
విశ్వసనీయత.. కుళ్లు కుతంత్రాల మధ్య పోటీ
ఈ ఎన్నికల్లో విశ్వసనీయత, నిజాయితీ ఒకవైపు.. కుళ్లు కుతంత్రాలు మరోవైపు నిలబడి పోటీ చేస్తున్నాయని, విశ్వసనీయతకే ఓటు వేసి సుపరిపాలన తెచ్చుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో జరిగిన వైఎస్ఆర్ జనభేరిలో ఆయన ప్రసంగించారు. ఈ సభలో ఆయనతో పాటు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి, పెడన ఎమ్మెల్యే అభ్యర్థి బూరగడ్డ వేదవ్యాస్ కూడా పాల్గొన్నారు. సభలో జగన్ ఏమన్నారంటే... ''రాజకీయ వ్యవస్థ చెడిపోయింది. విశ్వసనీయత, నిజాయితీ అనే పదాలు కాగడాతో వెతికినా కనిపించడంలేదు. రాబోయే రోజుల్లో చంద్రబాబు వచ్చి అదిచేస్తాను, ఇది చేస్తాను, అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాను, ఇంటికే వచ్చి ఇస్తానంటారు. ఆయన్ను ఒక్కటి అడగండి. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాటలన్నీ ఏమైపోయాయి, వాటిలో ఒక్కటైనా ఎందుకు చేయలేదని నిలదీయండి. రెండు రూపాయల కిలోబియ్యాన్ని 5.25 చేసింది నువ్వు కాదా అని నిలదీయండి. మద్యనిషేధం విధిస్తామని చెప్పి, తర్వాత నిషేధం ఎత్తేయడమే కాదు.. ఏకంగా గ్రామగ్రామాన బెల్టుషాపులు పెట్టించారు. అడ్డగోలుగా సోనియాగాంధీ మన రాష్ట్రాన్ని విడదీస్తుంటే ఒకవైపు అన్యాయమని, మరోవైపు మీ ఎంపీలతో విభజనకు అనుకూలంగా ఎందుకు ఓటేయించి రాష్ట్రాన్ని విభజించావని అడగండి. సాధ్యం కాని హామీలను ఇప్పటికీ ఇలాగే చంద్రబాబు ఇస్తున్నారు.
చంద్రబాబులా నేను అబద్ధాలు ఆడను, విశ్వసనీయత లేని రాజకీయాలు చేయను. ఆయనలా అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తానని చెప్పను. ఆయన వయసు 65 సంవత్సరాలు. ఎన్నికలు అయిన తర్వాత తానుండను, తన పార్టీ కూడా ఉండదన్న భావనతోనే ఆయన ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. నాకు ఏదైనా వారసత్వంగా వచ్చిందంటే అది విశ్వసనీయత మాత్రమే. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో.. ఇదే కృష్ణా డెల్టామీద ఆధారపడిన రైతన్నకు కనీసం ఒక్క పంటను కూడా సరిగా ఇవ్వలేదు. అదే రాజశేఖరరెడ్డి వచ్చాక పులిచింతల ప్రాజెక్టు పూర్తిచేసి వందల ఎకరాలకు నీళ్లిచ్చిన నాయకుడు దివంగత రాజశేఖరరెడ్డి. చేతలు చేయలేని చంద్రబాబు.. మాటలు మాత్రం పెద్దగా చెబుతుంటాడు. చేనేత, మత్స్యకార సోదరులకు ఒక్కటే హామీ ఇస్తున్నా. ప్రతి పేదవాడి ముఖంలోను చిరునవ్వు చూసే రోజు తీసుకొస్తా. ఈ ఎన్నికల్లో ఒకవైపు విశ్వసనీయత, నిజాయితీ ఒకవైపుంటే, మరోవైపు కుళ్లు, కుతంత్రాలున్నాయి. విశ్వసనీయతకు ఓటేసి, దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి పాలనను మళ్లీ తెచ్చుకుందాం. మీ చల్లని ఆశీస్సులు వేదవ్యాస్, పార్థసారథి ఇద్దరికీ సంపూర్ణంగా, మనస్ఫూర్తిగా అందించాలని సవినయంగా చేతులు జోడించి పేరుపేరునా ప్రార్థిస్తున్నా.''