
భీమవరం: ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి ధ్వజమెత్తారు. ప్రధానంగా టీడీపీలో అవినీతి అనేది తారాస్థాయికి చేరడంపై పవన్ మండిపడ్డారు. శుక్రవారం భీమవరంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. తెలుగుదేశం పార్టీలో అవినీతి యనమలకుదురు డ్రెయిన్‌లా కొంపుకొడుతుందని విరుచుకుపడ్డారు. టీడీపీలో చివరకు మట్టిమాఫియా కూడా తయారైందన్న పవన్.. గోదావరి జిల్లాల్లో తాగునీటికి ఇబ్బందులు పడటం దారుణమన్నారు. గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా టీడీపీకి 15 సీట్లను ఇస్తే.. వారు మాత్రం ఒక డంపింగ్ యార్డ్‌ను కూడా ఇవ్వలేకపోయారని విమర్శనాస్త్రాలు సంధించారు.
వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పేర్కొన్న పవన్,.. పంచాయితీ ఎన్నికలు పెడితే కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేరంటూ ఎద్దేవా చేశారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత గొడవలూ లేవని పవన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.