నేడు జిల్లాలో షర్మిల పర్యటన
సాక్షి, గుంటూరు: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల బుధవారం జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రకాశం జిల్లా నుంచి ఆమె మంగళవారం రాత్రి 11 గంటలకు గుంటూరు జిల్లా నరసరావుపేట చేరుకున్నారు. తమ ఆడపడుచుని చూడాలని రాత్రి పొద్దుపోయే వరకు మహిళలు సైతం రోడ్లపైనే వేచి ఉండి షర్మిలకు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల కోడ్ ఉండటంతో షర్మిల చిరునవ్వులు చిందిస్తూ ముందుకుసాగారు. నరసరావుపేటలో మహానేత తనయకు పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె స్థానిక రామిరెడ్డిపేటలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. బుధవారం సత్తెనపల్లి, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో పర్యంటించనున్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర తరువాత మాచర్ల నియోజకవర్గంలో అడుగుపెట్టనున్న షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.
షర్మిల పర్యటన సాగేదిలా..
బుధవారం ఉదయం షర్మిల నరసరావుపేట నుంచి బయలుదేరి సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లులో ఉదయం 10.30 గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడ నుంచి మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్లి సాయంత్రం 5 గంటలకు గురజాలలో నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడతారని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌లు తెలిపారు.