జనసమ్మోహనం
జనసమ్మోహనం
Published Fri, Apr 4 2014 2:05 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
సాక్షి ప్రతినిధి, విజయనగరం : గతనెల 28న జిల్లాలో ప్రారంభమైన వైఎస్ జగన్ జనభేరి యాత్ర ఈ నెల 2వ తేదీ వరకూ సుమారు 215 కిలోమీటర్ల మేర సాగింది. నాలుగు మున్సిపాల్టీలు, 75 గ్రామాల మీదుగా జగన్ పర్యటించారు. తొలిరోజు విజయనగరం నుంచి మొయిద వరకు, రెండో రోజు మొయిద నుంచి చీపురుపల్లి వరకు, మూడో రోజు చీపురుపల్లి నుంచి గజపతినగరం వరకు రోడ్‌షో నిర్వహించారు. నాలుగో రోజైన మార్చి 31న ఉగాది పర్వది నం కావడంతో విరామమిచ్చారు. ఏప్రిల్ ఒకటో తేదీన బొబ్బిలి నుంచి సాలూరు వరకు రోడ్ షో నిర్వహించారు. చివరి రోజైన బుధవారం పార్వతీపురం నుంచి కురుపాం వరకు రోడ్‌షో సాగింది. ఈ క్రమంలో వేలాది మందిని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలుసుకున్నారు. వందలాది మందితో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కష్టనష్టాలను విన్నారు. నిరుపేదల కన్నీళ్లు తుడిచారు. వికలాంగుల గోడు వినిచలించిపోయారు. వృద్ధుల ఆవేదన, ఆర్తనాదాలను కళ్లారా చూశారు. అండగా ఉంటానని, రెండు నెలలు ఓపిక పట్టండని భరోసా ఇచ్చారు.
ఐదు సంతకాలతో భరోసా..
ఐదు సంతకాలతో ప్రజల దశ, దిశ మార్చుతానని అభయమిచ్చారు. బడికి పంపించే ఇద్దరు పిల్లలకు అమ్మఒడి పథకం కింద నెలకు రూ.వెయ్యి చొప్పున బ్యాంకు ఖాతాలో వేస్తానని హామీ ఇచ్చారు. అప్పులు పాలవుతున్న డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించి అండగా నిలిచారు. గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి చేదోడువాదోడుగా ఉంటానని రైతన్నకు భరోసా ఇచ్చారు. అవ్వా తాతలకు నెలకు రూ.700 పింఛను ఇస్తానని హామీ ఇచ్చి బతుకుపై ధీమా కల్పించారు. ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో ఒక ఆఫీసు తెరిచి, అక్కడే అన్ని పరికరాలను పెట్టి అడిగిన 24 గంటల్లో ఏ కార్డు అయినా అందిస్తానని, అవస్థల నుంచి యువతకు విముక్తి కల్పిస్తానని ప్రకటించారు. విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని, తొలగించిన 133 రోగాలను రాజీవ్ ఆరోగ్య శ్రీలో తిరిగి చేరుస్తానని, జిల్లాకొక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. రూ.100కే 150యూనిట్ల విద్యుత్‌ను అందిస్తానని, రెండు ఫ్యాన్‌లు, మూడు లైట్లు, ఒక టీవీని వినియోగించుకోవచ్చని వివరించారు. 2019నాటికి ఇల్లు లేదని అనే వారు లేకుండా మరో 50 లక్షల ఇళ్లు కట్టిస్తానని, చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించే విధంగా ప్రయత్నిస్తానని, గ్రామాల్లో బెల్ట్‌షాపులు లేకుండా చేస్తానని ప్రకటించారు.
ఆచరణ సాధ్యమైన హమీలను మాత్రమే ఇవ్వడాన్ని జిల్లా ప్రజలు స్వాగతించారు. అందుకే అడుగుగడుగునా అపూర్వ స్వాగతం పలికారు. జగన్ చూపిన ఆప్యాయతను మరవలేక కాన్వాయ్ వెంట పరుగులు తీసి టూర్ షెడ్యూల్‌లో ముందున్న గ్రామానికి చేరుకుని మరోసారి కలిసే ప్రయత్నం చేశారు. వెల్లువెత్తిన జన ప్రవాహం చూసిన మునుపెన్నడూ ఈ స్థాయిలో జన స్పందనకన్పించలేదని చర్చించుకున్నారు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఇంతజనం వచ్చారని కొన్నిచోట్ల మాట్లాడుకోవడం కన్పించింది. ఒక టీడీపీ నేత మనస్సులో ఉంచుకోలేక ‘సాక్షి’తో వైఎస్సార్ సీపీ ప్రభంజనం గురించి మాట్లాడారు. గ్రామీణప్రాంతాలలో వైఎస్సార్ సీపీకి తిరుగులేదని, జగన్ సభలకు, రోడ్‌షోకు వచ్చిన జనాలే నిదర్శనమని, ప్రజల మధ్య ఉండే నాయకుడికి జనాదరణ ఎప్పుడూ ఉంటుందని, వాళ్ల గుండెల్లోంచి ఎవరు తీసేయలేరని, వైఎస్‌ఆర్ పథకాలకే ఆ పార్టీకి శ్రీరామరక్ష అని నిర్మొహమాటంగా చెప్పారు.
సమరోత్సాహంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు
వైఎస్సార్‌సీపీకి జిల్లాలో మంచి ఊపు వచ్చింది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన అనంతరం ఫ్యాన్ స్పీడందుకుంది. కార్యకర్తలు సమరోత్సాహంతో ఉరకలెత్తుతున్నారు. కొన్నాళ్లు తెలుగుదేశానికి, మరికొన్నాళ్లు కాంగ్రెస్ కంచుకోటలా మారిన విజయనగరం జిల్లాలో ఈ సారి వైఎస్సార్ సీపీ పాగా వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రజాదరణ క్యాష్ చేసుకునేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇటు ప్రాదేశికాలు, అటు సాధారణ ఎన్నికల్లో గెలుపు కోసం పథక రచన చేస్తున్నారు. ముందుగా జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మక ఎత్తుగడతో వెళ్తున్నారు. 34 జెడ్పీటీసీ స్థానాల్లో మూడువంతులకు పైగా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు బలాబలాలను బేరీజు వేసుకుంటున్నారు. టీడీపీలో కొంత గుబులు కనిపిస్తోంది. ఇక, కాంగ్రెస్ విషయానికొస్తే ఆ పార్టీ జిల్లాలో పూర్తిగా తేలిపోయింది. రెండు మూడు చోట్ల మినహా నియోజకవర్గ నాయకత్వమే కన్పించని పరిస్థితి ఏర్పడింది. ఆ పార్టీ శ్రేణులు దాదాపు వైఎస్సార్‌సీపీలోకి వెళ్లడంతో అత్యధిక గ్రామాల్లో జెండా పట్టుకునే వారే కరువయ్యారు.
Advertisement
Advertisement