సాక్షి, ఖమ్మం: రాజన్న తనయ, జగనన్న సోదరి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకురాలు షర్మిలను జిల్లా అక్కున చేర్చుకుంది. ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా జిల్లాలో నాలుగురోజులు పర్యటించిన ఆమెకు ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. ఎటుచూసినా జనప్రవాహం, ఘనస్వాగతాలు, పూలవర్షం, ఆప్యాయతల మధ్య ఆమె యాత్ర సాగింది. ఎదురొచ్చిన అభిమానానికి వైఎస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందనే భరోసాను ఆమె కల్పించింది. పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో బహిరంగసభతో ఆదివారం మొదలైన షర్మిల జిల్లా పర్యటన బుధవారం మధిరలోని సిరిపురం సభతో ముగిసింది. షర్మిల యాత్రకు వచ్చిన స్పందన వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం శ్రేణుల్లో నూతనోత్తేజం నింపింది.
నాలుగురోజుల క్రితం కూసుమంచి నుంచి షర్మిల ఎన్నికల యాత్ర మొదలై తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, ఖమ్మం పట్టణం, రఘునాథపాలెం, కామేపల్లి, కారేపల్లి, గార్ల, ఇల్లెందు, టేకులపల్లి, పాల్వంచ, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం, ముల్కలపల్లి, దమ్మపేట, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వైరా, మధిర మండలాల్లో విజయవంతంగా కొనసాగింది. ఈ మండలాల్లో 30 చోట్ల ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తొలి సభలో షర్మిల ఎంత ఉత్సాహం, ఉత్తేజంతో ప్రసంగించారో చివరి రోజు వరకు అదే ఒరవడిని కొనసాగించారు.
పది నియోజకవర్గాలను చుట్టి...
జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో షర్మిల యాత్ర కొనసాగింది. నాలుగురోజుల్లో ఆమె 442 కిలోమీటర్లు పర్యటించారు. కూసుమంచి, ఖమ్మం, కారేపల్లి, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, అశ్వాపురం, సారపాక, భద్రాచలం, బూర్గంపాడు, మొరంపల్లిబంజర, ముల్కలపల్లి, దమ్మపేట, మర్లపాడు, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వైరా, మధిర సభలు ప్రభంజనం సృష్టించాయి. ఈ సభల్లో షర్మిల వైఎస్సార్, జగన్ పేరెత్తినప్పుడల్లా ఆమెను అనుకరిస్తూ నినాదాలు మార్మోగాయి.
షర్మిలయాత్ర వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. ఇరు పార్టీల శ్రేణులు కలసికట్టుగా కదం తొక్కడంతో ప్రచార సభలు జన సంద్రాన్ని తలపించాయి. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో షర్మిల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేశారు. ప్రచార సభలు సక్సెస్ కావడంతో నేతలు మలివిడత ప్రచారంపై దృష్టి పెట్టారు.
మండుటెండలో నాడు..నేడు
గత ఏడాది ఏప్రిల్ 22న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర పేరుతో మహానేత తనయ షర్మిల జిల్లాలో అడుగు పెట్టారు. ఎండలు మండుతున్నా మే 12 వరకు షర్మిల పాదయాత్ర చేశారు. తిరిగి ఏప్రిల్ 13 నుంచి 16వరకు అదే ఎండల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అన్నీ తానైన శీనన్న..
జిల్లా పార్టీ బాధ్యతలు భుజానకెత్తుకొని అన్ని తానై షర్మిల ప్రచారయాత్రను ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందుండి నడిపించారు. మహబూబాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు తన పరిధిలోకి రాకున్నా.. పినపాక, భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం కోసం షర్మిలతో పాటు ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లా అంతటా నేతలు, పార్టీ శ్రేణులను ఎక్కడిక్కడ పొంగులేటి శీనన్న కదిలించడంతో ఈ సభలు సక్సెస్ అయ్యాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. బాధ్యత ఉన్న జిల్లా నేతగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జిల్లాలో చేసిన అభివృద్ధి, ప్రతిపాదనలను ఒక్కొక్కటిగా గత ప్రభుత్వం ఎలా పక్కన పెట్టిందో తన ప్రసంగాల్లో వినిపించి ప్రజలను పొంగులేటి ఆకట్టుకున్నారు.
జిల్లాను చుట్టిన షర్మిల
Published Thu, Apr 17 2014 3:41 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement