ప్రచా..రణం | campaign in general election | Sakshi
Sakshi News home page

ప్రచా..రణం

Published Mon, Apr 21 2014 2:04 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

ప్రచా..రణం - Sakshi

ప్రచా..రణం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  ప్రచారం... ప్రచారం... ప్రచారం... జిల్లాలో ప్రధాన పార్టీలు ప్రస్తుతం పఠిస్తున్న మంత్రమిదే. నామినేషన్ల ఘట్టం దాదాపు పరిసమాప్తమైంది. తర్వాత దశ ఓటర్లను సాధ్యమైనంతగా ఆకట్టుకోవడమే.. అభ్యర్థులు ఇప్పటికే ఇంటింటి ప్రచారాలతో ముందుకు సాగుతున్నారు. మరోవైపు ప్రధాన నేతల ప్రచారాల కోసం ప్రధాన పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

 ప్రజాదరణతో ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ ఈ విషయంలోనూ ముందంజలో ఉంది. ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఒక దఫా ప్రచారాన్ని పూర్తిచేయడం మంచి ఊపునిచ్చింది. ఆయన రెండో దఫా పర్యటనతోపాటు వై.ఎస్.విజయమ్మ, షర్మిలలు కూడా ప్రచారానికి రానున్నారు.

  అత్యంత ప్రజాదరణ ఉన్న ఈ ముగ్గురు అగ్ర నేతల ప్రచారం వైఎస్సార్‌సీపీని అగ్రపథంలో నిలుపుతోంది. మరోవైపు టీడీపీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అధినేత చంద్రబాబు ప్రచార తీరు ఉన్న ఉత్సాహాన్ని నీరుగారుస్తుందని ఆ పార్టీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నంతలో బాలకృష్ణ ప్రచారంతో ప్రజలను కాస్తయినా ఆకట్టుకోవాలని భావిస్తున్నారు. ఇక గెలుపు ఆశలు లేని కాంగ్రెస్ ప్రచారంపై ‘చిరు’ఆశలే పెట్టుకుంది.

 ఆ ముగ్గురే ప్రధాన ఆకర్షణ
 అభ్యర్థుల ఎంపిక సజావుగా పూర్తి చేసిన వైఎస్సార్‌సీపీ ప్రచారంలో పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, షర్మిలలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఈ ముగ్గురిలా భారీ జనసమూహాలను ఆకర్షించగల సత్తా ఉన్న నేతలు మిగిలిన పార్టీలకు లే రు. జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే జిల్లాలో ఒక దఫా ప్రచారం ముగించారు. టెక్కలి డివిజన్‌ను ప్రచారంతో హోరెత్తించారు.

టెక్కలిలో బహిరంగ సభతోపాటు పలాస, ఇచ్ఛాపురంలలో ఆయన రోడ్‌షోలు విజయవంతమవడం పార్టీకి నూతనోత్తేజాన్నిచ్చింది. తర్వాత దశలో విజయమ్మ, షర్మిలలు జిల్లాలో త్వరలో వేర్వేరుగా ప్రచారం నిర్వహించనున్నారు. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఒకరు పర్యటిస్తారు. మరొకరు రాజాం, పాలకొండ, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు.

ఈ మేరకు విజయమ్మ, షర్మిలల ప్రచార షెడ్యూల్‌ను ఒకటిరెండు రోజుల్లో ఖరారు చేయనున్నారు. అనంతరం పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రెండో దఫా ప్రచారానికి వస్తారు. పోలింగ్ తేదీకి కొద్దిరోజుల ముందు ఆయన జిల్లాలో ప్రచారం న్విహించనున్నారు. ఈ ముగ్గురు అగ్రనేతల పర్యటనలతో జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచారం పతాకస్థాయికి చేరనుంది. కాగా పార్టీ అభ్యర్థులు గత కొన్ని రోజులుగా తమ నియోజకవర్గాల్లో ఓటర్లను కలుసుకుంటూ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

 బాలయ్యపైనే టీడీపీ భారం!
 ప్రజలను ఆకట్టుకోలేని అధినేత చంద్రబాబుతో టీడీపీ నేతల్లో గుబులు పట్టుకుంది. అందుకే ఆశలన్నీ బాలకృష్ణ ప్రచారంపైనే పెట్టుకున్నారు. టీడీపీ ప్రచారానికి ఇంతవరకు జిల్లాలో పెద్దగా సానుకూల స్పందన రాలేదు. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు శ్రీకాకుళంలో నిర్వహించిన ప్రజాగర్జన పార్టీకి చెప్పుకోదగ్గ మైలేజీ ఇవ్వలేకపోయింది. భారీగా నిధులు వెచ్చించి మరీ నిర్వహించిన ఆ సభ ప్రభావం ఒక్క రోజులోనే తుస్సుమంది.

ఇక నియోజకవర్గాల్లోకి దూసుకుపోయి ప్రజలను ఆకట్టుకోగల చరిష్మా చంద్రబాబుకు లేకపోవడం టీడీపీ అభ్యర్థులను కలవరపరుస్తోంది. అందుకే ఆయన పర్యటనలు ఏర్పాటు చేయించాలని వారు భావించడం లేదు. ఇంతవరకు జిల్లాలో చంద్రబాబు పర్యటనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయనతో బహిరంగ సభలంటేనే టీడీపీ అభ్యర్థులు హడలిపోతున్నారు. చంద్రబాబు వస్తే ఖర్చు, శ్రమ, విలువైన కాలం వృథా అని గుసగుసలాడుతున్నారు.

సినీనటుడు బాలకృష్ణ ప్రచారం తమకు కొంత లాభిస్తుందని భావిస్తున్నా.. ఆయన ప్రసంగాలు ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేవని కూడా వారే చెబుతున్నారు. ఈ సందిగ్ధతల మధ్యే బాలయ్య సోమ, మంగళవారాల్లో జిల్లాలో రోడ్‌షో నిర్వహించనున్నారు. అయితే ఇవి నరసన్నపేట, ఆమదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గాలకే పరిమితం కానున్నాయి.

మరోవైపు జనసేన పార్టీ పెట్టి బీజేపీకి మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్‌పై టీడీపీ పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. బీజేపీతో  పొత్తుపెట్టుకున్నప్పటికీ టీడీపీ అభ్యర్థులకు ప్రచారం చేసేందుకు పవన్ సుముఖత చూపలేదు. దాంతో ఆయన జిల్లాలో ప్రచారం చేసే అవకాశాలు లేవని తేలిపోయింది. ఈ నేపథ్యంలో జిల్లాలో టీడీపీ పడుతూ లేస్తూ ఎన్నికల ప్రచారాన్ని భారంగా కొనసాగిస్తోంది.

 కాంగ్రెస్ ‘చిరు’ ఆశలు ఫలించేనా!
 ప్రజావ్యతిరేకత చుట్టుముట్టిన కాంగ్రెస్ ఈ ఎన్నికల గండాన్ని గట్టెక్కడం అసాధ్యమన్న నిర్ధారణకు వచ్చేసింది.  సీట్లు ఎలాగూ గెలవలేం కనీసం  పరువు కాపాడుకునే స్థాయిలోనైనా ఓట్లు సాధించడమే ఆ పార్టీ ప్రస్తుత లక్ష్యం. కానీ ఓట్లు అడిగేందుకు ఆ పార్టీ అభ్యర్థులు చొరవగా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు.

ఇక పార్టీకి ఊపుతెచ్చే ప్రచారం ఊసే లేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి జిల్లాలో నిర్వహించనున్న ప్రచార యాత్రపైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. కానీ ఇటీవల శ్రీకాకుళం నుంచి ప్రారంభించిన బస్సు యాత్ర సందర్భంగా చిరంజీవి ప్రజలను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు.

కానీ ఏదో ప్రయత్నం చేయాలన్న ‘చిరు’ ఆశతో కాంగ్రెస్ ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసింది. చిరంజీవి ఈ నెల 23న జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాలకే ఆయన ప్రచారం పరిమితం కానుంది. శ్రీకాకుళం మున్సిపాలిటీ, గార, పోలాకి, సంతబొమ్మాళి మండలాల మీదుగా రోడ్‌షో నిర్వహించాలని భావిస్తున్నారు.

దీనిపై మరోసారి చర్చించి చిరంజీవి ప్రచార కార్యక్రమాన్ని ఖరారు చేస్తారు. అంతకుమించి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిగానీ మరే ఇతర కీలక నేతలుగానీ కాంగ్రెస్ తరపున ప్రచారం చేసే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కళావిహీనంగానే మిగలనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement