* రాజమండ్రి సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
* వైఎస్సార్ జనభేరికి పోటెత్తిన జనం
* నిజాయితీకి ప్రతిరూపం వైఎస్.. మాట ఇస్తే ఎందాకైనా వెళ్లేవారు
* టీడీపీ అధినేత చంద్రబాబుది రాక్షస పాలన..
* ఆయనలా చందమామను కిందికి తెచ్చిస్తానని నేను అబద్ధాలు చెప్పలేను
సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: ‘‘రాముడి రాజ్యమైతే మనం చూడలేదు కానీ రాజశేఖరరెడ్డి సువర్ణయుగం మనమంతా చూశామని గర్వంగా చెప్పవచ్చు. నిజాయితీకి ప్రతిరూపం వైఎస్సార్. విశ్వసనీయతకు అర్థం తీసుకువచ్చిన నాయకుడు వైఎస్సార్. ఆయన ఏనాడూ అబద్ధాలు చెప్పలేదు. ఏదైనా మాట ఇస్తే ఎంతదాకా అయినా వెళ్లేవారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణయుగం స్ఫూర్తి ఒకవైపు ఉంటే.. చంద్రబాబు రాక్షస పాలన మరోవైపు మనం చూశాం. చంద్రబాబులా అబద్ధాలు ఆడటం నాకు రాదు. చంద్రబాబు మాదిరిగా చందమామను కిందికి తీసుకువస్తానని నేను అబద్ధాలు చెప్పలేను.
ఒక్కమాటైతే చెబుతున్నా.. మరో రెండు నెలల్లో వచ్చే అన్ని ఎన్నికల్లోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి.. వైఎస్సార్ కలలుగన్న ఆ సువర్ణయుగాన్ని మనమంతా ఒక్కటై కలిసికట్టుగామళ్లీ నిర్మిద్దాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని రాత్రి రాజమండ్రి రోడ్డు కం రైలు వంతెన మీదుగా రాజమండ్రి చేరుకున్న ఆయన, తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్‌లో జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’ సభలో జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు.
వైఎస్ ఇప్పటికీ ప్రజల గుండెల్లోనే ఉన్నారు..
‘‘రాజకీయ నాయకుడు ఎలా ఉండాలని అంటే వైఎస్ ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. ‘ఎన్నాళ్లు బతికామన్నది కాదు... ఎలా బతికామన్నదే ముఖ్యం.. ప్రజల గుండెల్లో ఎన్నేళ్లు నిలిచామన్నదే ముఖ్యం అని అనేవారు. ఈవేళ ఇంతటి ఆప్యాయత, ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న మీ మధ్యకు వచ్చి, రాజశేఖరరెడ్డి ఎక్కడ ఉన్నారని అడిగితే.. మీరంతా నేరుగా చేతులు గుండెలపై పెట్టి.. మా గుండె లోతుల్లో ఆ ప్రియతమ నేత బతికే ఉన్నాడని చెబుతారు. ఎందుకంటే.. అంతలా ఆయన ప్రజలకోసం బతికాడు కాబట్టి’’ అని జగన్ గుర్తుచేసుకున్నారు. ‘‘ఈ రోజు కనీసం ఆరేడుమంది దారి పొడవునా నా దగ్గరకు వచ్చి కలిశారు. మీ నాయన పుణ్యం వల్ల మేం బతికే ఉన్నామని తమ గుండెలు చూపి చెప్పారు. ఒక పేదవాడు అప్పుల పాలవకుండా లక్షలు ఖర్చయ్యే వైద్యం ఉచితంగా చేయించుకుని చిరునవ్వుతో ఇంటికి వచ్చే పరిస్థితి ఉందంటే అది రాజశేఖరరెడ్డి దయవల్లనే’’ అని అన్నారు. ‘‘అలాగే చాలామంది విద్యార్థులను కలిశారు. ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలను చూసి మురిసిపోయాను. ‘మీ నాయన పుణ్యమా అని మేము ఇంజనీరింగ్ చదువుతున్నాం’ అని వారు చెబుతున్నప్పుడు నిజంగా చాలా సంతోషమనిపించింది’’ అని జగన్ అన్నారు.
కోడ్‌తో క్లుప్తంగా సాగిన ప్రసంగం..
ఎన్నికల కోడ్‌ను జగన్ తు.చ. తప్పకుండా పాటించారు. కోడ్ అమలులో ఉండటంతో రాత్రి పది గంటలకు ఒక్క నిమిషం ముందుగానే జగన్‌ప్రసంగాన్ని ముగించేశారు. ప్రజలు ఇంకా మాట్లాడాలని గట్టిగా పట్టుబట్టినప్పటికీ మౌనంగా అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
పశ్చిమ రోడ్ షోలో జనహోరు
అంతకుముందు పశ్చిమగోదావరి జిల్లాలో వరుసగా నాలుగో రోజు రోడ్ షో నిర్వహించిన జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు హారతులు పట్టారు. ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా జనం ఆయన కోసం గంటల తరబడి రోడ్లపై నిలబడి ఎదురుచూశారు. వచ్చీరాగానే పోటీపడి ఆయనతో చేయి కలిపారు. ఆయనతో మాట్లాడి సంబరపడ్డారు. ఉదయం 10 గంటలకు కొవ్వూరు నియోజకవర్గంలోని చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంలో మొదలైన రోడ్ షో ఎస్ ముప్పవరం, ఊనగట్ల, మీనానగరం, చాగల్లు, పంగిడి గ్రామాల మీదుగా కొవ్వూరు చేరుకోవడానికి రాత్రి తొమ్మిది గంటల సమయం పట్టిందంటే జనం ఏస్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
సాయంత్రం కొవ్వూరు పట్టణంలో ప్రతి వీధిలోనూ జగన్‌ను చూసేందుకు జనం బారులు తీరి నిలుచున్నారు. ఆ తర్వాత కొవ్వూరు నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వెళ్లారు. 9.20 గంటలకు రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్న జగన్ అక్కడి నుంచి 9.50 గంటలకు క్వారీ సెంటర్‌లోని సభాస్థలికి చేరుకున్నారు. క్లుప్తంగా ప్రసంగించారు. మంగళవారం రాజమండ్రిలో జగన్ రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్ షోలో పార్టీ నేతలు బొడ్డు వెంకటరమణ చౌదరి, తానేటి వనిత, బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు, జూపూడి, కొత్తపల్లి సుబ్బారాయుడు, రౌతు సూర్యప్రకాశరావు, పిల్లి సుభాష్, జ్యోతుల నెహ్రూ, జక్కంపూడి విజయలక్ష్మి, తలారి వెంకట్రావు, ఎస్.రాజీవ్‌కృష్ణ, బొమ్మన రాజ్‌కుమార్, ఆకుల వీర్రాజు, తలశిల రఘురాం, కొల్లి నిర్మలకుమారి, కృష్ణబాబు, జీఎస్ రావు, మోషేన్‌రాజు, గాదిరాజు సుబ్బరాజు, బండి అబ్బులు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలో చేరిన వీవీ వినాయక్ సోదరుడు
సినీ దర్శకుడు వీవీ వినాయక్ సోదరుడు సురేంద్రకుమార్ సోమవారం జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఇప్పటివరకూ చాగల్లు మండలంలో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న సురేంద్ర మెడలో కండువా కప్పి జగన్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.
‘అమ్మ ఒడి’తో ఆదుకుంటా..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘అయ్యా.. నా భర్త చనిపోయాడు.. కుటుంబానికి పెద్ద దిక్కులేదు. ఇద్దరు ఆడపిల్లలను చదివిం చలేకపోతున్నాను’ అంటూ పశ్చిమగోదావరి జిల్లా ఎస్. ముప్పవరంలో మహిళ గెల్లా రాహెల్ వైఎస్ జగన్ వద్ద ఆవేదన వ్యక్తంచేసింది. రోడ్ షోలో వెళుతున్న జగన్ వద్దకు తన ఇద్దరు పిల్లలను తీసుకొచ్చి ఆమె తన కష్టాలు చెప్పుకొంది. గతంలో ఆడ పిల్లల పథకానికి దరఖాస్తు పెట్టుకున్నా రాలేదని, మీరే న్యాయం చేయాలని వేడుకుంది. ‘‘అమ్మా అధైర్యపడకు.. మన ప్రభుత్వం వచ్చాక అమ్మఒడి పథకం అమలు చేస్తాం.. నీ ఇద్దరి పిల్లలను నేను చదివిస్తాను. పిల్లలను పనికి కాకుండా బడికి పంపితే ఒక్కొక్కరికి రూ.500 చొప్పున కుటుంబానికి ఇద్దరు పిల్లలకు నెలకు వెయ్యి రూపాయలు తల్లి బ్యాంకు ఖాతాలో వేయిస్తాను’’ అని భరోసా ఇచ్చారు. కళ్లు పోయాయని, భర్త లేడని, సొంతిల్లు కూడా లేక చెట్టు కిందే ఉంటున్నానని ఊనగట్లలో అన్నంరెడ్డి పద్మ జగన్‌ను కలిసి కన్నీళ్లు పెట్టుకుంది. కొన్ని రోజులు ఓపిక పట్టాలని, రాబోయే ప్రభుత్వంలో అందరికీ మంచి జరుగుతుందని జగన్ ధైర్యం చెప్పారు.
సువర్ణయుగాన్ని మళ్లీ తెద్దాం: వైఎస్ జగన్
Published Tue, Mar 18 2014 2:19 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement