
పవన్ కల్యాణ్ కు లెక్కలేని తిక్క ఉంది: షర్మిల
మల్కిపురం: పవన్ కల్యాణ్కు లెక్కలేని తిక్క ఉందని, ఆయన మాటలు, చేష్టలే చెబుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ, టీడీపీల పొత్తు కొత్త సీసాలో పాతమందు వంటిదని, ఈ కూటమికి ఓట్లు దండుకోవాలనే తపన తప్ప అభివృద్ధి పట్టదని విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో శనివారం జరిగిన సభలోనూ, అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా మల్కిపురంలో శనివారం జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. జగనన్నకు మీ మొహంలో చిరునవ్వు చూడటమే ముఖ్యమన, ఓదార్పు అనే ఒక్క మాట నిలబెట్టుకోవడం కోసం సోనియాను ఎదిరించి ప్రజల కోసం పోరాడారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి ఓటు వేసి, రాజన్న రాజ్యానికి నాంది పలుకుదామని, జగనన్న నాయకత్వంలో నడుద్దామని షర్మిల కోరారు.
ఛార్జీలు, సర్ ఛార్జీలంటూ 32 వేల కోట్ల రూపాయిల భారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలపై మోపిందని, ప్రతిపక్ష నేతగా నిలదీయాల్సిన చంద్రబాబు అధికార పక్షంతో కుమ్మక్కయ్యారని షర్మిల మండిపడ్డారు. విభజన పాపంలో టీడీపీ, బీజేపీలకు సమాన భాగముందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాష్ట్ర విభజన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజించారో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం దక్కించుకోవడం కోసమా లేక రాహుల్‌ను ప్రధానిగా చేయడం కోసమా? అంటూ ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజల ఉసురు కాంగ్రెస్‌కు తగులుతుందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి రాష్ట్రాన్ని విడగొట్టి సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామంటూ మోసం చేస్తున్నారని షర్మిల విమర్శించారు.
ఆర్టికల్ 3 ప్రకారం విభజన చేయవచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, బీజేపీ, టీడీపీ గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని షర్మిల తప్పుపట్టారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోమంటే చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఏ ఒక్కరినీ పట్టించుకోలేదని, ఇప్పుడు వైఎస్ఆర్ పథకాలనే అమలు చేస్తానంటూ రాష్ట్రమంతా చంద్రబాబు తిరుగుతున్నాడని షర్మిల వ్యాఖ్యానించారు.