న రామ్మోహన్‌కు వాస్తవ విషయాలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. పార్టీకి ప్రజల్లో ఆదరణ లేదని గుర్తించారు. దాంతో తన రాజకీయ భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్న ఆయన ప్రత్యమ్నాయ వ్యూహానికి తెరతీశారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో సీనియర్లు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుండగా.. జూనియర్లకు నియోజకవర్గంపై ఏమాత్రం పట్టులేదని గుర్తించిన ఆయన తన సన్నిహితులతో మాట్లాడుతూ గౌతు శివాజీ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. పలాసలో శివాజీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని కచ్చితంగా చెబుతున్నారు. ‘నేను పలాస నియోజకవర్గంలో మద్దిల చిన్నయ్య తదితర నేతలను ఎంతగానో బుజ్జగించేందుకు ప్రయత్నించాను. కానీ వారందరూ శివాజీ మీద కోపంతో నా మాట కూడా వినలేదు.
పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. అలాంటి శివాజీతో కలిసి పనిచేస్తే నా పరిస్థితి ఏమిటి? ఎవరు ఓట్లేస్తారు’ అని రామ్మోహన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందుకే పలాస నియోజకవర్గానికి సంబంధించి పలువురు నేతలు, ఇతర వర్గాల పేర్లతో ఆయన ఓ జాబితా రూపొందించారు. వారందరికీ ఫోన్లు చేస్తూ తన మనుషుల ద్వారా మంతనాలు సాగిస్తున్నారు. ‘శివాజీని పట్టించుకోవద్దు... ఎమ్మెల్యే ఓటు మీ ఇష్ట ప్రకారం వేసుకోండి. ఎంపీ ఓటు మాత్రం నాకు వేయండి’ అని కోరుతున్నారు. అదే విధంగా పాతపట్నం నియోజకవర్గంలో శత్రుచర్లపై కూడా వ్యతిరేకత ఉందని రామ్మోహన్ గుర్తించారు. దాంతో రెండు ప్రధాన సామాజికవర్గాల నేతలతో మంతనాలు సాగిస్తూ ‘ఎమ్మెల్యే ఓటు మీ ఇష్ట ప్రకారం వేసుకోండి... ఎంపీ ఓటు మాత్రం నాకు వేయండి’ అని చెబుతున్నారు. సీనియర్లతో పరిస్థితి ఇలా ఉంటే జూనియర్లతో మరో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కూన రవికుమార్ ఇప్పటికీ ఆమదాలవలస నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించలేదు. బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో ఆయనకు కనీసస్థాయిలో క్యాడర్ లేనే లేదు.
అదే విధంగా ఇచ్ఛాపురంలో పట్టుపట్టి టిక్కెట్టు ఇప్పిస్తే బెందాళం అశోక్ ఆశించినస్థాయిలో పని చేయడం లేదని రామ్మోహన్ ఆగ్రహంగా ఉన్నారు. నరసన్నసపేటలో బగ్గు రమణమూర్తిని తాను భుజాన మోయాల్సి వస్తోందని కూడా వాపోతున్నారు. ఇలాంటి అభ్యర్థులతో ఎన్నికల బండిని నడిపించలేనని రామ్మోహన్ తేల్చి చెప్పేస్తున్నారు. అందుకే ఎంపీగా తనకు ఓటేయాలని ఆమదాలవలస, ఇచ్ఛాపురం, నరసన్నపేట నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, ఇతర వర్గాల ప్రతినిధులను కోరుతున్నారు. ఎమ్మెల్యే ఓటు ఎవరికి వేసినా పర్వాలేదని చెబుతున్నారు. తద్వారా ఎమ్మెల్యే అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత తనపై పడకుండా చూసుకోవాలన్నది ఆయన వ్యూహంగా ఉంది. అదే విధానాన్ని శ్రీకాకుళంలో కూడా ఆయన అమలు చేస్తున్నారు. గుండ అప్పలసూర్యనారాయణ కుటుంబంపై పార్టీ కార్యకర్తలకు ఏమాత్రం విశ్వాసం లేదు. ఆ కుటుంబం తమకు అండగా ఉండదన్నది వారి ప్రధాన అభియోగం. అందుకే రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నేతలతో మాట్లాడుతూ తన కోసం పనిచేయాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే ఓటు మీ ఇష్టమని తేల్చేస్తున్నారు.
భగ్గుమంటున్న ఎమ్మెల్యే అభ్యర్థులు
కింజరాపు రామ్మోహన్ తాజా రాజకీయ తంత్రంపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు భగ్గుమంటున్నారు. అసలు రామ్మోహన్‌కు ఉన్నదెంత?’ అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆయన తనను తాను ఎక్కువగా ఊహించుకుని తమపై పెత్తనం చెలాయించడాన్ని వారు సహించలేకపోతున్నారు. పలాస నియోజకవర్గంలో బూత్ ఏజెంట్ల కోసం కూడా రామ్మోహన్ తనపైనే ఆధారపడాలని శివాజీ వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటిది ఆయన మద్దిల చిన్నయ్య తదితరులను సాకుగా చూపి ఎంపీ ఓటు అడుగుతారా అని ప్రశ్నిస్తున్నారు. శత్రుచర్ల కూడా అదే రీతిలో రామ్మోహన్‌పై విరుచుకుపడుతున్నారు. ఇక గుండ కుటుంబం ఆగ్రహానికి అంతే లేదు. ప్రస్తుతానికి బయటపడకున్నా కూన రవి, బెందాళం అశోక్, బగ్గు రమణమూర్తి కూడా రామ్మోహన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాలు పోలింగ్ నాటికి చినికి చినికి గాలివానగా మారి టీడీపీని అతలాకుతలం చేయడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరి చూద్దాం ఏమవుతుందో!