సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఊపందుకుంది. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) రూపొందించిన అభ్యర్థుల జాబితాను ఇటీవలే తెలంగాణ ఎన్నికల కమిటీకి పంపించారు. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున అభ్యర్థుల పేర్లను ఈ ప్రతిపాదిత జాబితాలో చోటు కల్పించారు. డీసీసీల నుంచి వచ్చిన జాబితాలు పరిశీలించి, అభిప్రాయాన్ని పంపాలని ఆ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ కొత్తగా ఏర్పడిన తెలంగాణ ఎన్నికల కమిటీని ఆదేశించిన విషయం విధితమే. జిల్లా నుంచి పంపిన ఈ జాబితా ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కమిటీ పరిశీలనలో ఉందని డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి పేర్కొన్నారు.
జిల్లాలో మొత్తం పది ఎమ్మెల్యే స్థానాలుండగా, రెండు చోట్ల కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. ఆసిఫాబాద్ (ఎస్టీ) నుంచి ఆత్రం సక్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నిర్మల్ నియోజకవర్గం నుంచి పీఆర్పీ నుంచి గెలుపొంది, కాంగ్రెస్‌లో చేరిన మహేశ్వర్‌రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ముగ్గురేసి ఆశావహుల పేర్లను జాబితాలో పేర్కొనగా, సిట్టింగ్ స్థానాలకు సంబంధించి ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక్కరి పేరునే జాబితాలో పేర్కొన్నారు. అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటన ప్రక్రియపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
సామాజిక వర్గాల ఆధారంగా జాబితా..
జిల్లాలో పది ఎమ్మెల్యే స్థానాలున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్ స్థానాలు ఎస్టీలకు రిజర్వు కాగా, ఆదిలాబాద్, సిర్పూర్, నిర్మల్, ముథోల్ స్థానాలు జనరల్ అయ్యాయి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో చెన్నూరు, బెల్లంపల్లి ఎస్సీలకు రిజర్వు కాగా, మంచిర్యాల స్థానం జనరల్ అయ్యింది. రిజర్వేషన్ లేని ఈ ఐదు స్థానాల్లో సామాజిక అంశాన్ని పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ప్రతిపాదిత జాబితాను రూపొందిం చారు. ఈ ఐదింటిలో కనీసం రెండు స్థానాలైనా బీసీలకు కేటాయించే అవకాశాలున్నాయని, ఆయా సామాజిక వర్గాల నేతలు భావిస్తున్నారు. మహిళా కోటా, యువత వంటి కోణాల్లో అభ్యర్థుల ఎంపిక ఉండాలని సంబంధిత వర్గాలకు చెందిన ఆశావహులు డిమాండ్ చేస్తున్నారు. మైనార్టీలకు కూడా తగిన స్థానం కల్పించాలనే భావన వ్యక్తమవుతోంది.
మరోవైపు పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న వారిని పక్కన బెట్టి, కొత్తగా వచ్చిన వారికి టిక్కెట్లు కట్టబెడితే ఊరుకునేది కొన్ని నియోజకవర్గాల్లో డిమాండ్ తెరపైకి వస్తోంది. ఏది ఏమైనా తీవ్రస్థాయిలో గ్రూపు విభేదాలున్న ఈ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా డీసీసీ రూపొందించిన అభ్యర్థుల జాబితాలో టిక్కెటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఒకరిద్దరికి చోటు దక్కలేదు. దీంతో వారు అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ తెలంగాణ ఎన్నికల కమిటీ ముఖ్య నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు సమాచారం.
ఒక్కోచోట ముగ్గురు
Published Thu, Mar 20 2014 2:18 AM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM
Advertisement