
బీజేపీ హటావో- టీడీపీ బచావో!
తెలుగుదేశంపార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్న తెలంగాణ బీజేపీని దారికి తెచ్చుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ సరికొత్త ఎత్తుగడకు నాంది పలికింది.
ఎన్టీఆర్ భవన్ డైరెక్షన్‌లో టీడీపీ నేతల కొత్త రాగం
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశంపార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్న తెలంగాణ బీజేపీని దారికి తెచ్చుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ సరికొత్త ఎత్తుగడకు నాంది పలికింది. పొత్తును టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నా భవిష్యత్ విశాల ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామనే సంకేతాలు పంపించే ప్రయత్నాలకు తెరలేపింది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ బీజేపీకి చెందిన 10 జిల్లాల అధ్యక్షులు అల్టిమేటం ఇచ్చిన మరుక్షణమే టీడీపీ మైండ్‌గేమ్ రాజకీయాలకు అంకురార్పణ చేసింది.
పొత్తు విషయంలో టీడీపీ వైపు మొగ్గు చూపుతున్న బీజేపీ ఢిల్లీ పెద్దలను మరోసారి బెదిరించడం ద్వారా బీజేపీ రాష్ట్ర శాఖను ముఖ్యంగా పొత్తును వ్యతిరేకిస్తున్న కొందరు నాయకులను తన దారికి తెచ్చుకునేందుకు చంద్రబాబు పన్నిన వ్యూహాన్ని ఆచరణలోకి తెస్తున్నారు. అందులో భాగంగా బీజేపీలో పొత్తుపై గొడవ జరుగుతుండగానే శనివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తెలుగుదేశం హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు, తెలంగాణ ఎన్నికల కమిటీ ప్రధాన కార్యదర్శి తలసాని శ్రీనివాస్ యాదవ్ జిల్లా పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశానికి రావాలని తన మాట వినే నేతలకు పిలుపునిచ్చారు. మూడు గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేసి ‘బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి నష్టం. ఒంటరిగా వెళితే ఒక్కసీటు కూడా గెలుచుకునే స్థితిలో లేని బీజేపీకి 45- 50 సీట్లు ఇవ్వడం మూర్ఖత్వం. బీజేపీతో పొత్తు వద్దే వద్దు’ అని ఒప్పించారు. అంతటితో ఆగకుండా ఆదివారం ఉదయం 9 గంటలకు 5 వేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత సమావేశం ఏర్పాటు చేసి బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలని తీర్మానం చేసి ర్యాలీగా చంద్రబాబు ఇంటికి వెళ్లాలని నిర్ణయించారు. అంతేకాక ఓ అడుగు ముందుకేసీ ‘బీజేపీ హటావో- టీడీపీ బచావో’ అనే నినాదాన్ని అందుకున్నారు.
బాబు మైండ్ గేమ్‌లో భాగమే!
తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో శనివారం ఉదయం బీజేపీ జాతీయ కోశాధికారి, రాజ్యసభ సభ్యుడు పీయూష్ గోయల్ మరో నాయకుడితో కలిసి సమావేశమయ్యారు. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కూడా ఈ సమావేశానికి హాజరు కాగా బీజేపీ పొత్తు వ్యవహారాలు చూస్తున్న ఆ పార్టీ నేత ప్రకాశ్ జవదేకర్ గానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి గానీ బాబుతో భేటీకి వెళ్లలేదు. ఈ సమావేశంలో కూడా చంద్రబాబు తన మనసులోని మాటనే మరోసారి స్పష్టం చేసినట్లు సమాచారం. సీట్ల విషయంలో మార్పు లేదని, తెలంగాణలో 45 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్ల కన్నా ఎక్కువిచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదని తెగేసి చెప్పినట్లు తెలిసింది. సీట్ల కేటాయింపు విషయంలో కూడా తన మాటే ఫైనల్ అని బాబు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో సమావేశం సీమాంధ్ర సీట్ల పంపకాలపై సాగింది. అదే సమయంలో బీజేపీకి చెందిన 10 జిల్లాల అధ్యక్షులు, పార్టీ నాయకులు సమావేశమై టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తూ జవదేకర్‌ను కలిసి మూకుమ్మడి రాజీనామాలకు హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీతో పొత్తు వల్ల బీజేపీకి నష్టమే తప్ప లాభం లేదని తేల్చిచెప్పారు. ఈ విషయం తెలియడంతో చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌ను అప్రమత్తం చేశార ని సమాచారం. బీజేపీ నేతలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని టీడీపీ బలంగా ఉన్న సీట్లనే కోరుతున్నందున అటు నుంచే నరుక్కు రావాలన్న ఉద్దేశంతో టీడీపీ హైదరాబాద్ శాఖను అప్రమత్తం చేశారు. దీంతో తలసాని నేతృత్వంలోని పార్టీ నాయకులు సమావేశమై ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చారు. ఆదివారం హంగామా చేయడం ద్వారా బీజేపీని దారిలోకి తెచ్చుకోవాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థుల జాబితాను మరో రెండు రోజులు సాగదీసే ప్రక్రియ కూడా విజయవంత ంగా సాగుతుందని, చివరి నిమిషంలో బీజేపీ పోటీ చేసే సీట్ల జాబితాను ట్రస్ట్‌భవన్ ద్వారానే పంపించాలన్నదే వారి వ్యూహంగా చెపుతున్నారు.