ప్లీజ్ పవన్.. ప్లీజ్
పవన్‌కల్యాణ్ వద్దకు స్వయంగా వెళ్లిన చంద్రబాబు
పవన్ అపాయింట్‌మెంట్ కోసం బాబు తిప్పలు..
అధినేత తీరును జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ శ్రేణులు
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, మరో పదేళ్లు ప్రతిపక్ష నేతగా కొనసాగిన టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్రతం చెడ్డా ఫలితం దక్కని పరిస్థితి ఎదురైంది! ఇటీవలే జనసేన పార్టీని ఏర్పాటు చేసిన సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ను ప్రసన్నం చేసుకోడానికి పడరాని పాట్లు పడినా మద్దతుపై స్పష్టతరాలేదు. ఎన్నికల వేళ ఎన్డీయేకు మద్దతు ప్రకటించిన పవన్‌కల్యాణ్.. టీడీపీని ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయనకు దగ్గరవడానికి చంద్రబాబు నానా తిప్పలు పడ్డారు. బుధవారం చంద్రబాబే స్వయంగా పవన్ వద్దకు వెళ్లి ఆయనతో భేటీ కావడం విశేషం. ముందుగా పవన్ ఇంటికి బయలు దేరిన బాబు... ఆయన కార్యాలయంలో ఉన్నారని తెలుసుకుని కాన్వాయ్‌ను మళ్లించి మరీ వెళ్లి కలుసుకున్నారు. మాజీ సీఎం ఇంత చేసినా పవర్ స్టార్ నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న నాయకుడిగా చెప్పుకొనే బాబు ఓ సినీ నటుడి మద్దతు కోసం తాపత్రయపడటాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
బాబును దూరం పెట్టిన పవన్
తన సోదరుడు, కేంద్ర మంత్రి చిరంజీవితో విభేదాలో లేక రాజకీయాలపై ఆసక్తో తెలియదు గానీ... పవన్‌కల్యాణ్ ఇటీవలే జనసేన పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ జపం చేస్తున్న పవన్ ఇటీవల గాంధీనగర్ వెళ్లి మరీ ఆయన్ని కలిసివచ్చారు. ఎన్డీయేకు మద్దతిస్తానని బహిరంగంగా ప్రకటించారు. మొదట్లో చంద్రబాబుపై ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలేదు. తనకు నమ్మకమైన ఒకరిద్దరికి టికెట్లు ఇప్పించుకునేందుకు బాబుతో చేసుకున్న ఒప్పందం చివరి నిమిషంలో బెడిసికొట్టింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన మోడీ సభలోనూ వేదికపైనున్న చంద్రబాబును పవన్‌కల్యాణ్ పట్టించుకోలేదు. తన ప్రసంగంలోనూ మోడీని కీర్తించారే తప్ప టీడీపీ, చంద్రబాబుల ఊసే ఎత్తకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో అసహనానికి గురైన బాబు ఈ విషయాన్ని మోడీకి తెలియజేసినట్లు సమాచారం. మల్కాజిగిరిలో జయప్రకాశ్ నారాయణకు మద్దతుగా ప్రచారం చేస్తానని పవన్ చేసిన ప్రకటనను కూడా మోడీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో మోడీనే చొరవ తీసుకుని బాబు మీతో సమావేశం అవుతారని పవన్‌కు సూచించి నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా తేనీటి విందు పేరుతో బాబు స్వయంగా పవన్ వద్దకు వెళ్లి అరగంట చర్చలు జరిపారు.
పడరాని పాట్లు..
తనకు తానుగా పవన్ ఇంటికి వెళ్తే విమర్శలొస్తాయని భావించిన చంద్రబాబు.. పవనే తనను తేనీటి విందుకు ఆహ్వానించినట్టుగా తనకు అనుకూల మీడియా ద్వారా పదేపదే ప్రసారం చేయించుకున్నారు. వాస్తవానికి పవన్‌కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోసం బాబు పడరాని పాట్లు పడ్డారు. తొలుత పవన్ ఇంటికి బయలుదేరిన బాబు కొంతదూరం వెళ్లాక ... ఆయన ఇంట్లో లేరని ఆఫీసులో ఉన్నారని తెలుసుకుని మళ్లీ కారును అటు తిప్పించారు. బాబు పడ్డ ఈ యాతన చూసి ఆయన పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ పరిస్థితి వివరించిన బాబు
ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్రల్లో టీడీపీ ప్రస్తుత పరిస్థితిని పవన్‌కు చంద్రబాబు వివరించినట్లు సమాచారం. తెలంగాణ, సీమాంధ్రలో టీడీపీ ఎదుర్కొంటున్న ఇబ్బందిని ఏకరవు పెట్టి పార్టీకి మద్దతుగా ప్రచారానికి రావాలని అభ్యర్థించినట్లు తెలిసింది. రెండు ప్రాంతాల్లో ముఖ్య నాయకులుగా ఉన్న నేతలు కూడా గెలిచే పరిస్థితి లేదని, తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నందున ముందుగా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని పవన్‌ను కోరినట్లు సమాచారం. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తరువాత సీమాంధ్రలో షెడ్యూల్‌ను రూపొందిస్తామని, ప్రచారం మాత్రం చేయాల్సిందేనని పట్టుబట్టినట్లు తెలిసింది. విజయవాడ లోక్‌సభ సీటును పొట్లూరి వరప్రసాద్‌కు ఇవ్వకపోవడానికి గల కారణాలతో పాటు లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణకు మద్దతివ్వని పరిస్థితి ఎందుకొచ్చిందనే విషయాన్ని బాబు వివరించారు. సఖ్యత కొనసాగించాలని పవన్‌ను వేడుకున్నట్లు భోగట్టా. ప్రచారానికి సంబంధించి విధి విధానాలపై చర్చించినట్టు సమాచారం. బాబు అభ్యర్థనకు అంగీకరించినట్లా లేదా అన్నది పవన్ స్పష్టంగా ప్రకటించకున్నా... బాబు అనుకూల మీడియా మాత్రం టీడీపీకి మద్దతుగా ప్రచారానికి అంగీకరించినట్టు పేర్కొనడం విశేషం. భేటీ అనంతరం బాబు, పవన్‌లు మీడియా ముందుకు వచ్చినా వారి నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. పైగా పవన్ మళ్లీ మోడీ గురించే మాట్లాడారు తప్ప టీడీపీ ఊసెత్తలేదు. చంద్రబాబు గురించీ పెద్దగా ప్రస్తావించలేదు. టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తారా? అని పవన్‌ను పదేపదే ప్రశ్నించినా దానికి సమాధానం చెప్పకుండా ఆయన దాటవేయడం గమనార్హం.