వనమా వెంకటేశ్వరరావు
సాక్షి, కొత్తగూడెం: టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కన్ను భద్రాద్రి, ఖమ్మం జిల్లాలపైనే ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకుంటూనే ఉన్నారు. తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు కారెక్కేందుకు రంగం సిద్ధమైంది. వనమాతో నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడి ఒప్పించినట్లు తెలుస్తోంది. అనంతరం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం వనమాతో పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి, భద్రాద్రి జిల్లా అభివృద్ధి అంశాలపై వనమా కేసీఆర్, కేటీఆర్‌లతో చర్చించినట్లు సమాచారం.
దీంతో వనమా టీఆర్‌ఎస్‌లో చేరిక ఖాయమైనట్లే అని తెలుస్తోంది. చేరికకు సంబంధించిన తేదీ ఖరారు కావాల్సి ఉంది. ప్రస్తుత శాసనసభలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న వనమాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వనమా చేరికతో ఆ ప్రభావం జిల్లా మొత్తం పడనుంది. అధికశాతం కార్యకర్తలు వనమాకు మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వనమా తీసుకున్న ఈ నిర్ణయం ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు మరింత మేలు చేస్తుందని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో కలిపి టీఆర్‌ఎస్‌కు కేవలం ఒక్క ఖమ్మం స్థానంలో మాత్రమే విజయం దక్కింది.
మిగిలిన తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఖమ్మం జిల్లాలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్ ఇప్పటికే గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ కారెక్కేందుకు నిర్ణయించుకున్నారు. తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమయ్యారు. రెండు వారాల తేడాతో వరుసగా ముగ్గురు ఎమ్మెల్యేలు జిల్లా నుంచి కారెక్కేందుకు సిద్ధం కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment