‘ప్రభంజన’భేరి
వెల్లువెత్తిన ప్రజాభిమానం.. వేలాదిగా అభిమాన జనం.. అడుగడుగునా అనూహ్య స్పందన.. సిటీజనుల ఆత్మీయ ఆదరణ.. పార్టీ జెండాల రెపరెపలు.. భారీగా బారులు తీరిన బైక్‌లు.. వెరసి వైఎస్సార్‌సీపీ ముఖ్య నేత వైఎస్ షర్మిల మంగళవారం మండుటెండలో చేసిన విస్తృత ప్రచారం పార్టీ శ్రేణుల్లో విజయోత్సాహాన్ని నింపింది. ఉదయం పదకొండు గంటలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్‌నగర్ నుంచి ప్రారంభమైన జనభేరి.. మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఎల్బీనగర్ నియోజకవర్గాల మీదుగా రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఎల్బీనగర్ చేరుకుని అక్కడ భారీ బహిరంగ సభతో ముగిసింది.
- రాజన్న బిడ్డకు అడుగడుగునా ఘనస్వాగతం
- మండుటెండలో వైఎస్ షర్మిల విస్తృత ప్రచారం
- ఐదు నియోజకవర్గాల్లో వెల్లువెత్తిన ప్రజాభిమానం
సాక్షి, సిటీబ్యూరో: వేలాదిగా జనం.. కిక్కిరిసిన కూడళ్లు.. రోడ్ షో వెంట పరుగులు.. భారీ బైక్ ర్యాలీ.. అడుగడుగునా అనూహ్య స్పందన.. వెరసి వైఎస్సార్‌సీపీ ముఖ్య నేత వైఎస్ షర్మిల మంగళవారం మండుటెండలో చేపట్టిన జనభేరికి ప్రజాభిమానం వెల్లువెత్తింది. ‘నేను రాజన్న కూతుర్ని.. మీ జగనన్న చెల్లెల్ని’ అంటూ షర్మిల ‘గ్రేటర్’ రోడ్‌షోలో చేసిన ప్రసంగం ఓటర్లలో స్ఫూర్తిని నింపింది. వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో విజయోత్సాహాన్ని కలిగించింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్‌నగర్ నుంచి ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన జనభేరి రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఎల్బీనగర్‌లో భారీ బహిరంగసభతో ముగిసింది.
ఉదయం తొమ్మిది గంటల నుంచే షాపూర్‌నగర్‌లో రహదారులన్నీ జనమయమై.. పదకొండు గంటలకు భారీ సభగా మారింది. వైఎస్ సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించినప్పుడల్లా.. ‘వైఎస్సార్ అమర్ రహే’ అన్న నినాదాలు మిన్నంటాయి. చంద్రబాబు వైఫల్యాలను ఎండ గట్టిన సమయంలోనూ జనం నుంచి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. షాపూర్‌నగర్ నుంచి బోయిన్‌పల్లి వరకు జరిగిన రోడ్డు షోలో అభిమానులు రహదారులు వెంట పరుగులు తీస్తూ షర్మిలతో కరచాలనానికి పోటీ పడ్డారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో జరిగిన సభలకు భారీ ఎత్తున యువకులు, మహిళలు తరలివచ్చి ఆయా అభ్యర్థులకు మద్దతిస్తామంటూ షర్మిలకు భరోసానిచ్చారు. ఒకేరోజు ఐదు నియోజకవర్గాల్లో సాగిన షర్మిల ప్రచారానికి భారీ ఎత్తున స్పందన వ్యక్తం కావటంతో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.
వైఎస్సార్ సీపీ నాయకులు ఎన్ రవికుమార్, జె శ్రీధర్ శర్మ నాయకత్వంలో పార్టీ ఎన్నికల గుర్తు ఉన్న జెండాలను వందలాది మంది చేత పట్టి ప్రచార రథం ముందు కదం తొక్కుతూ క్రమశిక్షణాయుతంగా నడుస్తూ అందర్నీ ఆకర్షించారు. కుత్బుల్లాపూర్ వైస్సార్ సీపీ అభ్యర్థి కొలన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన భారీ బైక్ ర్యాలీ ఆకట్టుకుంది. ఈ రోడ్‌షోలో షర్మిల వెంట మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి వి.దినేష్‌రెడ్డి, శాసనసభ అభ్యర్థులు కొలను శ్రీనివాసరెడ్డి (కుత్బుల్లాపూర్), వెంకట్రావు (కంటోన్మెంట్), జంపన ప్రతాప్ (కూకట్‌పల్లి), ఆదం విజయ్‌కుమార్ (సికింద్రాబాద్), పుత్తా ప్రతాప్‌రెడ్డి (ఎల్బీనగర్) తదితరులు పాల్గొన్నారు.
ఎంతసేపైనా షర్మిలక్క కోసం ఉంటా
ఎంత ఎండైనా ఫర్వాలేదు. షర్మిలక్క కోసం ఎంతసేపైనా వేచి ఉంటా. కాలేజి వదలి షర్మిలక్క కోసం వచ్చా. నా ఓటు కూడా అక్క ఎవరికి చెబితే వారికే వేస్తా. టీవీల్లో చూస్తున్నా కదా. షర్మిల మండుటెండలో కష్టం పడుతుంది. ఆమె రెక్కల కష్టం వృథా పోదు. కచ్చితంగా ఆమె బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తారు.
- షాలిని, ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్, నిజాంపేట్
షర్మిలక్క ప్రసంగం ఆకట్టుకుంది
రోజూ టీవీల్లో షర్మిల ప్రసంగం వింటున్నాను. ఆమె నన్ను అమితంగా ఆకట్టుకుంది. అందుకే ప్రత్యక్షంగా చూద్దామని వచ్చాను. అక్కను పలకరించి షేక్‌హ్యండ్ ఇచ్చి వెళ్తా. ఆమె మద్దతు ఇచ్చే వైఎస్సార్ సీపీ అభ్యర్థులే గెలుస్తారు. - కె.హరిశ్రీ, నిజాంపేట్