అటు ధనవర్షం.. ఇటు మద్యం వరద
* ప్రలోభాల పర్వంలో పతాకస్థాయి!
* గోదాముల్లో మద్యం ఖాళీ... మూతపడిన వైన్ షాపులు
* మత్తులో జోగుతున్న పల్లెలు... ఇంటింటికీ బాటిల్ బదిలీ
* గంపగుత్తగా ఓట్ల కొనుగోలు... కులపెద్దలకు విందులు
* ఐకేపీ సభ్యులకు నగదు... ఉపాధి కూలీలకు నోట్లు
* మహిళలకు చీరలు.. యువతకు క్రికెట్ కిట్లు
సాక్షి న్యూస్ నెట్‌వర్క్: ప్రచారం ముగిసిన వెంటనే తెలంగాణ పది జిల్లాల్లో ఓట్ల కొనుగోలు వ్యాపారం మొదలైంది. మద్యం ఏరులై పారుతోంది. ఓట్లకు నోట్ల కట్టలు వెదజల్లేందుకు ప్రధాన పార్టీలు... అభ్యర్థులు పోటీపడ్డారు. వరంగల్ జిల్లాలో మంగళవారం ఒక్కరోజే రూ.60 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, అన్ని నియోజకవర్గాల్లో ప్రలోభాలకు అంతు లేకుండా పోయింది. ధన, వస్తు కానుకల రూపంలో అభ్యర్థులు డబ్బును నీళ్లలా ఖర్చు చేశారు. గతంతో పోలిస్తే ప్రలోభాల పర్వం కొత్తపుంతలు తొక్కింది. ఇందుకోసం ప్రధాన పార్టీలు.. అభ్యర్థులు రకరకాల మార్గాలను ఎంచుకున్నారు. ఉదయం నుంచే పంపకాల పర్వం జోరందుకుంది. రాష్ట్రంలో మూడు ఎన్నికలు వరుసగా రావడం ఇదే తొలిసారి కావడంతో ఓట్ల రేటు అమాంతం పెరిగిపోయింది.
మునిసిపల్ ఎన్నికల్లో వార్డు సభ్యులు సైతం ఇంటింటికీ గోల్డ్ రింగ్‌లు పంపిణీ చేయడం.. ఒక్కో ఓటుకు వెయ్యి రూపాయలకు పైగా పంచడంతో ఓట్లరేట్లు ఆకాశానికి అంటాయి. ఈసారి నామినేషన్ల పర్వం నుంచే ఒక్కో పోలింగ్‌బూత్‌కు ప్రతిరోజు కొంత నగదు చేరవేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్కో పోలింగ్ బూత్‌కు రూ. అర లక్షకుపైగా కేటాయించారు. హెదరాబాద్ నుంచి కరీంనగర్‌కు ఆర్టీసీ బస్సులో రూ.99 లక్షల నగదును తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డ సంఘటన సంచలనం రేపింది. టీడీపీ ఎమ్మెల్యే విజయరమణారావు పీఏ రాజమౌళి ఈ డబ్బుతో పోలీసులకు చిక్కడంతో ఎన్నికల్లో పంచిపెట్టేందుకు తమ్ముళ్లు ఇంత భారీ మొత్తం నగదును తరలిస్తున్నట్టు తేటతెల్లమైంది. పీఏతోపాటు ఎమ్మెల్యేపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఒక్కో చోట పదికోట్లకు పైగా ఖర్చు..
పోటాపోటీ ఉన్న స్థానాల్లో అభ్యర్థులు రూ.10 కోట్లకు పైగా ఖర్చు చేయడంతో వాతావరణం వేడెక్కింది. నెల రోజులుగా తెలంగాణలోని ప్రధాన నగరాలు, పట్టణాలన్నింటా మద్యం కొరతతో వైన్‌షాపులు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. అక్రమంగా మద్యం నిల్వ చేసిన అభ్యర్థులు పల్లెల్లో బెల్ట్‌షాపుల ద్వారా ఇంటింటికీ మద్యం సీసా..బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. మారుమూల నియోజకవర్గాల్లో పల్లెలు, తండాలన్నీ ఏరులైపారిన మద్యంతో మత్తులో జోగుతున్నాయి.
కొందరు అభ్యర్థులు స్టార్ హోటల్స్, రెస్టారెంట్లకు కులపెద్దలను ఆహ్వానించి ఎన్నికల విందులతో పాటు.. నగదు ప్యాకేజీలు ముట్టజెప్పారు. ఒక ప్రధాన పార్టీ ఐకేపీ సంఘాలు, ఉపాధి హామీ కూలీలను టార్గెట్‌గా చేసుకొని నగదు బదిలీ చేసింది. గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులంతా స్వశక్తి సంఘాల మహిళలు, కులసంఘాలు, యువతను టార్గెట్‌చేసి చీరెలు, క్రికెట్‌కిట్లు, డబ్బును పంచారు. రాత్రికిరాత్రే వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు అనుచరులను రంగంలోకి దింపి చాలామంది సఫలీకృతులవగా, కొంత మంది ప్రత్యర్థి పార్టీల నిఘాతో దొరికిపోయారు.
కరీంనగర్‌లో జోరుగా మద్యం
పోలింగ్‌కు ముందు రోజున కరీంనగర్ జిల్లాలో అభ్యర్థులు ప్రలోభాలకు ద్వారాలు తెరిచారు. మంథనిలో రూ.50 వేల మద్యం సరఫరా చేస్తుండగా టీఆర్‌ఎస్, టీడీపీకి చెందిన కార్యకర్తలు పట్టుకొని ధ్వంసం చేశారు. కాటారం మండలంలో మద్యంతో పాటు, కమాన్‌పూర్‌లో రూ.1.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దేవరాంపల్లిలో ఐకేపీ మహిళలకు పంచుతున్న రూ.24 వేలు పట్టుకున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఒక ప్రధాన పార్టీ అభ్యర్థి క్రికెట్ కిట్లు, దుర్శేడ్‌లో ఒక ట్రాలీ నిండా చీరెలు పంపిణీ చేస్తూ దొరికిపోయారు. నగరంలో అదనంగా క్రికెట్‌కిట్లు ఉన్న స్పోర్ట్స్‌షాప్‌ను పోలీసులు సీజ్ చేశారు. రామగుండం నియోజకవర్గం గోదావరిఖనిలో రూ.3.5 లక్షలు, మానకొండూర్ నియోజకవర్గంలో రూ.1.5 లక్షలు, వేములవాడ నియోజకవర్గంలోని నాంపల్లిలో రూ.1.20 లక్షలు పట్టుకున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం పందిళ్లలో రూ. 40 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌లో టీడీపీ మండలాధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ ఇంటిలో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన రూ.లక్ష నగదు, 19 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎంపీ రాథోడ్ రమేశ్ కుమారుడు రాథోడ్ రితేశ్ పోటీ చేస్తున్నారు.
వరంగల్ జిల్లాలో ఒక్కరోజే రూ.60 లక్షలు స్వాధీనం
వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు స్టేషన్ ఘన్‌పూర్, భూపాలపల్లి, పరకాల నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ నేతల నుంచి రూ.60 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో పోలీసులు మంగళవారం నాడు రూ.2,17 లక్షలు, 3.261 కిలోల బంగారం, 24.512 కిలోల వెండి పట్టుకున్నారు. అక్రమంగా సరఫరా చేస్తున్న 2,208 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. మంగళవారంనాడు జిల్లాలో మూడు లక్షల విలువ చేసే మద్యాన్ని ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా వైరాలోని గాంధీనగర్‌లో టీడీపీ ఎంపీ అభ్యర్థి తరఫున డబ్బు పంచుతున్న నేతలనుంచి పోలీసులు రూ.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
నల్లగొండలో కోటివిలువైన మద్యం, 4 కోట్ల నగదు
నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 4.19 కోట్ల నగదు, 127 వాహనాలు, 5 మద్యం దుకాణాలను సీజ్ చేశారు. 6600 లీటర్ల నాటుసారా, 3800 బీర్లు, 16 వేల క్వార్టర్లు, 770 హాఫ్ బాటిళ్లు, 650 ఫుల్ బాటి ళ్లు, 90 వేల కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ శాఖ 2,246 కేసులు నమోదు చేసింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలగకుండా 6,562 మందిని బైండోవర్ చేశారు.
పాలమూరులో 8 కోట్లు,రంగారెడ్డిలో 22 కోట్లు పట్టివేత
మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటివరకు 7.74 కోట్ల నగదు పట్టుబడగా, 111 కేసులు నమోదయ్యాయి. మద్యం తరలింపుపై 577 కేసులు నమోదు చేయగా, 54,809 మద్యం సీసాలు, 23,086 కిలోల నల్లబెల్లం, 4145 కిలోల పటిక, 200 కిలోల నవాసారం (సారాతయారీకి ఉపయోగించేది) జప్తు చేశారు. 800 మందిని బైండోవర్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో 20 రోజుల వ్యవధిలోనే రూ.110 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. నోటిఫికేషన్ నాటి నుంచి ఇప్పటివరకు రూ.22.5కోట్ల నగదు పట్టుకున్నారు.