ఒంగోలు, న్యూస్‌లైన్ : టీడీపీ నేతలు యథేచ్ఛగా ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడున్నారు. అభ్యర్థుల వ్యవహారశైలిపై అధికారులు నిఘా ఉంచకపోవడం వల్లే కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. కోడ్ ఉల్లంఘనలపై ఎవరైనా ఫిర్యాదు చేసినా అధికారులు అంతంత మాత్రంగానే స్పందిస్తుండటంతో ఫిర్యాదుదారులు ముందుకు రావడం లేదు.
గురువారం మే డేను పురస్కరించుకుని ఒంగోలులోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ గుమస్తాల సంఘం పేరుతో స్థానిక కేబీ రెస్టారెంట్‌లో నిర్వహించిన కార్యక్రమం పూర్తిగా టీడీపీ ప్రచార సభలా సాగింది. అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్‌ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. దానికి తోడు ఈ కార్యక్రమ నిర్వహణ కోసం తెలుగుదేశం పార్టీ నాయకులను ఆహ్వానిస్తున్నట్లు, టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంటూ ముందస్తుగా కరపత్రాలు పంపిణీ చేశారు. అయితే కరపత్రాలపై ప్రింటింగ్ ప్రెస్ పేరుగానీ, ఎన్ని ప్రతులు ముద్రించారనే విషయం గానీ లేవు.
మే డే ముసుగులో నగరంలో కొందరు యువకులు బైక్‌లపై టీడీపీ జెండాలు పట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై రాజకీయ పార్టీల నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఒంగోలు నగర శివార్లలో మాగుంట సుబ్బరామిరెడ్డి బొమ్మతో కూడిన మూడు మంచి నీటి ట్యాంకర్లతో 10 రోజుల నుంచి నీటిని ఉచితంగా సరఫరా చే స్తూ ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్వందించలేదని ఓ వ్యక్తి ఁన్యూస్‌లైన్*కు ఫోన్‌చేసి తెలిపారు.
ఎన్నికల ప్రచార సామగ్రి ఏదైనా సరే ఫ్రభుత్వ ఆస్తులపై ఉంచరాదు. అయితే నగరంలో చాలా చోట్ల టీడీపీ జెండాలను కరెంటు స్తంభాలకు కట్టారు.
ఒక సభ కోసం అనుమతి తీసుకుని మరో కార్యక్రమం నిర్వహిస్తున్నా పోలీసులు దాడులు చేయడం మినహా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసులు నమోదు చేయకపోవడం గమనార్హం.
ఒంగోలులో జనసేన పేరుతో నిర్వహిస్తున్న ర్యాలీల ఖర్చు, సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి ఒంగోలులో బీజేపీ నిర్వహించే కార్యక్రమాల వ్యయం ఎవరి ఖాతాలోకి వెళ్తాయో అధికారులు తేల్చలేదు.