సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రజావ్యతిరేకత లావాలా పెల్లుబుకుతోండటంతో టీడీపీ అభ్యర్థులకు ఓటమి భయం పట్టుకుంది. ఓటర్లను భయోత్పాతానికి గురిచేయడం ద్వారా ఆ పార్టీ దొడ్డిదారిన విజయం సాధించాలన్న దింపుడు కళ్లం ఆశలు పెట్టుకుంది. ఆ క్రమంలోనే టీడీపీ నేతలు దౌర్జన్యకాండకు తెర తీయడంతో జనం మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. చంద్రబాబు తొమ్మిదేళ్ల భయానక పాలన జిల్లా ప్రజానీకం కళ్లలో ఇప్పటికీ మెదలుతూనే ఉంది. పదేళ్లుగా ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడటం తప్ప.. ఎల్లో మీడియాను వెంటేసుకుని విమర్శల రాద్ధాంతంతోనే కాలం వెళ్లిబుచ్చుతూ వచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం వల్లె వేయడాన్ని జిల్లా ప్రజానీకం జీర్ణించుకోలేకపోయింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలను ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
టీడీపీపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్న తరుణంలోనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థులకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడికక్కడ నిలదీస్తూ టీడీపీ అభ్యర్థులను అడ్డుకుంటున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఓడీసీ మండలం టి.కుంట్లపల్లిలో హిందూపురం ఎంపీ అభ్యర్థి నిమ్మల క్రిష్టప్ప, ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డిలను ఎస్సీలు నిలదీశారు. ఐదేళ్ల తర్వాత గుర్తొచ్చామా అంటూ మండిపడ్డారు.
పెనుకొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారధిని మునిమడుగు, వెంకటరెడ్డిపల్లెల్లో తాగునీటి సమస్యను పరిష్కరించలేదంటూ ఇటీవల అడ్డుకున్నారు. టీడీపీ అభ్యర్థులందరినీ ప్రజానీకం ఇదే రీతిలో నిలదీస్తూ అడ్డుకుంటోంది. ప్రజావ్యతిరేకత దెబ్బకు టీడీపీ అభ్యర్థులకు ఓటమి భయం పట్టుకుంది. పోలింగ్‌కు నాలుగు రోజుల ముందే వాడిగా ధనాస్త్రానికి పదునుపెట్టారు. ఓవైపు ధనాస్త్రాన్ని వాడిగా ప్రయోగిస్తూనే.. ఇంకో వైపు దౌర్జన్యానికి తెరతీశారు. సూడో నక్సల్స్, మాజీ నక్సల్స్, రౌడీషీటర్లను వెంటేసుకుని.. ప్రత్యర్థి పార్టీల ప్రాబల్యం అధికంగా ఉండే గ్రామాలపై పడి ఓటర్లను తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నారు.
ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌కు ఓటమి భయం పట్టుకుంది. పయ్యావుల కేశవ్ సోదరుడు పయ్యావుల శీనప్ప దౌర్జన్యకాండకు తెరతీశారు. కూడేరు మండలం మరుట్ల, గొట్కూరు, చోళసముద్రం, కమ్మూరులోల టీడీపీ ఓటు బ్యాంకు చెల్లాచెదురైంది. ఆ గ్రామాల్లో తమకు ఓట్లు రావని గ్రహించిన పయ్యావుల శీనప్ప సూడో నక్సల్స్, మాజీ నక్సల్స్‌ను వెంటేసుకుని దౌర్జన్యం చేస్తున్నారు. ‘నా తమ్ముడిని ఓడిస్తే మీ అంతుచూస్తా’నంటూ తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నారని మరుట్ల వాసులు ‘సాక్షి’కి తెలిపారు.
తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. తమకు ఓట్లు పడవని నిర్దారించుకున్న గ్రామాలపై పడి జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు బీభత్సం సృష్టిస్తున్నారు.
రాప్తాడు నియోజకవర్గంలోనూ టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు పరాజయం దిగులు పట్టుకుంది. ఓటమి ఖాయమనే భావనకు వచ్చిన పరిటాల శ్రీరాం తమకు వ్యతిరేకంగా ఓటు వేసే గ్రామాలపై తన అనుచరులతో కలిసి దాడికి దిగుతున్నారు. ఇటీవల కనగానిపల్లి మండలం ఎలకుంట్లలో పరిటాల శ్రీరాం నేతృత్వంలోని టీడీపీ శ్రేణులు దాడి చేసిన విషయం విదితమే. ఇదే విషయంలో పరిటాల శ్రీరాంను పోలీసులు అరెస్టు చేశారు. రాప్తాడు మండలం ఎర్రగుంట్లలోనూ ఇదే రీతిలో పరిటాల శ్రీరాం బెదిరించినట్లు ఆ గ్రామ ప్రజలు ‘సాక్షి’కి తెలిపారు.
ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వరదాపురం సూరికి ఓటమి భయం వెంటాడుతోంది. ఓటమి తప్పించుకోవడానికి దౌర్జన్యకాండకు తెరతీశారు. ధర్మవరం పట్టణంలో చేనేత కార్మికులు టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉండటంతో.. ఆ వర్గాలను వరదాపురం సూరి తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నట్లు చేనేతలు ‘సాక్షి’కి తెలిపారు.
= తెలంగాణలో పోలింగ్ బందోబస్తుకు వెళ్లిన పోలీసు బలగాలు శనివారం నాటికి జిల్లాకు చేరుకున్నాయి. జిల్లాకు అదనంగా 27 ప్లాటూన్ల బలగాలు చేరుకోనున్నాయి. టీడీపీ బెదిరింపుల పర్వాన్ని గుర్తించిన రాయలసీమ ఐజీ నవీన్‌చంద్ ఇప్పటి నుంచే సమస్యాత్మక గ్రామాల్లో బలగాలను మోహరించాలని ఆదేశించారు.
టీడీపీ దౌర్జన్యకాండ
Published Sun, May 4 2014 2:06 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement