
రాష్ట్రంలో టీఆర్ఎస్, సెంటర్లో కాంగ్రెస్ కే టీజాక్ మద్దతు?
మౌనాలు, ముందువెనుకలు, మీనమేషాలు వదిలేసి తన మద్దతు ఎవరికో ఏప్రిల్ 14 న ప్రకటించనుంది ఇక టీ జెఏసీ. తెలంగాణలో ఎవరికి మద్దతివ్వాలో టీ జే ఏ సీ ఇంకా తేల్చుకోలేదు. అయితే టీడీపీ-బీజేపీలకు మద్దతు ఇవ్వకూడదనే విషయం పై జేఏసీ ఇప్పటికే ఒక్క నిర్ణయనికి వచ్చిందని తెలుస్తోంది.
తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను దెబ్బతిసే విధంగా వ్వవహరించిన టీడీపీతో బీజేపీ దోస్తీని టీజేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని టీజేఏసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే టీఆర్ఎస్ కాంగ్రెస్ ల విషయంలోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వకూడదన్న వాదన నానాటికీ బలపడుతోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్, తెచ్చిన టీఆర్ఎస్ విషయంలో ఎలా వ్యవహరించాలన్న విషయం పై జేఏసీ లో తీవ్ర చర్చ జరుగుతోంది. మొదట పూర్తిగా టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలనే భావించినా, తరువాత కాంగ్రెస్ పలువురు టీజేఏసీ నేతలకు టికెట్ ఇవ్వడంతో టీజేఏసీ పునరాలోచనలో పడింది.
ఏప్రిల్ 14న జరిగే సమావేశంలో అసెంబ్లీలో ఎన్నికలో ఒక పార్టీకి, పార్లమెంట్ ఎన్నికలో ఒక పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉంది. అసెంబ్లీకి టీఆర్ఎస్, పార్లమెంట్‌కు కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చే అంశాన్నీ పార్టీ పరిశీలిస్తోంది. జేఏసీ నేతలు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వారికి మద్దతివ్వాలా వద్దా అన్న అంశం కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది.