హరికృష్ణ
హైదరాబాద్: రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణకు కృష్ణా జిల్లాలోని విజయవాడ తూర్పు లేక నూజివీడు శాసనసభ నియోజకవర్గాలలో ఏదో ఒకటి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాలను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎవరికీ కేటాయించలేదు. పెనమలూరు టికెట్ లేదా హిందూపురం టికెట్ ఇవ్వమని తాను ముందే అడిగినట్లు హరికృష్ణ చెప్పారు. అయితే హిందూపురం బాలకృష్ణకు, పెనమలూరును బడే ప్రసాద్కు కేటాయించారు. కృష్ణాజిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం తనకు ఇస్తారని ఆశించినట్లు హరికృష్ణ చెప్పారు. ఈ నేపధ్యంలో కృష్ణా జిల్లాలో మిగిలి ఉన్నా విజయవాడ తూర్పు, నూజివీడు స్థానాలలో ఏదో ఒకటి ఆయనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా, కృష్ణా జిల్లా నూజివీడులో ముద్రబోయిన వెంకటేశ్వరరావు రహస్యంగా నామినేషన్ దాఖలు చేశారు. ముద్రబోయిన ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. విజయవాడ తూర్పు శాసనసభ స్థానానికి మాజీ ఎంపి, పార్టీ తూర్పు నియోజకవర్గ బాధ్యుడు గద్దె రామ్మోహన్ తన తరపున భార్య అనూరాధతో నామినేషన్ వేయించారు. ఈ రెండిటిలో ఏదైనా హరికృష్ణకు కేటాయిస్తారా లేక మొండిచేయి చూపుతారా అనేది తెలుసుకోవాలంటే వేసి చూడవలసిందే.