మున్సిపల్స్ వీకేనా! | TRS face challenge in local body elections | Sakshi
Sakshi News home page

మున్సిపల్స్ వీకేనా!

Published Tue, Mar 25 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM

మున్సిపల్స్ వీకేనా!

మున్సిపల్స్ వీకేనా!

 టీఆర్‌ఎస్‌కు స్థానిక సంస్థల ఎన్నికల గండం
 వార్డులు, డివిజన్‌ల స్థాయిలో కనిపించని పార్టీ నిర్మాణం
 తెలంగాణ సెంటిమెంటుపై హక్కు తమదే  అంటున్న అన్ని పార్టీలు
 ఫలితాలు ప్రతికూలంగా ఉంటే సాధారణ ఎన్నికలపైనా ప్రభావం
 3 కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్, ఇతర పక్షాల నుంచి గట్టిపోటీ
 పలు మున్సిపాలిటీల్లో పార్టీకి అభ్యర్థులే కరువు
 కరీంనగర్, పాలమూరు, కోరుట్ల, భైంసా, బోధన్‌లలో ఎంఐఎం దెబ్బ
 దాదాపు 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపే అవకాశం
 తల పట్టుకుంటున్న ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్యనేతలు
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మెజారిటీ అసెంబ్లీ సీట్లు సాధించి, అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న టీఆర్‌ఎస్‌కు మున్సిపోల్స్ గండం ఎదురవుతోంది. కింది స్థాయిలో కనిపించని పార్టీ నిర్మాణం.. తెలంగాణ సెంటిమెంటును అన్ని పార్టీలూ పంచుకోవడం.. పలుచోట్ల సమర్థులైన అభ్యర్థులు కరువవడం.. టీఆర్‌ఎస్‌కు కలవరపాటు కలిగిస్తున్నాయి. శాసనసభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా పేర్కొంటున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏ మాత్రం దెబ్బతిన్నా.. అది సాధారణ ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉండడం ఆ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
 
 క్షేత్రస్థాయిలో నిర్మాణం లేక..
 
 తెలంగాణలోని కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్లతో పాటు 53 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఈ నెల 30న ఎన్నికలు జరగబోతు న్నాయి. మూడు కార్పొరేషన్లు పూర్తిగా మూడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉండగా.. 53 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఆయా శాసన సభ స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్నాయి. అయితే, మెజారిటీ వార్డులను గెలుచుకొనే పార్టీయే మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్ పదవులను చేపడుతుంది. ఇదే ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు ప్రతికూలంగా మారుతోంది. టీఆర్‌ఎస్ అధినేత కింది స్థాయిలో పార్టీ నిర్మాణం గురించి పట్టించుకోకపోవడం, అందరూ నాయకులే తప్ప కింది స్థాయిలో బలమైన శ్రేణులు లేకపోవడంతో ఆ పార్టీ ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది.
 
 సహకరించని శ్రేణులు..
 
 మున్సిపల్ పోరులో చాలా వార్డుల్లో ఒకరికి మించి టీఆర్‌ఎస్ నాయకులు పోటీలోకి దిగుతున్నారు. దీంతో చాలా చోట్ల సొంత పార్టీ శ్రేణులే అభ్యర్థులకు పూర్తి స్థాయిలో సహకరించని పరిస్థితి నెలకొంది. దీనికితోడు బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో ఉన్న పట్టు, కాంగ్రెస్ ఓటు బ్యాంకు తదితర అంశాలూ గులాబీ అభ్యర్థులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి.
 
 అన్ని పార్టీలదీ తెలంగాణ రాగమే..
 
 తెలంగాణ సెంటిమెంటు కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థులకు తోడ్పడే పరిస్థితి కనిపించడం లేదు. టీఆర్‌ఎస్ తమ వల్లే తెలంగాణ వచ్చిందంటే... తెలంగాణ  ఇచ్చింది తామేనని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. తమ మద్దతు లేకపోతే బిల్లు పాసయ్యేదే కాదంటూ బీజేపీ గొంతెత్తుతోంది. తెలంగాణకు అనుకూలంగా తామిచ్చిన లేఖతోనే కేంద్రం కదిలిందని టీడీపీ కూడా ప్రచారం చేసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ సెంటిమెంట్‌ను గంపగుత్తగా సొంతం చేసుకునే పరిస్థితి టీఆర్‌ఎస్‌కు కనిపించడం లేదు. దీనికితోడు వార్డుల్లో ప్రజలతో స్వయంగా పరిచయాలున్న అభ్యర్థులకు ఓటర్లు తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉండడం కూడా ప్రభావం చూపనుంది.
 
 కార్పొరేషన్లలో కాంగ్రెస్ నుంచి గట్టిపోటీ..
 
 కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, రామగుండంతో పాటు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎదురీదక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఈ మూడు కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా... టీఆర్‌ఎస్ మాత్రం పోటీ చేస్తున్న అభ్యర్థులపైనే భారం వేసింది. నిజామాబాద్‌లో 50 డివిజన్‌లకు గాను టీఆర్‌ఎస్ నాలుగు చోట్ల అభ్యర్థులనే నిలపలేదు. మేయర్ అభ్యర్థిని కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మేయర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. మేయర్ అభ్యర్థిగా కాపర్తి సుజాతను ప్రకటించారు. దీనికితోడు స్థానిక ఎమ్మెల్యే బీజేపీకి చెందిన యెండల లక్ష్మీనారాయణ కావడంతో.. ఆ పార్టీ అభ్యర్థులు కూడా పలు చోట్ల టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితం నిజామాబాద్ అర్బన్, రూరల్ అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం చూపనుంది. ఇక కరీంనగర్ జిల్లాలోని రెండు కార్పొరేషన్లలోనూ టీఆర్‌ఎస్ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్.. మెజారిటీ డివిజన్లలో తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకుని గెలుపు కోసం ప్రయత్నిస్తున్నా... కాంగ్రెస్, ఎంఐఎం నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. ఇక్కడ టీఆర్‌ఎస్ కనీసం మూడో వంతు సీట్లు గెలవడమే గొప్ప అనే పరిస్థితి. రామగుండంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ 46 సీట్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను పోటీలో నిలిపారు. నాలుగింటిలో సీపీఐ పోటీ చేస్తోంది. కానీ, టీఆర్‌ఎస్ పోటీ చేస్తున్న వాటిలో సగం వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక లోపభూయిష్టంగా ఉందని శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక్కడ ఉద్యమ నాయకులు రెబెల్స్‌గా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ కూడా గట్టిపోటీ ఇస్తుండడం టీఆర్‌ఎస్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
 
 మున్సిపాలిటీల్లో మరీ దీనం..
 
 53 మున్సిపాలిటీలు/ నగర పంచాయతీల్లో చాలా చోట్ల టీఆర్‌ఎస్‌కు ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. తెలంగాణవాదం అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణతో పాటు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో కూడా మున్సిపాలిటీల్లో మెజారిటీ స్థానాలు చేజిక్కించుకోవాలని టీఆర్‌ఎస్ భావించింది. కానీ, టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు సూచించిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం, కింది స్థాయిలో పటిష్టమైన క్యాడర్ లేకపోవడం ఆ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం.. ఆయా చోట్ల స్థానిక నాయకత్వాన్ని విశ్వాసంలోకి తీసుకుని టికెట్లు ఇస్తోంది. ఆ పార్టీకి మురికివాడలు, మైనారిటీల్లో ఉన్న ఓటుబ్యాంకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అదనపు బలం చేకూరుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌కు ఎదురేలేదని తొలుత భావించినా... ఇప్పుడు పరిస్థితి మారింది. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్‌ఎస్ బలం అంతంత మాత్రంగానే ఉంది. మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్ కొంత పుంజుకున్నా... స్థానికంగా ఐక్యత కొరవడడం వార్డుల్లో అభ్యర్థులకు ఆటంకంగా మారుతోంది.
 
 సగం అసెంబ్లీ స్థానాలపై ప్రభావం..
 
 53 మున్సిపాలిటీ, నగర పంచాయితీల్లో ఎన్నికల ఫలితాలు దాదాపు 56 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లా బోధన్, కరీంనగర్ జిల్లా కోరుట్ల, ఆదిలాబాద్ జిల్లా భైంసా, మహబూబ్‌నగర్ మునిసిపాలిటీల్లో ఎంఐఎం ప్రభావం చూపుతాయి. ఆ మున్సిపాలిటీల్లో చైర్మన్లకు ఎంఐఎం సహకారం తప్పనిసరి కానుంది. మొత్తంగా మున్సిపోల్స్ తెలంగాణలోని సగానికిపైగా అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం చూపనున్నాయి. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించకపోతే.. టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో బలం లేదనే వాదనను కాంగ్రెస్, బీజేపీలు విస్తృతంగా ప్రచారం చేసే అవకాశముందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement