విధిలేని పరిస్థితుల్లోనే టీడీపీకి మద్దతు
చిత్తూరు బహిరంగ సభలో పవన్‌కల్యాణ్
చిత్తూరు, న్యూస్‌లైన్: విధిలేని పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తనకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషమూ లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఉదయం ఆయన చిత్తూరులో బహిరంగ సభలో మాట్లాడారు. సీమాంధ్ర తనకు కన్నతల్లి అయితే తెలంగాణ పెంచిన తల్లి అని, రెండింటి గురించి మాట్లాడే హక్కు తనకుందని అన్నారు. ఇతర రాష్ట్రాల ఎంపీలతో సీమాంధ్ర ఎంపీలను కొట్టించిన సోనియాకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇదే పవన్ అనంతపురంలో మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను టీడీపీ నెరవేర్చకపోతే జనసేన తరపున తానే పోరాటం చేస్తానన్నారు.
జనంలేక వెలవెలబోయిన సభ
చిత్తూరులో పవన్ సభ జనం లేక వెలవెలబోయింది. హాజరైన వారిలోనూ 95 శాతం మంది ఓటు హక్కులేని విద్యార్థులే ఉండడం గమనార్హం. సభలో పవన్ ప్రసంగం జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. సభ ప్రారంభమైన 15 నిమిషాలకే జనం తిరిగి వెళ్లిపోవడం మొదలుపెట్టారు.