ఎన్టీఆర్కు వెన్నుపోటు.. ఆయన ఫొటోతోనే ఓట్లా?
ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి, ఆయన పథకాలను నీరుగార్చి, ఇప్పుడు ఆయన ఫొటోలతోనే చంద్రబాబు నాయుడు ఓట్లు అడుగుతున్నారని వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. వైఎస్ఆర్ జనభేరిలో భాగంగా ఆమె గుంటూరు జిల్లా చుండూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్ విజయమ్మ పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబుది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకమని, 54 ప్రభుత్వ రంగ సంస్థలను టీడీపీ నేతలకు కట్టబెట్టి 7 లక్షల మంది కార్మికులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఉద్యోగాలిస్తే ప్రభుత్వానికి నష్టమన్న బాబు ఇవాళ మూడున్నర కోట్లు ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వైఎస్ చలవతోనే కేంద్రం దేశమంతటా రూ.65 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందని గుర్తుచేశారు. వైఎస్‌ఆర్ బతికుంటే తెలంగాణ అడిగేవారికి, ఇచ్చేవారికి దమ్ము, దైర్యం ఉండేదా అని వైఎస్ విజయమ్మ నిలదీశారు. 30 మంది ఎంపీలను గెలిపించుకుని కేంద్రాన్ని శాసించి నిధులు తెచ్చుకుందామని ప్రజలకు తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత తమ కుటుంబంతో పాటు తెలుగు ప్రజలు కూడా చాలా అవమానాలకు గురయ్యారని విజయమ్మ అన్నారు. తమ కష్టాలను ఎవరూ పూడ్చలేరు గానీ, ప్రజల కష్టాలు తీర్చేందుకు మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని ఆమె చెప్పారు. ప్రజల్లో ఒకడిగా, అందరికీ అండగా జగన్ ఉంటారని, వైఎస్ఆర్ నాటి స్వర్ణయుగం మళ్లీ జగన్ పాలనతోనే సాధ్యమని తెలిపారు. గడపగడపకూ మళ్లీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను జగన్ అందిస్తారని వైఎస్ విజయమ్మ హామీ ఇచ్చారు.