
కాంగ్రెస్ ను వీడనున్న వనమా?
ఖమ్మం: మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారా? ప్రస్తుతం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే అవుననే వార్తలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పార్టీ పెట్టుకోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ రెండు పార్టీల పొత్తు నేపథ్యంలో వనమాకు స్థానికంగా సీటు లభించలేదు. ఈ తరుణంలో పార్టీలో ఉన్నా ఏమీ లాభం ఉండదని భావిస్తున్న ఆయన కాంగ్రెస్ పార్టీ పై తిరుగుబాటు జెండా ఎగురవేయనున్నారని ప్రాధమికంగా వినిపిస్తోంది.
కాంగ్రెస్- సీపీఐల పొత్తు కారణంగా కలత చెందిన వనమా వెంకటేశ్వరరావు పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే రేపు ఆయన పార్టీ కార్యకర్తలో సమావేశం కానున్నారు. పార్టీ కార్యకర్తలతో చర్చించిన అనంతరం వనమా తన రాజకీయ భవిష్య ప్రణాళికపై తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న వనమా రాజీనామా చేస్తే మాత్రం జిల్లాలో పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది.