టీడీపీలో కష్టపడ్డవారికి అన్యాయం జరుగుతోందని ఆ పార్టీ నేతలు ప్రభాకర్ చౌదరి, మహాలక్ష్మీ శ్రీనివాస్ ఆరోపించారు.
అనంతపురం/కడప: టీడీపీలో కష్టపడ్డవారికి అన్యాయం జరుగుతోందని ఆ పార్టీ నేతలు ప్రభాకర్ చౌదరి, మహాలక్ష్మీ శ్రీనివాస్ ఆరోపించారు. రూ. 5 నుంచి రూ. 10 కోట్లకు టికెట్లు అమ్ముకుంటున్నారని అన్నారు. డబ్బు ప్రాతిపదికన టికెట్లు ఇస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు అనంతపురంలో కార్యకర్తలతో సమావేశమైయ్యారు.
టీడీపీ కోసం ఆస్తులు అమ్ముకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లుగా సుమారు రూ.120కోట్లు ఖర్చు చేశామని, ఇప్పుడు టికెట్లు ఇవ్వమంటే ఎలా అని వాపోయారు. సూట్‌కేసులు మోసినవారికే చంద్రబాబు టికెట్లు ఇస్తున్నారని, తమకు అన్యాయం జరిగితే ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటామని ప్రభాకర్ చౌదరి, మహాలక్ష్మి శ్రీనివాస్ అన్నారు.
కడప జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రొద్దుటూరు సీటు ఇవ్వకపోతే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు ఆయన సిద్దపడుతున్నారు. చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన నిర్ణయం తీసుకోనున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా టీడీపీలోనూ వివాదం రేగింది. మహిళలకు ఒక్క సీటే కేటాయించడంపై తెలుగు మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. చింతలపూడితో పాటు మరో స్థానాన్ని తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.