కలిసొస్తే కౌగిలి.. కాదంటే కత్తే! | There are no permanent enemies in politics | Sakshi
Sakshi News home page

కలిసొస్తే కౌగిలి.. కాదంటే కత్తే!

Published Thu, Apr 10 2014 1:51 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కలిసొస్తే కౌగిలి.. కాదంటే కత్తే! - Sakshi

కలిసొస్తే కౌగిలి.. కాదంటే కత్తే!

 రాజకీయాల్లో  శాశ్వత మిత్రులు, శాశ్వ త శత్రువులు ఉండరన్నది నానుడి. అందువల్లే ఒకప్పుడు కత్తులు దూసిన వాళ్లే కాలంతో పాటు మారి కౌగిలించుకుంటారు. పార్టీ ఏదైనా నాయకుని అంతిమ లక్ష్యం పదవి. ఆ పదవిని ఒడిసిపట్టుకునే ప్రయత్నంలోనే రాజకీయ సమీకరణలు నిమిషానికో తీరుగా మారుతుంటాయి.
 
 ఎన్నికల వేళ  మెతుకు సీమలో అవే దృశ్యాలు సాక్షాత్కరించాయి. ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు 2009లో కేసీఆర్, హరీష్‌రావుపై కత్తులు దూశారు. నువ్వెంత..అంటే నువ్వెంత అనుకుంటూ వీరు గిరిగీసుకొని సవాల్ చేసుకున్నారు. వీళ్ల సవాల్‌తో అప్పట్లో మెతుకు సీమ దద్దరిల్లింది.
 
 అప్పడేం జరిగిందంటే...
 పాపన్నపేట మండలం లక్ష్మీనగర్‌లో 343-361 సర్వే నంబర్లలో 1098. 29 ఎకరాల ప్రభుత్వ భూమిని సీమాంధ్ర వాళ్లు ఆక్రమించుకున్నారని, వాళ్ల  ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచి పెట్టాలనే డిమాండ్‌తో టీఆర్‌ఎస్ నేతలు  రెండు  రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి ప్రతి సవాల్‌గా  మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రంగంలోకి దిగారు. సిద్దిపేట మండలం రాఘవాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 810, 813, 814, 815, 827, 784/1, 817 లలోని 110.26 గుంటల ఎస్సీల భూములను కేసీఆర్‌బంధువులు అక్రమించారని ప్రత్యారోపణలు చేశారు.
 
 అంతేకాదు  రాఘవాపూర్‌కు వచ్చి సాక్ష్యాధారాలతో రుజువు చేస్తానన్నారు. దమ్ముంటే వచ్చి నిరూపించని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు సైతం మైనంపల్లికి సవాల్ విసిరారు. దీంతో 2009 నవంబర్14 ఉదయం 11 గంటలకు ప్రజా కోర్టులో నిజానిజాలు తేల్చుకుందామని  ఇద్దరు నేతలు ముహుర్తం ఖరారు చేశారు. అదే రోజున ఇద్దరు  ఎమ్మెల్యేలు తమ తమ అనుచరులతో రాఘవాపూర్‌కు వెళ్లడానికి సిద్ధం కావడంతో జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
 
 జిల్లా ఎస్పీ భారీ సాయుధ బలగాలు సిద్దిపేటలో మొహరించారు. చివరకు  మైనంపల్లి హన్మంతరావును రాఘవాపూర్ వైపు వెళ్లకుండా పట్టణ శివారులోనే పోలీసులు అరెస్టు చేసి రామాయంపేట పోలీస్టేషన్‌కు తరలించారు. దీంతో వివాదస్పద అంశం అప్పట్లో సద్దుమణిగింది. ఇక  ఆ తర్వాత కేసీఆర్ వంట మనిషి ఆంధ్రా వ్యక్తేనంటూ, కేసీఆర్ పూర్వీకులు ఆంధ్రావారేనంటూ పాపన్నపేట మండలం లక్ష్మీనగర్, మెదక్ మండలం మాచవరం గ్రామ సెటిలర్లకు మైనంపల్లి హన్మంతరావు అండగా నిలిచారు. దీంతో వారంతా 90 శాతం తమ ఓట్లను మైనంపల్లికి, టీడీపీకి వేసేవారు.  
 
 కాలచక్రం గిర్రున తిరిగితే...
 ఏదేళ్లు గడిచాయి. కాలం మారింది. కాలంతో పాటే వాళ్లు మారారు. అన్ని మర్చిపోయి ఇపుడు మిత్రులయ్యారు. ఇంతకాలం సేవ చేసిన టీడీపీ కాదు పొమ్మంటే 36 గంటల్లోనే మూడు పార్టీలు మార్చిన మైనంపల్లి చివరకు కేసీఆర్‌ను కౌగిలించుకున్నారు. కలసి వచ్చిన తమ్మునికి కేసీఆర్ మాల్కాజ్‌గిరి పార్లమెంటు  టికెటిచ్చి సత్కరించారు.
 
 ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా...పాపం కేసీఆర్- మైనంపల్లిల నడిచిన యుద్ధంలో టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యదర్శి, బీసీ నాయకుడు బీరయ్య యాదవ్ బలైపోయారు. మైనంపల్లిని ఎదుర్కొనేందుకు కేసీఆర్, హరీష్‌ల తరఫున పోరాడిన ఆయన, టీఆర్‌ఎస్ పార్టీ అభివృద్ధికి కూడా ఎనలేని సేవలందించారు. అయితే ఇపుడు ఎన్నికల వేళ మిత్రుత్వం బెడిసింది. దీంతో బీరయ్య యాదవ్ ఏకంగా కేసీఆర్‌కు రెబల్‌గా మెదక్ పార్లమెంటు స్థానానికి నామినేషన్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
 
 అప్పుడూ, ఇప్పుడూ ఆమే ప్రత్యర్థి
 శశిధర్‌రెడ్డి  కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా ఇన్‌చార్జి, డీసీసీ అధికార ప్రతినిధి.  2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ అసెంబ్లీ బరిలో నిలిచి మైనంపల్లి హన్మంతరావు చేతిలోనే ఓడిపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకుని పార్టీ కోసం పని చేశారు. తీరాా రావాల్సిన  సమయం  వచ్చే సరికి రాములమ్మ తెరపైకి వచ్చేసింది.
 
 పోయిన ఎన్నికల్లో కేసీఆర్‌తో కలిసి మెదక్ పార్లమెంటుపై గులాబీ జెండా ఎగుర వేసిన విజయంశాంతి,  ఇప్పుడు గులాబీ బాస్‌తో విరోధం పెట్టుకొని మూడు రంగుల జెండా పట్టుకుంది. అనుకోకుండా వచ్చిన అతిథిని కాంగ్రెస్ అధిష్టానం కూడా బాగానే గౌరవించింది. మెదక్ ‘అసెంబ్లీసీటు’ వేసి కూర్చోబెట్టింది. దీంతో శశిధర్‌రెడ్డి మూడు రంగుల కండువాను భుజంపైనుంచి తీసేసి రెబల్ జెండా ఎత్తుకున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement