ఓటమి భయంతోనే ‘డిప్యూటీ సీఎం’ల ఎర | vasireddy padma blames chandra babu naidu | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే ‘డిప్యూటీ సీఎం’ల ఎర

Published Tue, May 6 2014 1:08 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

ఓటమి భయంతోనే ‘డిప్యూటీ సీఎం’ల ఎర - Sakshi

ఓటమి భయంతోనే ‘డిప్యూటీ సీఎం’ల ఎర

చంద్రబాబుపై ధ్వజమెత్తిన వాసిరెడ్డి పద్మ
ఆయన తీరు ‘ఎమ్మెల్యే ఏడుకొండలా’ ఉంది
అంతప్రేమే ఉంటే తగిన సీట్లెందుకు ఇవ్వలేదు
 
 సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాపులకు, బీసీలకు ఉపముఖ్యమంత్రి పదవులిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎర వేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికారప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. సోమవారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు వ్యవహారం వెనకటికి దాసరి నారాయణరావు తీసిన ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’ సినిమా గుర్తుకు తెస్తోందన్నారు. ఆ సినిమాలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తక్కువైతే అందరికీ ఉప ముఖ్యమంత్రి పదవులిస్తానని ఆశచూపి ఆరుగురిని దాసరి తన వైపునకు లాక్కుంటారని, చివరిగా మరో ఎమ్మెల్యే వచ్చి తన వెంట మరొకతను కూడా ఉన్నారని, తనకూ ఉప ముఖ్యమంత్రే ఇస్తానంటే ఎలా అని ప్రశ్నిస్తే ‘నీకు ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాలే’ అని చెబుతారని ఇపుడు చంద్రబాబు చేస్తున్నదీ ఇలాగే ఉందని ఆమె ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ వెనుక కాపులు, ఇతర సామాజిక వర్గాలు ఉన్నాయని బెంబేలెత్తిన చంద్రబాబు నాలుగు ఓట్లు పొందాలనే ఎత్తుగడతో ఉపముఖ్యమంత్రి పదవులిస్తామని ఆశపెడుతున్నారని ఆమె మండిపడ్డారు.

 

నిజంగా చంద్రబాబుకు వారిపై ప్రేమ ఉంటే కాపుల ప్రాబల్య జిల్లాల్లో ఆ వర్గానికి ఎక్కువ సీట్లు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ముందు ప్రకటించినట్లు బీసీలకు టికెట్లు ఎందుకు ఇవ్వలేదన్నారు. తెలంగాణలో ఎటూ అధికారం దక్కదు కాబట్టి బీసీలకు సీఎం పదవి ఇస్తానని, రెండంకెల్లో కూడా సీట్లు వచ్చే అవకాశం లేని సీమాంధ్రలో ఉపముఖ్యమంత్రి పదవులను ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారని ఆమె వివరించారు. రాజ్యాంగంలో లేని ఉప ముఖ్యమంత్రి పదవులను ఆవర్గాలకు ఇస్తానని చెప్పడం మోసగించడమేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement