టీ-టీడీపీ ఎన్నికల కమిటీ
తొలి భేటీలో చర్చ
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలసి సాగితేనే సానుకూల ఫలితాలు వస్తాయని టీ-టీడీపీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. కాంగ్రెస్, టీఆర్ ఎస్‌లను ఎదుర్కొనాలంటే బీజేపీతో పాటు లోక్‌సత్తా మద్దతు కూడా అవసరమని వారు నిర్ణయానికొచ్చారు. టీ-టీడీపీ ఎన్నికల కమిటీ గురువారం ఎన్‌టీఆర్ భవన్‌లో తొలిసారి భేటీ అయింది. కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ అధ్యక్షతన జరిగిన భేటీలో.. తెలంగాణలో పార్టీ వ్యూహం, పొత్తులపై ప్రధానంగా చర్చ జరిగింది. పార్టీ అధినేత చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఇప్పటికీ సమైక్యవాదిగానే చూస్తున్నారని, ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తుంటేనే కొన్ని సీట్లు సాధించవచ్చని మెజారిటీ నేతలు స్పష్టం చేసినట్లు తెలిసింది.
పొత్తులు అవసరం లేదంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. టీడీపీని విమర్శించడాన్ని కమిటీ సభ్యులు తప్పుబట్టారు. ‘ఢిల్లీ స్థాయిలో పొత్తులకు ఆమోదం లభించింది. ఆయనేదో అన్నీ తానేనని అనుకుంటున్నాడు. ఎక్కువ సీట్లు తీసుకునేందుకే ఈ డ్రామాలు’ అని కమిటీలోని ఓ నాయకుడు ధ్వజమెత్తినట్లు తెలిసింది. బీజేపీ, లోక్‌సత్తాతో పొత్తు వల్ల గ్రేటర్ హైదరాబాద్‌లో టీడీపీకి ప్రయోజనముంటుందని ఎన్నికల కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. ఉత్తర తెలంగాణలో టీఆర్‌ఎస్, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌తో ఎన్నికల్లో ఎదురయ్యే ఇబ్బందుల గురించి కూడా ఈ సందర్భంగా చర్చించారు. బీసీ సంఘాల నేత ఆర్. కృష్ణయ్యను సీఎంగా ప్రచారం చేయడం వల్ల పార్టీ శ్రేణుల్లో వ్యతిరేక భావం కలుగుతుందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. బీసీల పార్టీగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, కేసీఆర్‌పై విమర్శలు పెంచాలని తీర్మానించినట్లు సమాచారం. తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబుతో చర్చించి మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్లు సమాచారం. సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, దేవేందర్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, రేవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భావసారూప్య పార్టీలతో పొత్తు: రమణ
భావసారూప్యమున్న పార్టీలతో కలసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు రమణ వెల్లడించారు. ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో టీడీపీ పాత్రపై విస్తృతంగా ప్రచారం చేస్తూ... కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల కుట్రను ప్రజలకు వివరిస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన పార్టీ టీడీపీనేనని, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా చంద్రబాబు దాన్ని వెనక్కు తీసుకోలేదని ఎర్రబెల్లి గుర్తు చేశారు.
బీజేపీతో పొత్తుంటేనే నయం
Published Fri, Mar 28 2014 3:27 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM
Advertisement
Advertisement