ఘాటుగా స్పందించిన షర్మిల
ఒక సిద్దాతం, ఒక విధానం, రాజకీయాలపై ఒక స్పష్టమైన అవగాహన లేకుండా బిజెపి-టిడిపి కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత, సినీహీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. తాను ప్రచారం చేసే కూటమి గెలిస్తే రాష్ట్రానికి ఏం చేస్తుందో చెప్పకుండా కేవలం వైఎస్ జగన్మోహన రెడ్డిని విమర్శించడమే లక్ష్యంగా ఆయన ప్రసంగాలు సాగాయి. రాజకీయ నేతగా కాకుండా ప్రచారంలో వైఎస్ జగన్ను విమర్శించే పాత్రను పోషించడానికే ఆయన కాల్షీట్లు ఇచ్చినట్లు అర్ధమవుతోంది.
వైఎస్ఆర్ జనభేరి సభలలో షర్మిల మాట్లాడుతూ పవన్ ప్రసంగాలకు ధీటుగా సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ పేరుకు తగినట్లే గాలి మాటలు, సొల్లు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. రోజుకో మాట, పూటకో బాట పడుతున్న తలతిక్క పవన్‌కు తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు షర్మిల పిలుపున ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాటలు ఆయన అభిమానులకే అర్ధంకావడంలేదని చెప్పారు. 2009 ఎన్నికల్లో చంద్రబాబును అవినీతి పరుడని తిట్టిన పవన్ ఇప్పుడు ఆయకే ఓటు వేయమని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్‌కున్న విశ్వసనీయత అది అన్నారు. ఆయన విభజనవాదులతో కలిసి డ్యూయట్లు పాడుతున్నారని, చిందులు వేస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌కు పిచ్చివాడికి తేడా లేదుని చెప్పారు.
‘‘మీ ఊరికి పిచ్చోడు వచ్చి ఒక సెంటర్‌లో నిలబడి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఆ పిచ్చిమనిషి చెప్పినట్లు వింటారా? ఆ పిచ్చిమనిషి చెప్పినవారికి ఓట్లు వేస్తారా? ఆ పిచ్చోడికి పవన్ కల్యాణ్‌కు తేడా లేదు. ఆయన మొదట ఒక ఆడిటోరియం తీసుకొని పెద్ద సభ పెట్టాడు. జనసేన అనే పార్టీ పెట్టానని ఆర్భాటంగా ప్రకటించాడు. ప్రస్తుతం పోటీ చేయడం లేదు, మీ ఇష్టమొచ్చినవారికి ఆత్మసాక్షిగా ఓట్లు వేసుకోండని చెప్పాడు. వారం రోజులు కూడా తిరక్కుండానే... లేదు, లేదు నేను మోడీని కలిసొచ్చాను... మీరంతా మోడీకి ఓట్లేయండని చెప్పాడు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబుకు ఓట్లేయమని చెబుతున్నాడు. పూటకో మాట మార్చే ఈ పవన్ కల్యాణ్‌కు విలువల్లేవు.. విశ్వసనీయత లేదు. ఆయనకు ఉన్నదంతా ఒకటే... లెక్కలేనంత తిక్క. ఆ తిక్కంతా ఆయన మాటలు, చేతలు, చేష్టల్లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది’’ అని షర్మిల చెప్పారు.
ఆమె తన ప్రసంగాలలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని కూడా దుయ్యబట్టారు. చంద్రబాబుకు వైఎస్‌ఆర్ కటుంబాన్ని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేదని చెప్పారు. 2004లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదుర్కోలేక మహా కూటమి అన్న చంద్రబాబు, ఇప్పుడు ఆయన తనయుడు జగనన్నను ఎదుర్కొనేందుకు గుజరాత్ నుంచి నరేంద్ర మోడీని తెచ్చుకున్నారని విమర్శించారు. అదీ చాలక పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ఊసరవెల్లికంటే వేగంగా రంగులు మారుస్తారని ఓటర్లను హెచ్చరించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్, చంద్రబాబు తమ ఎన్నికల ప్రచారంలో కొత్తగా పెళ్లైన మొగుడు పెళ్లాంల మాదిరి ఒకరి గురించి ఒకరు గొప్పలు చెప్పుకుంటున్నారని వ్యగ్యోక్తులు విసిరారు.
ఆమె తన ప్రసంగాలలో సినిమా హీరో బాలకృష్ణను కూడా వదిలిపెట్టలేదు. తన బావ, వియ్యంకుడు చంద్రబాబు ఎక్కడ మీసం మెలేయమంటే అక్కడ బాలకృష్ణ మెలేసేస్తారని చెప్పారు. అంతేగాకుండా ఆయన ఎక్కడ తొడ కొట్టమంటే అక్కడ తొడకొడతారని కూడా అన్నారు. బాలకృష్ణకు మతిస్థిమితం లేదని అనుకేనేరు, పవన్ కళ్యాణ్కు కూడా తిక్క ఉందని, ఆ తిక్కకు లెక్కలేదని చెప్పారు.
ఎంతమంది కలిసినా జగనన్నను ఎదుర్కొనే శక్తి ఎవరికీలేదని షర్మిల స్పష్టం చేశారు. విజయం వైఎస్ఆర్ సిపిదేనని ధీమా వ్యక్తం చేశారు.